Updated : 18 Jul 2022 18:32 IST

Cash Transactions: నగదుతో లావాదేవీలా.. పరిమితులున్నాయి జాగ్రత్త!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్రమ లావాదేవీలు అరికట్టడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘భారతీయ రిజర్వు బ్యాంకు (RBI)’ ఇటీవల నగదు లావాదేవీ (Cash Transactions)లపై కొన్ని ఆంక్షలు విధించింది. పరిమితికి మించి నగదుతో లావాదేవీ (Cash Transactions)లు జరిపితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి లావాదేవీ మొత్తాన్నీ అపరాధ రుసుము కింద చెల్లించాల్సి రావొచ్చు. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (CBDT) రూపొందించిన నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ.20లక్షల పైన డిపాజిట్లు చేసేవారు పాన్‌కార్డు, ఆధార్‌ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. గతంలో రోజుకి రూ.50 వేలు డిపాజిట్‌ చేసేవారికి పాన్‌ కార్డు తప్పనిసరి చేశారు. కానీ, అప్పుడు వార్షిక పరిమితులేమీ ఉండేవి కాదు. ఇలా ఆదాయ పన్ను విభాగం కేంద్ర ఆర్థిక శాఖలోని ఇతర డిపార్ట్‌మెంటులతో కలిసి ఎప్పటికప్పుడు ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కొత్త నియమ నిబంధనలను రూపొందిస్తోంది.

భారత ఆదాయపు పన్ను చట్టం.. రూ.2లక్షలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలను అనుమతించదు. ఉదాహరణకు మీరు రూ.3లక్షలకు ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నారనుకోండి. కచ్చితంగా క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు, చెక్కు, బ్యాంకు నుంచి బదిలీ ద్వారా మాత్రమే నిర్వహించాలి. రూ.2లక్షల లోపు ఉన్నప్పుడు నగదు చెల్లించవచ్చు. ఈ నిబంధన 2017 నుంచి అమల్లోకి వచ్చింది.

మీ కుటుంబ సభ్యుల నుంచి నగదును తీసుకుంటున్నా ఈ నిబంధన పాటించాల్సిందే. నగదు ఉపయోగాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం సెక్షన్‌ 269ఎస్‌టీ కింద ఒక రోజులో రూ.2లక్షలకు మించి వ్యక్తిగత నగదు లావాదేవీలు చేయడాన్ని నిషేధించింది. దగ్గరి బంధువుల నుంచి తీసుకున్నా రూ.2లక్షలు మాత్రమే అంగీకరించాలి.

నగదును బహుమతిగా స్వీకరించేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర్నుంచి రూ.2లక్షలకు మించి నగదు బహుమతి అందుకోరాదు. ఒకవేళ అంతకు మించి అందుకుంటే, నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. బహుమతికి సమానమైన మొత్తాన్ని అపరాధ రుసుముగా విధించే ఆస్కారం ఉంది.

ఆరోగ్య బీమా ప్రీమియాన్ని కచ్చితంగా చెక్కు లేదా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. నగదుగా చెల్లిస్తే సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు కోల్పోతారు.

వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటున్నప్పుడు ఆ మొత్తం రూ.20వేలకు మించితే ఆన్‌లైన్‌ ద్వారానే లావాదేవీ నిర్వహించాలి.

ఏవైనా ఆస్తులకు సంబంధించిన లావాదేవీల్లోనూ నగదు పరిమితి రూ.20 వేలే. చివరకు అడ్వాన్సు చెల్లించినా.. తీసుకున్నా.. ఈ పరిమితి దాటొద్దు.

ఒకరోజులో ఒకేసారి రూ.10 వేలు నగదు రూపంలో చెల్లిస్తే.. దానికి పన్ను మినహాయింపు కోరేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అవకాశం లేదు. అయితే ఒక్క ట్రాన్స్‌పోర్టర్లకు మాత్రం రూ.35 వేల వరకు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts