ఫిక్స్‌డ్ డిపాజిట్ (Vs) రిక‌రింగ్ డిపాజిట్‌ ఏది మంచిది?

వీటి అస‌లుకి, వ‌డ్డీకి ఆయా సంస్థ‌ల క‌చ్చిత‌మైన హామి ఉంటుంది.

Published : 16 Jun 2022 16:41 IST

బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఈ రెండు ర‌కాల డిపాజిట్లు ఖాతాదారులంద‌రికి సుప‌రిచిత‌మైన‌వే. పొదుపు ఖాతా త‌ర్వాత చాలా మంది ఖాతాదారులు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌, రిక‌రింగ్ డిపాజిట్ల‌లోనే డబ్బుని మ‌దుపు చేస్తుంటారు. ఒక‌ప్పుడు వీటి పొదుపుకు ఆయా శాఖ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల్సివ‌చ్చేది గాని, ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా మ‌దుపు చేయ‌వ‌చ్చు. ఖాతాదారుల‌కు పొదుపు అల‌వాటు అవ్వ‌డం ద‌గ్గ‌ర్నుంచి, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు డ‌బ్బును మ‌దుపు చేయ‌డం వ‌ర‌కు ఇవి ఎంత‌గానో ప్ర‌భావితం చేశాయి. వీటి అస‌లుకి, వ‌డ్డీకి ఆయా సంస్థ‌ల క‌చ్చిత‌మైన హామి ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ (Vs) రిక‌రింగ్ డిపాజిట్ ఎంపిక అనేది పెట్టుబ‌డి స‌మ‌యంలో మీకు ఎంత డ‌బ్బు అందుబాటులో ఉంది అనే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

రికరింగ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) అంటే:

ఎవ‌రైనా వారి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం డ‌బ్బు ఆదా చేయాల‌నుకుంటే చేయాల్సిన ఉత్త‌మ పొదుపు మార్గం మీ బ్యాంక్‌లో రిక‌రింగ్ డిపాజిట్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. డబ్బు  నిల్వ ఉన్న వారు వ‌డ్డీ రాబ‌డికై పిక్స్‌డ్ డిపాజిట్ల‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. ఈ డిపాజిట్‌లో డ‌బ్బుకి పొదుపు ఖాతా కంటే కూడా ఎక్కువ వ‌డ్డీ రేటు వ‌స్తుంది. అత్య‌వ‌స‌ర నిధి సృష్టికి, భ‌విష్య‌త్తు అవ‌స‌రాల ఖ‌ర్చుల‌కు ఈ ఖాతాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. డిపాజిట్ల ఖాతాలు తెర‌వ‌డం కూడా ఎంతో సుల‌భం. మీరు వీటిని మీ బ్యాంక్ యాప్ ద్వారా లేదా ఏదైన బ్యాంకు, పోస్టాఫీస్ శాఖ‌ను సంద‌ర్శించ‌డం ద్వారా కూడా చేయ‌వ‌చ్చు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఈ ఖాతాల‌ను ఉప‌సంహ‌రించుకోని న‌గ‌దుని వెన‌క్కి కూడా తీసుకోవ‌చ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) అంటే:

ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి పొదుపుకు పెట్టుబ‌డి సాధ‌నాలు, ఇవి డ‌బ్బు డిపాజిట్ చేసిన కాలానికి స్థిర‌మైన వ‌డ్డీ రేటుని అందిస్తాయి. గ‌డువు ముగిసిన‌ప్పుడు డిపాజిట్ మీకు తిరిగి వ‌స్తుంది. మీరు క్యుములేటివ్‌, నాన్‌-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను క‌లిగి ఉండ‌వచ్చు. క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో మీరు మెచ్యూరిటీపై అస‌లు, వ‌డ్డీని క‌లిపి ఒకేసారి కాల‌వ్య‌వ‌ధి త‌ర్వాత‌ పొందుతారు. నాన్‌-క్యుములేటివ్ పిక్స్‌డ్ డిపాజిట్ల‌లో అస‌లు అలాగే ఉంటుంది కానీ వ‌డ్డీని నెల‌వారీ, 3 నెల‌ల‌కొక‌సారి పొందే ఏర్పాట్లు ఉంటాయి. సాధార‌ణంగా ఇత‌ర ఆదాయ వ‌న‌రుల‌ను క‌లిగి ఉన్న మ‌దుపుదారులు క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. నెల‌వారీగా అవ‌స‌రాలు ఉండే సినియ‌ర్ సిటిజ‌న్‌లు లేదా వ్యాపారస్తులు త‌మ ఆదాయ అవ‌స‌రాల కోసం సాధార‌ణ వ‌డ్డీని సంపాదించ‌డానికి నాన్‌-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు.

ఆదాయ‌పు ప‌న్ను:

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీకి వ‌ర్తించే స్లాబ్ రేటు ప్ర‌కారం ఆదాయ‌పు ప‌న్ను విధించ‌బ‌డుతుంది. ఒక ఆర్ధిక సంవ‌త్స‌రంలో వ‌డ్డీ ఆదాయం రూ. 40,000 కంటే ఎక్కువగా ఉంటే అది బ్యాంకు ద్వారా  10% మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) విధించబడుతుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80టీబీబీ ప్ర‌కారం, ఆర్ధిక సంవ‌త్స‌రంలో బ్యాంకు డిపాజిట్ల‌పై రూ. 50,000 వ‌ర‌కు వ‌డ్డీ ఆదాయం సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు ప‌న్ను ర‌హితం. మీరు (నాన్‌-సీనియ‌ర్ సిటిజ‌న్‌) అయ్యుండి 5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధికి 7% వ‌డ్డీతో రూ. 10 ల‌క్ష‌లు డిపాజిట్ చేశార‌నుకుందాం. `టీడీఎస్‌` త‌ర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ. 13.68 ల‌క్ష‌లు. బ్యాంకు 5 సంవ‌త్స‌రాల‌లో రూ. 40,888 `టీడీఎస్‌`ని తీసివేస్తుంది. ఒక ఆర్ధిక సంవ‌త్స‌రంలో వ‌డ్డీ ఆదాయం రూ. 5,000 దాటితే కంపెనీ డిపాజిట్ల‌పై `టీడీఎస్‌` తీసివేయ‌బ‌డుతుంది. మీరు సెక్ష‌న్ 80సీ కింద ప‌న్నుల‌ను ఆదా చేయాల‌నుకుంటే మీకు 5 ఏళ్ల ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ అందుబాటులో ఉంటుంది.

త‌క్కువ వ‌డ్డీ వ‌చ్చినా ప‌ర్వాలేదు, రిస్క్ ఉండ‌కూడ‌దు అనుకుంటే ఎంత మొత్తం జాతీయ బ్యాంకుల‌లో గానీ, పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో గాని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఎక్కువ వ‌డ్డీ రాబ‌డి వ‌చ్చే చిన్న బ్యాంకుల్లో గానీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో గాని డిపాజిట్ చేసేట‌పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. వీటిలో రూ. 5 ల‌క్ష‌లు దాటి డిపాజిట్ చేయ‌వద్దు. ఎందుకంటే ఈ బ్యాంకులు ఏదైన ఆర్ధిక స‌మ‌స్య‌ల కార‌ణంగా విఫ‌ల‌మైనా మీరు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ నుండి తిరిగి పొంద‌గ‌లిగే డ‌బ్బు రూ. 5 ల‌క్ష‌లు మాత్ర‌మే.

 ఫిక్స్‌డ్ డిపాజిట్లు వ‌లె, రిక‌రింగ్ డిపాజిట్లు కూడా మీకు మొత్తం కాల వ్య‌వ‌ధికి ఒకే వ‌డ్డీని అందిస్తాయి. కాల వ్య‌వ‌ధి ప్రారంభంలోనే ఈ వ‌డ్డీ ఖ‌రారు చేయ‌బ‌డుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌లె కాకుండా, రిక‌రింగ్ డిపాజిట్లు ఒక డిపాజిట‌ర్‌ను వాయిదాల‌లో (నెలా నెలా) ఆదా చేసుకోవ‌డానికి అనుమ‌తిస్తాయి. వ‌డ్డీ రాబ‌డి కూడా కాల‌వ్య‌వ‌ధి పూర్త‌యిన త‌ర్వాత అస‌లుతో క‌లిపి వ‌స్తుంది. నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో వాయిదాల‌లో ఆదా చేయ‌డం ద్వారా నిధిని పోగుచేయాల‌ని భావించేవారికి ఆర్‌డీలు అనుకూల‌మైన‌వి. ప‌న్ను వ‌ర్తింపు ప‌రంగా ఎఫ్‌డీ, ఆర్‌డీ రెండూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. 

ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏక‌మొత్తంలో చేసే పెట్టుబ‌డులు, అందువ‌ల్ల అవి మీకు రిక‌రింగ్ డిపాజిట్ కంటే ఎక్కువ వ‌డ్డీ రాబ‌డిని అందిస్తాయి. ఎఫ్‌డీ, ఆర్‌డీ మ‌ధ్య వ‌డ్డీ రాబ‌డిలో వ్య‌త్యాసాన్ని చూపే ప‌ట్టిక ఈ క్రింది ఉంది.

ఈ ప‌ట్టిక వ‌డ్డీ రాబ‌డిలో వ్య‌త్యాసం చూపెట్ట‌డానికి మాత్ర‌మే. ఈ మొత్తంలో `టీడీఎస్‌` తీసివేయ‌బ‌డ‌లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని