GST: జీఎస్‌టీని 5 శాతం చేయండి

దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి.

Updated : 07 Jul 2024 08:36 IST

ప్రభుత్వాన్ని కోరుతున్న పాలసీదారులు
అందరికీ బీమా అప్పుడే సాధ్యం
కొత్త బడ్జెట్‌పై ఆశలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) విధించుకుంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. మరోవైపు వైద్య బీమా ప్రీమియం ఏటా 15 శాతం వరకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ తర్వాత ఈ పాలసీలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. కానీ, పెరిగిన ప్రీమియంతో చాలా మంది బీమాకు దూరం అవుతున్నారు. ఈ భారం నుంచి ఉపశమనం కలిగించాలంటే.. ఆరోగ్య బీమా పాలసీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ వర్గాలు, పాలసీదారులు కోరుతున్నారు.

రానున్న నాలుగేళ్ల కాలంలో సాధారణ బీమా రంగం 7.1 శాతం మేరకు వృద్ధి సాధించే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. బీమా సంస్థల ప్రీమియం వసూళ్లూ ఏటా 15 శాతం మేరకు పెరుగుతున్నాయి. ఇప్పటికీ బీమా రంగం విస్తృతి 5 శాతంలోపే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి, అందరికీ బీమా లక్ష్యం నెరవేరాలంటే ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తప్పవని జీఎస్‌టీతోనే దీన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

5 శాతం వరకూ..

ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా అవసరం పెరిగిందన్న మాట వాస్తవం. కాబట్టి, ఈ పాలసీలపై ఉన్న జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి పరిమితం చేయాలని సాధారణ బీమా ఏజెంట్ల సంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలను ఇచ్చింది. ఈ బడ్జెట్‌లో దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని కోరింది. ప్రీమియం రేట్లు పెరుగుతూ ఉండటంతో పాలసీల పునరుద్ధరణ తగ్గుతోందని ఈ సందర్భంగా పేర్కొంది. ‘ఆరోగ్య బీమా పాలసీల పునరుద్ధరణ సగటున 65-75 శాతం మేరకే ఉంటోంది. దీనికి ప్రధాన కారణం, ప్రీమియం పెరగడం, జీఎస్‌టీ అధికంగా ఉండటమే’ అని ఆర్థిక శాఖకు పంపిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, జీఎస్‌టీని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. 

పరిమితి రూ.50,000

వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం పెరిగినందున ఆరోగ్య బీమా పాలసీల మినహాయింపు పరిమితిని రూ.50,000 వరకూ చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతం సెక్షన్‌ 80డీ కింద వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలకు రూ.25,000 వరకే మినహాయింపు ఉంది. నలుగురున్న కుటుంబానికి రూ.10లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌ తీసుకుంటే.. ప్రీమియం   రూ.30,000 వరకూ ఉంటోంది. తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీలకూ ప్రీమియం భారీగానే చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని రూ.50,000కు పెంచాల్సిన అవసరం ఉందని పాలసీదారులు భావిస్తున్నారు. ఆరోగ్య బీమా వరకూ కొత్త పన్ను విధానంలోనూ మినహాయింపును అనుమతించాలని బీమా రంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని