Flipkart: మరో ‘బిగ్‌ దీపావళి సేల్‌’కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌..ఎప్పటి నుంచంటే?

దీపావళిని పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్‌ మరో దఫా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు సహా అనేక వస్తువులపై ప్రత్యేక రాయితీ లభించనుంది.

Updated : 17 Oct 2022 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి సందర్భంగా ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించిన ఓ దఫా ప్రత్యేక సేల్‌ అక్టోబరు 16తో ముగిసింది. ఈ క్రమంలోనే మరో సేల్‌తో ముందుకొచ్చింది. ‘బిగ్‌ దీపావళి సేల్‌’ పేరిట అక్టోబర్‌ 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు రెండో దఫా సేల్‌ నిర్వహించనుంది. ఇప్పటి వరకు పండగ సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలు నిర్వహించిన ప్రత్యేక సేల్‌లో పాల్గొననివారు ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సభ్యత్వం ఉన్నవారు ఒక రోజు ముందే ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. అంటే 18వ తేదీ అర్ధరాత్రి నుంచే వీరికి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్లు రాయితీ ధరకు లభించనున్నాయి. దీనికి అదనంగా బ్యాంకులు ప్రకటించే ఆఫర్లతో మరింత తగ్గింపు వచ్చే అవకాశం ఉంది. ఎస్‌బీఐ కార్డుతో స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేవారికి ఈ బిగ్‌ దీపావళి సేల్‌లో అదనంగా 10 శాతం రాయితీ లభించనుంది. పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ లావాదేవీల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. రియాల్‌మీ, పోకో, శాంసంగ్‌, ఒప్పో, వివో, యాపిల్‌ ఐఫోన్‌, షియోమీ, మోటోరోలా, ఇన్ఫీనిక్స్‌, మైక్రోమాక్స్‌, లావా మొబైళ్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా రియాల్‌మీ సీ33, పోకో సీ31, ఒప్పో కే10 5జీ, రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, అవేంటన్నది మాత్రం వెల్లడించలేదు.

ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు రాయితీ ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. టీవీలు, గృహోపకరణాలు, వాషింగ్‌ మెషీన్‌లు, ఏసీలపై 75 శాతం వరకు తగ్గింపు ఉన్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని