NMDC: రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది.

Published : 16 Jun 2024 03:01 IST

రూ.50,000 కోట్ల మూలధన పెట్టుబడి
ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ సన్నాహాలు
ఈనాడు - హైదరాబాద్‌

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. వచ్చే అయిదేళ్ల కాలంలో 100 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు వీలుగా రూ.50,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ సొమ్ముతో గనులను విస్తరించటంతో పాటు అధునాతన యంత్ర సామగ్రి కొనుగోలు చేస్తారు. దీనివల్ల ఎంతో లోతుగా గనులను తవ్వటానికి వీలవుతంది. అదే సమయంలో ఇనుప ఖనిజాన్ని రవాణా చేయటానికి స్లర్రీ పైప్‌లైన్లను, కన్వేయర్‌ బెల్ట్‌లను అదనంగా నిర్మిస్తారు. ఇతర సదుపాయాలు సమకూర్చుకుంటారు. దీనివల్ల ఇనుప ఖనిజం ఉత్పత్తిని వచ్చే అయిదేళ్లలో రెట్టింపు చేయగలుగుతామని      ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ సీఎండీ అమితవ ముఖర్జీ వెల్లడించారు. ప్రభుత్వం, సంస్థ బోర్డు నుంచి దీనికి అవసరమైన అనుమతులు త్వరలో తీసుకుంటామని ఇటీవల ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘టెలీకాన్ఫెరెన్స్‌ కాల్‌’లో చెప్పారు.

లక్ష్యాన్ని చేరుకునేలా..

 గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఎన్‌ఎండీసీ 45 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇంకా అధికంగా 54 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి నమోదు చేయాలనే ఆలోచన ఎన్‌ఎండీసీకి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ కర్నాటకలోని దోనిమలై, ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిలాలో ఇనుప ఖనిజం గనులు నిర్వహిస్తోంది. ఈ గనుల్లో ఉత్పత్తిని గణనీయంగా పెంచటం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు సీఎండీ వివరించారు. ప్రస్తుతం ఏటా రూ.9,000 కోట్ల మేరకు మూలధన పెట్టుబడి అవసరం అవుతోందని, ఇదే పరిస్థితి వచ్చే మూడు నుంచి నాలుగేళ్లు ఉంటుందని అన్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న గనుల్లో ఉత్పత్తి పెంచటమే కాకుండా, కొత్త గనుల కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసి అమల్లోకి తీసుకురావటానికి డెలాయిట్, మెకింజీ, బీసీజీ వంటి అగ్రశ్రేణి కన్సల్టింగ్‌ సంస్థల సేవలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కన్వేయర్‌ బెల్ట్‌ నిర్మాణానికి రూ.1,000 కోట్లు, స్లర్రీ పైప్‌లైన్ల కోసం రూ.10,000 కోట్లు, పెల్లెట్‌ ప్లాంట్‌ కోసం రూ.2,000 కోట్లు, స్టాక్‌ యార్డ్‌లను నిర్మించటానికి రూ.10,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. 

దేశీయ అవసరాలకు తగ్గట్టుగా..

 ఇనుప ఖనిజాన్ని దేశీయ మార్కెట్లో వచ్చే కొన్నేళ్ల పాటు అధిక గిరాకీ ఉంటుందని అమితవ ముఖర్జీ అంచనా వేశారు. ఉక్కు (స్టీల్‌) వినియోగం మనదేశంలో ఎంతో వేగంగా పెరుగుతున్నట్లు, ఉక్కు ఉత్పత్తిలో ఇనుప ఖనిజాన్ని అధికంగా వినియోగిస్తారు. అందువల్ల ఇనుప ఖనిజం కోసం ఉక్కు ఉత్పత్తిదార్లు అధికంగా ఆర్డర్లు ఇస్తున్నారు. ఎన్‌ఎండీసీకి ఇప్పటికే జేఎస్‌డబ్లూ స్టీల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌... తదితర సంస్థల నుంచి అధిక ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తులు అందుతున్నాయి. కానీ తగినంత ఉత్పత్తి లేక ఎన్‌ఎండీసీ, ఈ డిమాండ్లను వెనువెంటనే నెరవేర్చలేకపోతోంది. జేఎస్‌డబ్లూ ఇచ్చే ఆర్డర్లలో 60 శాతాన్ని, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఆర్డర్లలో 80 శాతం మేరకు మాత్రమే ఇనుప ఖనిజాన్ని ప్రస్తుతం సరఫరా చేస్తున్నట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎంతగా ఇనుప ఖనిజం ఉత్పత్తిని పెంచగలిగితే, అంత మేరకు దేశీయ అవసరాలను తీర్చినట్లు అవుతుందని ఆయన వివరించారు.


ఉక్కుకు పెరుగుతున్న గిరాకీ
ఈ ఆర్థిక సంవత్సరంలో 9- 12% వృద్ధి అంచనా

కేంద్రంలో మూడోసారి కొలువు తీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉక్కు (స్టీల్‌) గిరాకీపై సానుకూలమైన నివేదికలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఉక్కుకు గిరాకీ పెరుగుతుందని, క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9- 12 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తాజాగా ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) అనే కన్సల్టింగ్‌ సేవల సంస్థ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఆటోమొబైల్‌ పరిశ్రమతో పాటు, మౌలిక సదుపాయాల రంగం నుంచి ఉక్కుకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు ఈ సంస్థ విశ్లేషించింది.

భారత్‌లో ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తికి దాదాపు సరిసమానంగా డిమాండ్‌ కనిపిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సడక అన్నారు. డిమాండ్‌- సప్లై పరిస్థితి దాదాపు సమంగా కనిపిస్తోంది- అని వివరించారు. దీనివల్ల స్టీలు కంపెనీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉక్కు డిమాండ్‌ అధికంగా లేక, మనదేశాన్ని చౌక దిగుమతులు ముంచెత్తే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దేశీయ ఉక్కు రంగ సంస్థలకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ, మనదేశం వచ్చే కొన్నేళ్ల పాటు అధిక ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉన్నందున పెద్దగా సమస్యలు ఎదురుకావని, ఉక్కు సరఫరా తగ్గట్లుగా వినియోగం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు