Digital Rupee: డిజిటల్‌ రూపాయి.. ప్రయోగాత్మకంగా రేపటి నుంచే

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొస్తున్న డిజిటల్‌ రూపాయి ప్రయోగాత్మకంగా రేపటి (నవంబర్‌ 1) నుంచే ప్రారంభం కాబోతోంది. టోకు అవసరాలకు వినియోగించే డిజిటల్‌ రూపాయిని తొలుత ప్రారంభించనున్నారు.

Published : 31 Oct 2022 18:14 IST

ముంబయి: డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇస్తూ, ఇప్పుడున్న కరెన్సీ నోట్లకు జతగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకొస్తున్న డిజిటల్‌ రూపాయి (e₹) ప్రయోగాత్మకంగా రేపటి (నవంబర్‌ 1) నుంచే ప్రారంభం కాబోతోంది. టోకు అవసరాలకు వినియోగించే డిజిటల్‌ రూపాయిని తొలుత ప్రారంభించనున్నారు. సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలకు డిజిటల్‌ రూపీని వినియోగించడం ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులు ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొనబోతున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ఇక రిటైల్‌ అవసరాలకు సంబంధించిన డిజిటల్‌ రూపాయిని సైతం ఓ నెల రోజుల్లో ప్రారంభించబోతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో వ్యాపారులు, వినియోగదారుల మధ్య ఈ లావాదేవీలు నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 

ఆర్‌బీఐ త్వరలోనే డిజిటల్‌ రూపాయిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)’గా వ్యవహరించే ఇ-రూపీపై కాన్సెప్ట్‌ నోట్‌ (నమూనా పత్రం)ను విడుదల చేసింది. సీబీడీసీలో ఒకటి సాధారణ లేదా రిటైల్‌ (సీబీడీసీ-ఆర్‌) అవసరాలకు వినియోగించేది కాగా.. మరొకటి టోకు (సీబీడీసీ-డబ్ల్యూ) అవసరాలకు వినియోగించేలా వర్గీకరించారు. రిటైల్‌ సీబీడీసీని అందరూ ఉపయోగించుకోవచ్చు. టోకు సీబీడీసీని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగించడానికి వీలుంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts