న్యూఇయర్‌ వేళ.. నిమిషానికి 4100 ఫుడ్‌ ఆర్డర్లు

కరోనా మహమ్మారి వేళ కొత్త సంవత్సరం వేడుకలు కాస్త కళతప్పాయి. అవుట్‌డోర్‌ పార్టీలు.. డీజేల మోతలు తగ్గాయి. వైరస్‌ భయం.. ప్రభుత్వ ఆంక్షల నడుమ..

Updated : 01 Jan 2021 12:28 IST

దిల్లీ: కరోనా మహమ్మారి వేళ కొత్త సంవత్సరం వేడుకలు కాస్త కళతప్పాయి. అవుట్‌డోర్‌ పార్టీలు.. డీజేల మోతలు తగ్గాయి. వైరస్‌ భయం.. ప్రభుత్వ ఆంక్షల నడుమ ఈ ఏడాది చాలా మంది ఇళ్లకే పరిమితమై న్యూఇయర్‌ను ఆహ్వానించారు. అయితే ఈ మార్పు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు బాగా కలిసొచ్చినట్లుంది. గురువారం సాయంత్రం నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ప్రముఖ యాప్‌ జొమాటోకు నిన్న రాత్రి ఏకంగా నిమిషానికి 4100 ఆర్డర్లు వచ్చాయట. ఈ మేరకు కంపెనీ సీఈవో దీపీందర్‌ గోయల్‌ ట్విటర్‌లో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. 

‘‘ఇప్పటివరకు నిమిషానికి దాదాపు 2500 ఆర్డర్ల వరకు చూశాం. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య దాటేసింది. ఇప్పుడు సాయంత్రం 6 గంటలే! రాత్రి వరకు మరింత పెరుగుతాయేమో’’ అని గురువారం సాయంత్రం దీపీందర్‌ గోయల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత 45 నిమిషాలకే ఆర్డర్లు.. నిమిషానికి 3,200 చొప్పున వచ్చినట్లు చెప్పారు. ఇందులో ఎక్కువగా పీజ్జాలు, బిర్యానీల కోసం చేసినవే. కాగా.. రాత్రి 8 గంటల సమయానికి ఆర్డర్లు మరింత పెరిగాయి. నిమిషానికి 4,100 ఆర్డర్లు వస్తున్నట్లు గోయల్‌ పేర్కొన్నారు. ‘చాలా నగరాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నందున గురువారం రాత్రి నుంచి ఫుడ్‌ డెలివరీకి డిమాండ్‌ భారీగా పెరిగింది. రద్దీ దృష్ట్యా వీలైతే కస్టమర్లు ముందస్తుగానే ఆర్డర్లు చేసుకోవాలి’ అని ఆయన వినియోగదారులను కోరారు.

కరోనా కారణంగా గత ఏడాది నెలల తరబడి ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే ఆరంభంలో డెలివరీ యాప్‌లకు కొంచెం డిమాండ్‌ తగ్గినప్పటికీ 2020 ద్వితీయార్ధంలో మాత్రం మళ్లీ పుంజుకుంది. గడిచిన ఏడాదిలో నిమిషానికి 22 బిర్యానీలు డెలివరీ చేసినట్లు ఇటీవల జొమాటో వెల్లడించింది. 

ఇదీ చదవండి..  తెగ తాగేశారు! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని