Wheat export ban: సింగపూర్‌ పంజాబీలకు చపాతీ కష్టాలు!

గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై భారత ప్రభుత్వం విధించిన నిషేధం నేపథ్యంలో సింగపూర్‌లోని పంజాబీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....

Updated : 27 Sep 2022 14:53 IST

సింగపూర్‌: గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో సింగపూర్‌లోని పంజాబీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండే పంజాబీలు ఎక్కువగా ఉత్తర భారత దేశ గోధుమ పిండిని వినియోగిస్తుంటారు. అదే రకం గోధుమల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఖర్చు మూడింతలవుతోంది.

ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. దీంతో భారత ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా దేశీయంగా సరఫరా తగ్గింది. ఇది ధరల పెరుగుదలకు దారి తీసింది. దీన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం గోధుమలు, దాని ఉత్పత్తుల ఎగుమతులపై మే నెలలో నిషేధం విధించింది. దీంతో అప్పటి వరకు మన గోధుమ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకున్న సింగపూర్‌ సూపర్‌మార్కెట్‌ చైన్‌ ఫెయిర్‌ప్రైస్‌కు సరఫరా తగ్గిపోయింది. ఈ సంస్థకు శ్రీలంక, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్‌ఏ నుంచి కూడా గోధుమ పిండి దిగుమతి అవుతోంది. అయితే, ధర మాత్రం భారత్‌తో పోలిస్తే మూడింతలు అధికంగా ఉండడంతో వినియోగదారులపైకి ఆ భారాన్ని మోపడం కష్టంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సింగపూర్‌ రెస్టారెంట్లు కిలో భారత గోధుమ పిండికి 5 సింగపూర్‌ డాలర్లు చెల్లించేవి. ఇప్పుడు దుబాయ్‌ మీదుగా వస్తున్న పిండి కోసం 15 సింగపూర్‌ డాలర్లు చెల్లించాల్సి వస్తోందని అక్కడి రెస్టారెంట్‌ యజమానులు తెలిపారు. ఐరాస గణాంకాల ప్రకారం.. సింగపూర్‌ 2-2.5 లక్షల టన్నుల గోధుమల్ని, 1-1.2 లక్షల టన్నుల గోధుమ పిండిని దిగుమతి చేసుకుంటోంది. దీంట్లో 5.8 శాతం భారత్‌ నుంచి ఎగుమతి అయ్యేది. మన దేశ వాటా చాలా తక్కువే అయినప్పటికీ.. అక్కడి భారతీయ రెస్టారెంట్లు మాత్రం మన పిండినే ఎక్కువగా వినియోగించేవి. తాజా కొరత నేపథ్యంలో అక్కడి కొన్ని రెస్టారెంట్లు చపాతీ, పూరీ భాజీ, తందూరి వంటి వంటకాల తయారీని నిలిపివేశాయి. దీంతో సింగపూర్‌లో పనిచేస్తున్న అనేక మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంజాబీలు, ఉత్తరాదివారిపై ప్రభావం ఎక్కువగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని