ఫిక్స్ డ్ డిపాజిట్లు vs రికరింగ్ డిపాజిట్లు - ఏది మంచిది?

స్థిర డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు రెండిటిలో పెట్టుబడులు పెట్టడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు.....

Updated : 22 Dec 2020 15:12 IST

స్థిర డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు రెండిటిలో పెట్టుబడులు పెట్టడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు.

​​​​​​​ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీ), రికరింగ్ డిపాజిట్లు (ఆర్ డీ) రెండూ రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులకు ప్రసిద్ధ పెట్టుబడి అవకాశాలుగా ఉన్నాయి. పెట్టుబడిదారులు పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడానికి అనువుగా ఉంటాయి, అలాగే ఫిక్స్ డ్ డిపాజిట్లు బ్యాంకు పొదుపు ఖాతాతో పోల్చితే అధిక వడ్డీ రేట్లను సంపాదించి పెడతాయి. అదే రికరింగ్ డిపాజిట్లలలో పెట్టుబడి చిన్న మొత్తం క్రమ పద్దతిలో చేయాలి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు రెండిటిలో పెట్టుబడులు పెట్టడం వలన నష్ట భయం తక్కువగా ఉంటుంది. అలాగే రెండూ తప్పకుండా మంచి రాబడులను ఇస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో పెట్టుబడిదారుడు నిర్ణయించుకోవాలి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల ప్రయోజనాలను కింద తెలుసుకుందాం.

ఫిక్స్ డ్ డిపాజిట్ల ప్రయోజనాలు:

ఫిక్స్ డ్ డిపాజిట్లు నిర్ణీత కాల వ్యవధిలో మీ డబ్బుకు మంచి వడ్డీని అందిస్తాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధి వరకు డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. మీకు కొన్నిసార్లు అనుకోని కారణాల వలన అత్యవసరంగా డబ్బు అవసరం అవ్వొచ్చు. అలాంటి పరిస్థితులలో, మీ ఫిక్స్ డ్ డిపాజిట్లపై రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. మీ ఫిక్స్ డ్ డిపాజిట్ల లోని కొంత మొత్తాన్ని మాత్రమే రుణంగా తీసుకోవాలనే నిబంధన ఇక్కడ ఉండదు. అయితే బ్యాంకులు డిపాజిట్లలో 60 నుంచి 90 శాతం వరకు మాత్రమే రుణాలను అందిస్తాయి. ప్రస్తుతం, ఒక సంవత్సరం బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 8 శాతం వరకు ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీ పై ఆదాయ పన్ను స్లాబ్ ఆధారంగా పన్ను లెక్కిస్తారు. ఒకవేళ వడ్డీ మొత్తం రూ. 10,000 మించినట్లైతే, సంవత్సరానికి 10 శాతం చొప్పున బ్యాంకు టీడీఏస్ కింద డిడెక్టు చేస్తుంది.

రికరింగ్ డిపాజిట్ల ప్రయోజనాలు:

చాలా సందర్భాల్లో, రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లకు సమానంగా ఉంటాయి. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు బ్యాంకు ఆధారంగా 7.25 శాతం నుంచి 9 శాతం వరకు ఉంటాయి. వేతన జీవులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపుగా రికరింగ్ డిపాజిట్లలో కేటాయించడమనేది సులభం, తెలివైన ఆలోచన. రికరింగ్ డిపాజిట్ పథకాలు కచ్చితమైన రాబడులను అందిస్తాయి. అలాగే, రికరింగ్ డిపాజిట్ల పై వడ్డీ రేటు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఇది వడ్డీ రేటు హెచ్చు తగ్గుల నుంచి పెట్టుబడిదారులను కాపాడుతుంది.

FIXED-RECURR.jpg

ఫిక్స్ డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల లో మీరు ఏది ఎంచుకుంటారు?

ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు రెండూ స్థిర ఆదాయ పెట్టుబడి సాధనాలే. ఇవి ఇంచుమించు ఒకేరకమైన ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే, ప్రతి నెలా జీతం ద్వారా ఆదాయం పొందే వేతన జీవి రికరింగ్ డిపాజిట్లలలో పెట్టుబడులు పెట్టవచ్చు, అదే ఒక వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లైతే, సదరు వ్యక్తి ఆ మొత్తాన్ని ఒకేసారి ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టవచ్చునని అభిమన్యు సోఫాట్, రీసర్చ్ హెడ్, ఐఐఎఫ్ఏల్ తెలిపారు.

అయితే, ఫిక్స్ డ్ డిపాజిట్లపై సంపాదించిన వడ్డీ అనేది రికరింగ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉంటుందని పునీత్ కపూర్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి సంవత్సర కాలానికి గాను రూ.1,20,000 ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టాడనుకుందాం. అలాగే నెలకి రూ .10,000 చొప్పున సంవత్సర కాలానికి రికరింగ్ డిపాజిట్లలలో పెట్టుబడి పెట్టాడు. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం వలన ఎక్కువ రాబడి పొందుతాడు.

ఈ స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెట్టే విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, తదితర బ్యాంక్లతో పాటు చిన్న బ్యాంకులలో కూడా లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని