సీనియర్ సిటిజన్ల కోసం ఐదు పెట్టుబడి మార్గాలు.

పదవీ విరమణ తరువాత సరైన ఆదాయ వనరులు లేనప్పుడు, సీనియర్ సిటిజన్లు పెట్టుబడుల నుంచి ఉత్పన్నమయ్యే రాబడులపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు.....

Published : 19 Dec 2020 13:12 IST

పదవీ విరమణ తరువాత సరైన ఆదాయ వనరులు లేనప్పుడు, సీనియర్ సిటిజన్లు పెట్టుబడుల నుంచి ఉత్పన్నమయ్యే రాబడులపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు​​​​​​​.

భారతీయులకు దీపావళి పండగ చాలా ప్రత్యేకమైనది. ఈ పండగ రోజు సన్నిహితులకు స్వీట్స్ లేదా డ్రై ఫ్రూప్ట్స్ ను బహుమతిగా ఇస్తుంటారు. మరికొందరైతే కుటుంబ సభ్యుల కొరకు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ పండగ సందర్భంగా, సీనియర్ సిటిజన్స్ కూడా మంచి పెట్టుబడుల రూపంలో వారి కోసం కొన్ని బహుమతులను అందుకోవాలి. పదవీ విరమణ తరువాత సరైన ఆదాయ వనరులు లేనప్పుడు, సీనియర్ సిటిజన్లు పెట్టుబడుల నుంచి ఉత్పన్నమయ్యే రాబడులపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు. అందువలన, సీనియర్ సిటిజన్లు వారి అసలు చెక్కుచెదరకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి అసలుపై గరిష్ట ఆదాయం వచ్చే పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. సీనియర్ సిటిజన్లకు పన్ను బాధ్యతను తగ్గించడానికి ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ. 50,000లకు పెంచింది. గతంలో ఈ పరిమితి రూ. 10,000 గా ఉండేది. సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులో ఉన్న పెట్టుబడి ఎంపికల గురించి కింద తెలుసుకుందాం.

  1. పెన్షన్ ప్లాన్స్

ఒక సీనియర్ సిటిజన్ బీమా సంస్థ నుంచి యాన్యుటీ లేదా పింఛను పథకాలను తీసుకోవచ్చు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక యాన్యుటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి మొత్తం పై ఎలాంటి పరిమితి లేదు.

రాబడులు: రాబడుల రేటు అనేది జీవిత కాలం స్థిరంగా ఉంటుంది, కానీ కొనుగోలు ధర రాబడి, స్వయంగా, జీవిత భాగస్వామికి అందే పెన్షన్ మొదలైన వంటి ఎంపికలతో మారుతూ ఉంటాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పెన్షన్ ప్లాన్ ఎల్ఐసీ జీవాన్ అక్షయ్ విషయంలో, ఒక 85 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్ ఒకవేళ జీవితకాలం మొత్తానికి యాన్యుటీ ఆప్షన్ ను ఎంపిక చేసుకున్నట్లైతే, 22 శాతం వార్షిక ఆదాయాన్ని పొందుతాడు. ఏదేమైనప్పటికీ, కొనుగోలు ధర రాబడి ఎంపిక విషయంలో, రేటు సంవత్సరానికి 6 నుంచి 7 శాతంగా ఉంటుంది.

భద్రత: బీమా సంస్థలు ఐఆర్డీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తాయి. కావున బీమా సంస్థలలో పెట్టే పెట్టుబడులను సురక్షితమైనవిగా భావించవచ్చు. ఎల్ఐసీ నుంచి తీసుకున్న ప్రణాళికలు కూడా సావరిన్ గ్యారంటీని కలిగి ఉంటాయి.

లిక్విడిటీ: పెన్షన్ ప్రణాళికలు లిక్విడ్ పెట్టుబడులు కాదు. కొనుగోలు ధరకు తిరిగి చెల్లించే ఎంపికను తీసుకున్న సందర్భంలో, కొంత మొత్తాన్ని తగ్గించిన తర్వాత ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.

పన్ను: యాన్యుటీ పథకాల ద్వారా పొందిన పింఛనుకు పన్ను వర్తిస్తుంది.

  1. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన

వడ్డీరేట్లు పడిపోవడంతో, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడటానికి, కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రణాళికకు ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఏకైక పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. ఈ పథకం ద్వారా పెన్షన్ ను నెలవారీ, త్రైమాసికం, అర్ధ వార్షిక, వార్షికం ప్రాతిపదికన తీసుకోవచ్చు. వృద్ధ దంపతులు ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు.

రాబడులు: దీని కాల వ్యవధి 10 సంవత్సరాలు, అలాగే రాబడుల రేటు సంవత్సరానికి 8.3 శాతంగా ఉంటుంది.

భద్రత: భారత ప్రభుత్వం 8.3 శాతం వడ్డీని 10 సంవత్సరాల హామీతో అందిస్తుంది.

లిక్విడిటీ: పాలసీని సరెండర్ చేయవచ్చు లేదా పాలసీ ఆధారంగా రుణం తీసుకోవచ్చు. కానీ దానికి కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.

పన్ను: పీఎంవీవీవై ద్వారా పొందే వడ్డీకి పన్ను వర్తిస్తుంది.

  1. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)

ఇది పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉంటుంది, సీనియర్ సిటిజెన్ల కోసం ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపికలలో ఎస్సీఎస్ఎస్ ఒకటి. పెట్టుబడి కాలపరిమితి ఐదు ​​సంవత్సరాలు. వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన జమ చేస్తారు. అలాగే మొత్తం పెట్టుబడులపై పరిమితి రూ. 15 లక్షలు.

రాబడులు: రేటును త్రైమాసిక ప్రాతిపదికన ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత రాబడి రేటు 8.7 శాతంగా ఉంది.

భద్రత: ప్రధాన మొత్తానికి, వడ్డీకి భారత ప్రభుత్వం హామీగా ఉంటుంది.

లిక్విడిటీ: ఎస్సీఎస్ఎస్ ముందస్తు మూసివేతను అనుమతిస్తుంది. కానీ పెట్టుబడి మొదలు పెట్టిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత మూసివేసినట్లైతే, మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 1.5 శాతం మొత్తాన్ని తగ్గిస్తారు. అదే రెండు సంవత్సరాల తరువాత మూసివేసినట్లైతే, 1 శాతం మొత్తాన్ని తగ్గిస్తారు.

పన్ను: ఎస్సీఎస్ఎస్ ద్వారా పొందే వడ్డీకి పన్ను వర్తిస్తుంది.

  1. స్థిర డిపాజిట్లు (ఎఫ్డీ)

సీనియర్ సిటిజన్లకు చెందిన స్థిర డిపాజిట్లపై బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు, ఆర్థికేతర సంస్థలు కొంత అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. స్థిర డిపాజిట్లపై వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన జమ చేస్తారు.

రాబడులు: స్థిర డిపాజిట్ రేట్లు కాలవ్యవధి, బ్యాంకు ఆధారంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఒక సంవత్సరం, ఐదు సంవత్సరాల మధ్య కాలవ్యవధితో చేసే స్థిర డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నారు.

భద్రత: స్థిర డిపాజిట్లలోని పెట్టుబడులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నియంత్రిస్తుంది. కానీ రూ. లక్ష వరకు పెట్టుబడుల మొత్తానికి మాత్రమే హామీగా ఉంటుంది.

లిక్విడిటీ: పెట్టుబడుల వ్యవధిని ఎన్నుకోడానికి అనేక ఎంపికలు ఉన్నాయి.

పన్ను: స్థిర డిపాజిట్ల పై పొందే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. అలాగే టీడీఎస్ కు లోబడి ఉంటుంది.

  1. మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)

మ్యూచువల్ ఫండ్లలో, మరీ ముఖ్యంగా డెట్ ఫండ్లలో లిమిటెడ్ ఎక్స్పోజర్ కారణంగా సీనియర్ సిటిజన్స్ కు అధిక పన్ను లాభాలను అందించవచ్చు. .

రాబడులు: దీర్ఘకాలంలో ఇతర పెట్టుబడులు కంటే మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులను అందిస్తాయి. అందువలన కొంత మూలధనాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టవచ్చు.

భద్రత: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. కావున, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు సీనియర్ సిటిజన్లు జాగ్రత్త వహించడం మంచిది.

లిక్విడిటీ: మ్యూచువల్ ఫండ్లను ఏ పని దినానైనా కొనుగోలు చేయడం లేదా రెడీమ్ చేయడం చేయవచ్చు. ద్రవ్య నిధులను వారాంతాలలో కూడా రెడీమ్ చేసుకోవచ్చు.

పన్ను: దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్లు సమర్థవంతమైన పన్ను లాభాలను అందిస్తాయి. ఈక్విటీ ఫండ్ల రెడింప్షన్ పై దీర్ఘకాల మూలధన లాభాలు (ఎల్టీసీజీ) ఆర్థిక సంవత్సరానికి రూ .1 లక్ష వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తం ఉన్నట్లయితే, 10 శాతం పన్ను రేటు వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు