Home Loan: ఫ్లోటింగ్‌ రేట్‌ హోమ్‌ లోన్‌తో ప్రయోజనమేనా?

ఫ్లోటింగ్‌ రేటు ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఈ రుణాల గురించి తెలుసుకుందాం.

Updated : 17 Jun 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటి రుణం విషయంలో అతి ముఖ్యమైన అంశాల్లో వడ్డీ రేటు చాలా కీలకం. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఇంటి రుణాలపై రెండు రకాల వడ్డీని ఎంచుకోవడానికి అనుమతిస్తాయి. అవి స్థిర వడ్డీ రేటు, ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు. ఫ్లోటింగ్‌ రుణాలపై వడ్డీ రేట్లు మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం.

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు

మీరు ఫ్లోటింగ్‌ రేటు ఇంటి రుణాన్ని ఎంచుకున్నప్పుడు చెల్లించే వడ్డీ రేటు స్థిర రేటు రుణం కంటే తక్కువగా ఉంటుంది. అయితే, ఈ రేటు బెంచ్‌మార్క్‌ రేటుకు సంబంధించిన కదలికపై ఆధారపడి రుణ కాలవ్యవధిలో మార్పునకు లోబడి ఉంటుంది. మీరు ఇంటి రుణంపై ఫ్లోటింగ్‌ వడ్డీ రేటును ఎంచుకుంటే బేస్‌ రేటును చెల్లించాలి. ఇది సాధారణంగా తక్కువుగా ఉంటుంది. బేస్‌ రేటు అనేది కనీస వడ్డీ రేటు లేదా బ్యాంకులు నిర్ణయించిన బెంచ్‌మార్క్‌ రేటు. బ్యాంకులు బేస్‌ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందించవు. అందువల్ల, బేస్‌ రేటు సవరించినప్పుడు ఫ్లోటింగ్‌ రేటు కూడా మారుతుంది. కొన్నిసార్లు స్థిర రేటు కంటే ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండొచ్చు. ఫ్లోటింగ్‌ రుణాలపై వడ్డీ రేటు మారినప్పుడు రుణానికి సంబంధించి కాలవ్యవధి సర్దుబాటు చేస్తుంటారు. 

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు ఎంపికకు కారణాలు..

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటును ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. భవిష్యత్తులో ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని వినియోగదారుడు ఆశించినట్లయితే ఫ్లోటింగ్‌ వడ్డీ రేటును ఎంచుకోవచ్చు. ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు సాధారణంగా అదే బ్యాంకు అందించే స్థిర వడ్డీ రేట్ల కంటే 1-2.50% తక్కువగా ఉండొచ్చు. ఇలా తగ్గిన వడ్డీ శాతం రుణగ్రహీత ఈఎంఐలో నెలనెలా డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఒకవేళ EMI బదులు కాలపరిమితి తగ్గినట్లయితే రుణం త్వరగా పూర్తయ్యి వడ్డీ ఆదా అవుతుంది. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటును ఎంచుకునే రుణగ్రహీతలు మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందొచ్చు. 

ప్రయోజనాలు

వడ్డీ రేటు తగ్గుతున్న సందర్భంలో రుణగ్రహీతకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనముంటుంది. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు లేదా బెంచ్‌మార్క్‌ రేటు తగ్గినప్పుడు..ఫ్లోటింగ్‌ రేట్‌ ఇంటి రుణంపై కూడా వడ్డీ రేటు తగ్గుతుంది. అలాగే, చాలా బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్‌ రేట్‌ ఇంటి రుణాల ముందస్తు చెల్లింపులపై పెనాల్టీని వసూలు చేయవు. దీనివల్ల మిగులు నిధులు ఉన్నప్పుడు అదనపు చెల్లింపులు చేయడానికి లేదా అదనపు ఖర్చులు లేకుండా ముందుగానే రుణాన్ని తిరిగి చెల్లించడానికి రుణగ్రహీతకు అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలకు ఫ్లోటింగ్‌ రేటు ఇంటి రుణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సుదీర్ఘకాలంలో వడ్డీ రేటు తగ్గింపుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. 

ప్రతికూలతలు

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుతో ఇంటి రుణాన్ని ఎంచుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఆర్‌బీఐ రెపోరేటు పెంచినప్పుడు.. బెంచ్‌ మార్క్‌ రేటు మారుతుంది. అప్పుడు మీ ఇంటి రుణంపై వడ్డీ రేటు కూడా మారుతుంది. దీనివల్ల, ఈఎంఐ మొత్తం లేదా లోన్‌ కాలవ్యవధి మారుతుంది. మీరు ఈఎంఐ అంచనా వేయగలగాలి. ఆ మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఈఎంఐ మొత్తం రుణగ్రహీతలు సౌకర్యవంతంగా చెల్లించగలిగే దానికంటే ఎక్కువగా ఉండొచ్చు. ఇది వారి పొదుపు, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి నెలా చివరి రూపాయి వరకు ఆర్థిక బడ్డెట్‌ను ప్లాన్‌ చేసుకునే వ్యక్తులు, ఈఎంఐను ప్లాన్‌ చేయడంలో విఫలం కావచ్చు. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు విషయంలో ఈఎంఐలు కచ్చితంగా అంచనా వేయలేనందున ఇంటి బడ్డెట్‌ ప్రణాళికలో మార్పులు రావచ్చు. ఇది మీ నెలవారీ ఇతర పొదుపులపై కూడా ప్రభావం చూపుతుంది. ఈఎంఐ డిఫాల్ట్‌ అయితే, మీ క్రెడిట్‌ స్కోరు రికార్డులను ప్రభావితం చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని