Motor Insurance: మీ వాహన బీమా ప్రీమియం భారంగా మారిందా?

ఈ ఐదు మార్గాల ద్వారా కారు బీమా ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు...

Published : 22 Mar 2022 13:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కట్టడి ఆంక్షల కారణంగా గత రెండేళ్లలో కార్లను బయటకు తీయాల్సిన అవసరం పెద్దగా రాలేదు. అయినా, వాటి బీమా ప్రీమియంలు మాత్రం చెల్లించక తప్పలేదు. బతుకుకు భరోసా, వాహనానికి భద్రత ఉండాలంటే బీమా ఉండాల్సిందే మరి. మన జీవితంలో కారు ఓ భాగమైనట్లే.. కారులో బీమా ఓ భాగం. కాబట్టి కారు నడపడం తగ్గించినా బీమా మాత్రం తీసుకోవాల్సిందే. వ్యక్తిగత, వాణిజ్య హోదాల్లో ఉపయోగించే అన్ని వాహనాలకు థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి.

ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌తో పాటు నిత్యావసర సరకుల ధరలన్నీ మండిపోతున్నాయి. మరోవైపు వాహనాలను పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమయంలో బీమా ప్రీమియం కాస్త తగ్గితే బాగుండని ప్రతిఒక్కరి మదిలోకి వచ్చిన ఆలోచన. దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఎన్‌సీబీని ఉపయోగించుకోండి..

మీ వాహన బీమా ప్రీమియంను తగ్గించుకోవడానికి ఉన్న మేలైన మార్గం నో క్లెయిం బోనస్‌ (NCB). ఒక సంవత్సరంలో మీరు బీమా క్లెయిం చేసుకోలేదంటే వచ్చే ఏడాది ప్రీమియంలో రాయితీ పొందే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం.. తొలి ఏడాదిలో 20%, రెండో సంవత్సరంలో 25%, మూడో ఏడాది 35%, తర్వాతి సంవత్సరాల్లో 45% వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రెండు తప్పులు చేయొద్దు. ఒకటి పాలసీ కాలపరిమితి ముగిసిన మూడో నెలల్లోగా పునరుద్ధరించక పోవడం. మరొకటి చిన్న చిన్న వాటికి బీమాను క్లెయిం చేయడం. పాత వాహనం అమ్మి కొత్తది తీసుకున్నా లేదా బీమా పాలసీని పోర్ట్‌ చేసుకున్నా.. ‘నో క్లెయిం బోనస్‌’ను కూడా బదిలీ చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో బీమా కొనుగోలు..

కారు బీమా పాలసీ తీసుకునే ముందు మార్కెట్‌లో ఉన్న అన్ని పథకాల్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. నియమ నిబంధనలతో పాటు ప్రయోజనాలను సరిపోల్చుకోవాలి. అందుకు ఆన్‌లైన్‌లో బీమాను కొనుగోలు చేయడం సులభమైన మార్గం. ఆన్‌లైన్‌లో వివిధ సంస్థలు అందిస్తున్న పాలసీలను సరిపోల్చుకోవడం సులభం. పైగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా పలు సంస్థలు రాయితీలు కూడా ఇస్తుంటాయి. క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో వంటి కీలక వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

డెడక్టబుల్‌ను పరిగణించండి..

మన బీమా ప్రీమియంను తగ్గించడంలో డెడక్టబుల్‌ది కీలక పాత్ర. బీమా క్లెయిం చేసుకోవడానికి ముందు పాలసీదారులు తన జేబు నుంచి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని డెడక్టబుల్‌గా వ్యవహరిస్తారు. అంటే మీ ఖర్చు ఆ కనీస మొత్తం దాటితేనే.. మీరు బీమాను క్లెయిం చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు డెడక్టబుల్‌ని జీరోగా ఎంచుకుంటే ప్రీమియం ఎక్కువుంటుంది. అదే కొంత మొత్తాన్ని మీరు భరించగలిగితే.. ప్రీమియం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మీ డ్రైవింగ్‌పై మీకు పూర్తి విశ్వాసం ఉండి.. గత కొన్నేళ్లలో బీమాను క్లెయిం చేసుకోని పరిస్థితి ఉంటే డెడక్టబుల్‌ని ఎక్కువ ఉంచుకుంటే మంచిది. తద్వారా ప్రీమియం భారీగా తగ్గించుకోవచ్చు.

మీ అవసరం ఏంటి?

మీరు పెద్దగా వ్యక్తిగత వాహనాన్ని వినియోగించరనుకుంటే మీకు ఎలాంటి బీమా పథకం కావాలో సమీక్షించుకోవాలి. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ఎలాగూ తప్పనిసరి కాబట్టి.. దీంతో పాటు సొంతంగా డ్యామేజ్ కవర్‌ తీసుకోవాలా? అనేది నిర్ణయించుకోవాలి. కొత్తగా కారు తీసుకునేవారికి ఒక సంవత్సరం సమగ్ర పాలసీతోపాటు మూడేళ్ల థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పసరి. అంటే రెండు, మూడో ఏడాదిలో వినియోగదారుడు ‘స్టాండలోన్‌ ఓన్‌ డ్యామేజ్‌’ పాలసీ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కారు పాతదై దాన్ని పెద్దగా వినియోగించనట్లైతే.. థర్డ్‌ పార్టీ సరిపోతుంది.

సకాలంలో చెల్లింపులు..

ప్రీమియం చెల్లింపులు సకాలంలో చేయాలి. నిర్ణీత గడువులోగా పాలసీని పునరుద్ధరించాలి. ఈ రెండూ పాటించని పక్షంలో రిస్క్‌ పెరిగి ప్రీమియం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సకాలంలో పాలసీ పునరుద్దరించకపోతే.. ఎన్‌సీబీ సదుపాయాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని