మొదటిసారి ఇల్లు కొంటున్నారా?రూ.5 లక్షలు పన్ను రాయితీ పొందొచ్చు.

గృహం ద్వారా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు వివిధ సెక్షన్ల కింద రూ. 5 లక్షల వరకు పన్ను తగ్గింపు ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు.

Published : 27 Jan 2022 15:29 IST

పన్ను పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు ఆదాయ పన్ను నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్ను భారం తగ్గించుకునేందుకు గృహరుణం ఎంతో ఉపయోగపడుతుంది. దంపతులిద్దరూ ఉద్యోగులు అయినప్పుడు…వారిద్దరూ చెల్లించే పన్నును కలిపి చూస్తే అది అధికంగానే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గృహరుణం ఉంటే.. పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. గృహం ద్వారా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు వివిధ సెక్షన్ల కింద రూ. 5 లక్షల వరకు పన్ను తగ్గింపు ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు. ఎలాగంటే..

సెక్షన్ 80సి..
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద గృహరుణ అసలు చెల్లింపులపై రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, రుణం ఆర్‌బీఐ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థ నుంచి గానీ, పనిచేసే సంస్థ నుంచి గానీ, విశ్వవిద్యాలయం లేదా సహకార సంఘం(కో-ఆపరేటీవ్ సొసైటి) నుంచి గానీ తీసుకుని ఉండాలి. అలాగే, ఇల్లు నిర్మాణంలో ఉన్నా, 5 సంవత్సరాల లోపు ఇంటిని విక్రయించినా డిడక్షన్ వర్తించదు. ఒకవేళ రిబేట్ క్లెయిమ్ చేసివుంటే.. ఆ మొత్తాన్ని తిరిగి మీ ఆదాయానికి జోడించి పన్ను విధిస్తారు. 

సెక్షన్ 24..
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహరుణ వడ్డీ చెల్లింపులపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు ల‌భిస్తుంది. నిర్మాణం పూర్తి అయిన త‌ర్వాత‌ మాత్రమే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవాలి. ఒకవేళ‌ నిర్మాణ సమయంలో వడ్డీ చెల్లించి ఉంటే నిర్మాణం పూర్తైన తరువాత 5 ఏళ్ళల్లో(వాయిదాలలో) అప్పటి వరకు చెల్లించిన వడ్డీని ఏడాదికి 20 శాతం చొప్పున క్లెయిమ్ చేసుకోవచ్చు. 

సెక్షన్ 80ఈఈఏ..
ఆదాయంపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 లిమిట్ పూర్తైన తర్వాత మాత్రమే సెక్షన్ 80ఈఈఏ కింద డిడక్షన్ పొందేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్ కింద రూ. 1.50 లక్షల వరకు అదనపు తగ్గింపు పొందచ్చు. ఇది 'అఫ‌ర్డ‌బుల్‌' గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర నిబంధనలు ఉన్నాయి. 

* మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసి ఉండాలి. రుణం తీసుకునే నాటికి ఎటువంటి నివాస గృహం.. రుణం తీసుకున్న వ్యక్తి పేరుపై ఉండకూడదు. 
* ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందేందుకు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి ఏప్రిల్ 1, 2021 - మార్చి 31,22 మధ్య రుణం మంజూరు అయ్యి ఉండాలి. 
* ఆస్తి స్టాంప్ డ్యూటి విలువ రూ. 45 లక్షలకు మించకూడదు. 

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ. 1.50 లక్షలు,  సెక్షన్ 24 కింద రూ.2 లక్షలు,  సెక్షన్ 80ఈఈఏ కింద రూ. 1.50 లక్షలు మొత్తంగా రూ. 5 లక్షల వరకు పన్ను రిబేట్ పొందే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని