సుర‌క్షిత‌మైన డిజిట‌ల్‌ చెల్లింపుల కోసం 5 చిట్కాలు

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు నిర్వ‌హించేవారు బ‌ల‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఏర్పాటు చేసుకోవాలి

Updated : 30 Mar 2021 13:07 IST

సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల‌లోనూ విస్తృత‌‌మైన మార్పులు తీసుకొచ్చింది. డిజిట‌ల్ చెల్లింపులు దీనికి మిన‌హాయింపు కాదు. డిజిట‌ల్ చెల్లింపులు కొత్త‌గా వ‌చ్చింది కాదు. అయితే కోవిడ్‌-19 ప‌రిస్థితులు, లాక్‌డౌన్ కార‌ణంగా క్రెడిట్‌/డెబిట్ కార్డు, యూపీఐ, డిజిట‌ల్ చెల్లింపుల అవ‌స‌రం పెరిగింది. దీంతో వీటి ద్వారా లావాదేవీలు చేసే వారి సంఖ్య పెరిగింది.  అదేవిధంగా సైబ‌ర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఇటువంటి మోసాల భారిన ప‌డ‌కండా సౌక‌ర్య‌వంతంగా, సుర‌క్షితంగా చెల్లింపులు చేసేంద‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. 

 ఈ 5 చిట్కాలు పాటించడం ద్వారా సుర‌క్షితంగా లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌చ్చు..‌

1. వివ‌రాలు ఎక్క‌డా సేవ్ చేయద్దు:

ఆన్‌లైన్ ద్వారా ఏదైనా వ‌స్తువును కొనుగోలు చేసిన‌ప్పుడు, డెబిట్‌/క్రెడిట్ కార్డు వివ‌రాలు సేవ్ చేయ‌క‌పోవ‌డం మంచిది. ఏదైనా వ‌స్తువును ఆన్‌లైన్ పోర్ట‌ల్ ద్వారా కొనుగోలు చేసిన‌ప్పుడు, కార్డు వివ‌రాల‌ను న‌మోదు చేస్తాం. అలా న‌మోదు చేసిన‌ప్పుడు భ‌విష్య‌త్తు అవ‌స‌రాలకు వివ‌రాలు సేవ్ చేసుకునే ఆప్ష‌న్ ఇస్తున్నాయి ఇ-కామ‌ర్స్ సంస్థ‌లు. దీని ద్వారా వస్తువును కొనుగోలు చేసిన ప్ర‌తీసారి కార్డు వివ‌రాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే త్వ‌రితగ‌తిన చెల్లింపులు చేయొచ్చు. అయితే కార్డు స‌మాచారం దొంగ‌లించే అవ‌కాశం ఇవ్వ‌కుండా ఉండేందుకు కొనుగోలు ప్ర‌క్రియ పూరైయిన వెంట‌నే, ఇచ్చిన స‌మాచారం తొల‌గించ‌డం మంచింది. 

2. లావాదేవీల‌కు ప్రైవేట్ విండో ఉప‌యోగించండి..

సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ చెల్లింపుల కోసం అనుమానాస్ప‌ద యాప్‌లు, వెబ్‌సైట్‌ల‌ను నివారించాలి. ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న విశ్వ‌శ‌నీయ‌మైన యాప్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగించ‌డం మంచిది. 

ప్రైవేట్‌/వ‌ర్చువ‌ల్ బ్రౌజ‌ర్‌లను, HTTPS://  తో ప్రారంభ‌మ‌య్యే సుర‌క్షిత క‌న‌క్ష‌న్ల‌ను ఎంచుకుని మ‌రింత భ‌ద్రంగా ఆర్థిక లావాదేవీల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. అన‌వ‌స‌ర‌మైన సైట్ ఓపెన్ కాకుండా, స‌మాచారం నిల్వ చేయ‌కుండా నిరోధించి, సుర‌క్షితమైన ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను అందించే విధంగా వీటిని రూపొందించారు. లావాదేవీలు పూర్తైన అనంత‌రం వెబ్‌సైట్ నుంచి లాగ‌వుట్ కావ‌డం ఏ ప‌రిస్థితుల‌లోనూ మ‌ర‌వ‌కూడ‌దు.  

3. పాస్‌వ‌ర్డ్ చెప్ప‌ద్దు..

ఆర్థిక భ‌ద్ర‌త కోసం పాస్‌వ‌ర్డ్ ఇత‌రుల‌కు తెలియ‌ప‌ర‌చొద్ద‌ని బ్యాంకులు త‌ర‌చూ చెబుతూనే ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. దీనితో పాటు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు నిర్వ‌హించేవారు బ‌ల‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఏర్పాటు చేసుకోవాలి. సైబ‌ర్ దాడుల‌కు గురికాకుండా త‌ర‌చూ పాస్‌వ‌ర్డ్‌ల‌ను మారుస్తూ ఉండాలి. ఎవ‌రైనా పాస్‌వ‌ర్డ్, ఏటీఎమ్ పిన్ కోసం కాల్ చేస్తే వారికి స‌మాచారం ఇవ్వ‌కూడ‌దు. అటువంటి కాల్స్ వ‌స్తే బ్యాంకుకి తెలియ‌ప‌ర‌చాలి. ఒన్‌-టైమ్‌-పాస్‌వ‌ర్డ్‌(ఓటీపీ) సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డం ద్వారా మ‌రింత భ‌ద్రంగా లావాదేవీలు నిర్వ‌హించుకోవ‌చ్చు. 

పేవ‌రల్డ్ సీఈఓ ప్ర‌వీణ్ దాబాయ్ మాట్లాడుతూ - "సుర‌క్షిత‌మైన లావాదేవీల కోసం విశ్వ‌నీయ వెబ్‌సైట్‌ల‌లో మాత్ర‌మే డెబిట్‌/  క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించాలని, ఓటీపీని ఎవ‌రితోనూ పంచుకోకూడ‌దని, వెర్చువ‌ల్ కీ బోర్డును మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని, వెబ్‌సైట్ నుంచి త‌ప్ప‌నిస‌రిగా లాగ‌వుట్‌ అవ్వాలి" అని  తెలిపారు. 

4. పబ్లిక్ కంప్యూటర్లు / వై-ఫై నెట్‌వర్క్‌లను వాడ‌కండి..

ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, వంటి మోసపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవకాశం ఎక్కువ‌గా ఉన్నందున పబ్లిక్ పరికరాలు, వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండటం మంచిది.  పేరున్న, ధృవీకరించిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్‌సైట్‌లు తరచుగా ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలకు అధిక స్థాయి రక్షణను అందిస్తాయి.

"కొంత‌మంది అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో వేరే వాళ్ళ కంప్యూట‌ర్ ద్వారా, ప‌బ్లిక్ వై-ఫ్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో స‌మాచారం దొంగిలించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల మీరు తొంద‌ర‌లో ఉన్నప్పటికీ, పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ వాడిగానీ, పబ్లిక్ కంప్యూటర్ నుంచి గానీ నగదు రహిత లావాదేవీలు చేయ‌కూడ‌దు.  అన్ని ఆర్థిక లావాదేవీల కోసం మీ వ్య‌క్తిగ‌త కంప్యూటర్, వై-ఫై ల‌ను మాత్ర‌మే వాడాలి." అని వివిఫై ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు అనిల్ పినపాల తెలిపారు. 

‌5. మోస‌పూరిత యాప్‌లతో జాగ్ర‌త్త..

యాప్ స్టోర్‌, ప్లే స్టోర్ వంటి వాటిలో కూడా చ‌ట్ట‌విరుద్ధ‌మైన యాప్‌లు ఉండే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల స‌మీక్ష‌కులు ఇచ్చే రివ్యూల‌ను ప‌రిశీలించండి. త‌క్కువ సంఖ్య‌లో డౌన్‌లోడ్‌లు ఉన్న యాప్‌ల జోలికి పోకండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉంద‌ని ధృవీక‌రించుకున్న త‌రువాత మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోండి. 

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసేప్పుడు, అది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌లో ధృవీకరించారో..లేదో.. నిర్ధారించుకోండి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్‌ల‌కు కూడా చట్టబద్ధత‌ ఉండాలి. యాప్‌ల‌ను ఇస్టాల్ చేసేప్పుడు కెమెరా, ఫోన్ బుక్‌, ఎస్ఎమ్ఎస్ ప‌ఠ‌నం మొద‌లైన వాటికి అనుమ‌తి నిరాక‌రించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.  


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని