Investments: రామాయణం చెప్పే 5 ఆర్థిక పాఠాలు..!
రామాయణ గాథ పెట్టుబడి పాఠాలు, ఆర్థిక ప్రణాళికనూ బోధిస్తుందంటే నమ్ముతారా? ఎలాగో చూద్దాం.....
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల్లో సత్ప్రవర్తన అలవర్చేందుకు పెద్దలు రామాయణం కథలు చెబుతుంటారు. భగవంతుడు రాముడు నడిచింది సన్మార్గమని.. ప్రతిఒక్కరూ దాన్నే అనుసరించాలని బోధిస్తుంటారు. అప్పుడే విజయం వరిస్తుందని చెబుతుంటారు. మరి రామాయణ గాథ పెట్టుబడి పాఠాలు, ఆర్థిక ప్రణాళికనూ బోధిస్తుందంటే నమ్ముతారా? అదెలాగో చూద్దాం..
సిప్‌తో రామసేతు..
సీత కోసం రాముడు లంక వెళ్లాలనుకున్నప్పుడు అనేక మార్గాలను అన్వేషించాడు. అందులో ఒకటి బ్రహ్మాస్త్రం ద్వారా సముద్రం మొత్తాన్ని ఎండిపోయేలా చేయడం. కానీ, రామచంద్రుడు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్లాలనుకోలేదు. ఓపిక, సంయమనంతో ఆలోచించి రామసేతు నిర్మించాలని నిర్ణయించాడు.
దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. చిన్న చిన్న పనుల సమాహారంతో పెద్ద లక్ష్యాన్ని చేరుకోగలమని. పెట్టుబడి రంగంలో ఆ చిన్న పనే సిప్ చేయడం. సిప్ ద్వారా ఓపికగా, దీర్ఘకాలం మదుపు చేయగలిగితే మంచి రాబడిని ఆర్జించొచ్చు.
యుద్ధానికి సైన్యం.. భరోసాకు వివిధీకరణ!
రాముడు గొప్ప యోధుడు. అయినప్పటికీ.. రావణుడి వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి పెద్ద సైన్యం అవసరమని తలచాడు. హనుమంతుడు, సుగ్రీవుల సాయంతో పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో రావణుడి సోదరుడైన వీభీషణుడి సాయం కూడా తీసుకున్నాడు. చివరకు ఆయనే రావణుడిని అంతమొందించే రహస్యాన్ని రాముడికి చెప్పాడు.
మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో సైతం ఓ బలమైన సైన్యంలా ఉండాలి. భరోసాతో కూడిన ఆర్థిక భవిష్యత్తు కోసం పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రమే ఆధారపడొద్దు. మీ మదుపును వివిధ మార్గాల్లోకి వివిధీకరించండి. బంగారం, ఈక్విటీ, డెట్.. ఇలా అన్ని మార్గాలతో పటిష్ఠమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోండి.
మెరిసేదంతా బంగారం కాదు..
సీతాదేవిని అపహరించాలని తలచిన రావణుడు బంగారు జింకను పంపి ఆమె దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తాడు. దానికోసం రాముడు, తర్వాత లక్ష్మణుడు వెళతారు. వెళ్లే ముందు లక్ష్మణుడు ఓ గీత గీసి దాన్ని దాటొద్దని సీతమ్మకు చెప్పి బయలుదేరుతాడు. కానీ, రావణుడు మారువేషంలో వచ్చి సీత గీత దాటేలా చేసి అపహరించుకుపోయాడు.
ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన ఆర్థిక నీతి ఏమిటంటే.. ఆకర్షణీయంగా కనిపించిన ప్రతిదాని వెంటా పడకూడదు. ఈ మధ్య చాలా మంది ఎలాంటి అవగాహనా లేకుండానే భారీ రాబడులు రావాలన్న ఆశతో ఎవరో చెప్పిన చిట్కాలతో స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడి పెట్టేస్తున్నారు. అదే తరహాలో క్రిప్టోకరెన్సీలు, కవర్డ్ బాండ్లలోనూ మదుపు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అడ్డదిడ్డంగా రాబడినిస్తున్నాయని చెప్పే ఏ మదుపు మార్గంలోనూ పెట్టుబడి పెట్టొద్దని ఓ లక్ష్మణ రేఖ గీసుకోవాలి.
సంజీవనిని గుర్తించలేకపోతే.. మొత్తం ఇండెక్స్‌నే ఎత్తుకొచ్చేయాలి..
రావణుడి కుమారుడు మేఘనాథుడితో పోరాడుతూ లక్ష్మణుడు తీవ్రంగా గాయపడి స్పృహతప్పి పడిపోతాడు. అప్పుడు హనుమంతుడు సంజీవని అనే ఔషధ మూలిక కోసం హిమాలయాల్లోని గంధమర్దన్ అనే పర్వతానికి చేరుకుంటాడు. కానీ, దాన్ని గుర్తించలేక ఏకంగా మొత్తం కొండనే పెకిలించుకొచ్చేస్తాడు.
అలాగే, భారీ రిటర్న్స్ ఇవ్వగలిగే మల్టీబ్యాగర్ స్టాక్స్‌ని గుర్తించడం కూడా సంజీవనిని కనిపెట్టిన తరహాలోనే కష్టమైన పని. అలాంటప్పుడు ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల తప్పుడు స్టాక్స్ ఎంపిక నుంచి తప్పించుకొని నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేస్తే.. ఆ ఇండెక్స్‌లో ఉండే అన్ని స్టాక్‌లలో మీకు వాటా లభిస్తుంది. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే.. ఆ సూచీలో ఉన్న లార్జ్‌క్యాప్ కంపెనీలన్నింటిలో మీకు వాటా ఉంటుంది. ఒకవేళ కొన్ని రాణించకపోయినా.. మిగిలిన వాటి నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.
మీ అహం మిమ్మల్ని దెబ్బ తీయొద్దు..
రావణుడు గొప్ప విజ్ఞాని. అత్యంత ప్రతిభావంతుడు. గ్రహాల కదలికల్లో సైతం జోక్యం చేసుకునేంత శక్తి ఉండేదని రామాయణం చెబుతోంది. కానీ, ఆయన ప్రతిభాపాటవాలన్నీ అహంతో కూడినవి. అదే ఆయన పతనానికి దారి తీసింది.
క్రమశిక్షణతో కష్టపడి సంపాదించిన డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెడితే.. ప్రతిఒక్కరూ ఏదో ఒక దశలో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని కూడబెట్టుకోగలుగుతారు. అది ఏమాత్రం అహానికి దారితీయకుండా చూసుకోవాలి. ఇది వ్యక్తిగత పతనానికే కాదు. ఆర్థికంగానూ దెబ్బతీస్తుంది. మనం చేసిన తప్పుల్ని గ్రహించి.. తప్పుడు మార్గంలో పెట్టిన పెట్టుబడుల్ని వెంటనే వెనక్కి తీసుకునే ధైర్యం ఉండాలి. తిరిగి వాటిని సరైన మార్గంలోకి మళ్లించాలి.
ఇలా తరచి చూస్తే రామాయణంలో నైతిక విలువలే కాదు.. ఆర్థిక పాఠాలూ కనిపిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
24సార్లు వినతిపత్రాలు ఇచ్చినా.. వందల సార్లు ఫిర్యాదుచేసినా..!
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ
-
Vizag: ‘విశాఖ వందనం’ పేరుతో రాజధాని హడావుడి
-
Drugs Case: నటుడు నవదీప్ ఫోన్లలో డేటా మాయం!
-
Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం