Wipro: ఆయనొక కీలక వ్యక్తి.. అయినాసరే, 10 నిమిషాల్లో తొలగించేశాం: రిషద్‌ ప్రేమ్‌జీ

కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఎంతటి వారి పైనైనా సరే చర్యలు తీసుకుంటామని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ హెచ్చరించారు. ఇటీవల ఓ కీలక వ్యక్తని కేవలం 10 నిమిషాల్లో తొలగించినట్లు వెల్లడించారు.

Updated : 22 Oct 2022 13:13 IST

బెంగళూరు: నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని విప్రో (Wipro) ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ హెచ్చరించారు. తమ కంపెనీ నియమ నిబంధనల్ని సంస్థలో పనిచేస్తున్న ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని తెలిపారు. లేదంటే వారు ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ చర్యలు తప్పవని హెచ్చరించారు. బెంగళూరులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూన్‌లైటింగ్‌ (moonlighting)కు పాల్పడిన దాదాపు 300 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు విప్రో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అదే సమయంలో కంపెనీలో అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తిని సైతం ‘నైతిక నిష్ఠను ఉల్లంఘించార(integrity violation)ని’ గుర్తించి వెంటనే తొలగించామని తాజాగా రిషద్‌ వెల్లడించారు. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిసిన 10 నిమిషాల్లోనే ఆయనకు ఉద్వాసన పలికామని తెలిపారు. సంస్థలో కీలక పదవుల్లో ఉన్న తొలి 20 మంది వ్యక్తుల్లో ఆయనొకరని వెల్లడించారు. అయితే, ఆయన ఎవరు? ఏ హోదాలో ఉన్నారన్నది మాత్రం బహిర్గతం చేయలేదు.

సదరు వ్యక్తి కూడా మూన్‌లైటింగ్‌ (moonlighting)కు పాల్పడ్డారా? లేక ఇతర ఏవైనా నిబంధనల్ని ఉల్లంఘించారా? అనే విషయాన్ని సైతం రిషద్‌ వెల్లడించలేదు. మూన్‌లైటింగ్‌ పూర్తిగా నైతిక నిష్ఠను ఉల్లఘించడమే అవుతుందని పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని