ప్రీమియం మర్చిపోయారా?

ఏటా ఎన్నో పాలసీలు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దయిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం జీవిత బీమా గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం

Published : 22 Dec 2020 20:13 IST

అనుకోని పరిస్థితులు కుటుంబానికి ఆర్థికంగా పెను చిక్కులు తెచ్చిపెడతాయి. ఇలాంటివాటిని నివారించాలంటే… కుటుంబంలో ఆర్జించే వ్యక్తులు తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోవాల్సిందే. బీమా చేయడమే కాదు… ఆ పాలసీలకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడమూ అంతే ముఖ్యం. ఏటా ఎన్నో పాలసీలు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దయిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం జీవిత బీమా గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం. రెండోది… పెట్టుబడి లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల ప్రీమియం చెల్లించడం భారం కావడంలాంటివి. చాలామంది ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకే జీవిత బీమా పాలసీలను చేయడం చూస్తుంటాం. మరో ఏడాది కొనసాగించడం ఇష్టం లేకపోవడంతో… బీమా రక్షణకు దూరం అవుతున్నారు. జీవిత బీమా పాలసీ రద్దు కాకుండా ఉండాలంటే… నిర్ణీత కాలంలో ప్రీమియాన్ని మర్చిపోకుండా చెల్లిస్తూ ఉండాలి. ఒకవేళ చెల్లించకపోతే ఏం జరుగుతుంది? పాలసీ తాత్కాలికంగా రద్దయితే దాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలి? అనేది తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి బీమా సంస్థ తన పాలసీదారులకు ప్రీమియం చెల్లింపు సమాచారాన్ని గడువు ముందు నుంచే పంపిస్తుంటాయి. వ్యవధి ముగిసిన తర్వాత కూడా 30 రోజులపాటు ప్రీమియం చెల్లించేందుకు అదనపు సమయం ఉంటుంది. ఇప్పటికీ ప్రీమియం కట్టకపోతే అప్పుడు బీమా రక్షణ కోల్పోతాం.

  • మూడేళ్లలోపు పాలసీలకు గడువు తర్వాత 30 రోజుల తర్వాత కూడా ప్రీమియం చెల్లించకపోతే ‘ల్యాప్స్‌ పెయిడ్‌ అప్‌’ పాలసీలుగా మారుస్తాయి. అక్కడ నుంచి మూడేళ్లదాకా కూడా ప్రీమియం చెల్లించకపోతే ఆ తర్వాత అవి ‘పెయిడప్‌’ పాలసీలుగా మారతాయి.

  • అదనపు సమయంలోపు ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీ రద్దు కాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ అప్పటికీ చెల్లించకపోయినా… బీమా సంస్థలు ఇచ్చే అదనపు గడవు, లేదా ప్రత్యేక వెసులుబాట్ల ద్వారా రెండేళ్లలోపు ప్రీమియం చెల్లించి పాలసీని కొనసాగించుకోవచ్చు.

  • ప్రీమియం చెల్లించనప్పుడు పాలసీని పూర్తిగా స్వాధీనం చేసి, స్వాధీన విలువను వెనక్కి తీసుకోవచ్చు.

బీమా సంస్థలు పాలసీదారులు తమ పాలసీలను క్రమం తప్పకుండా పునరుద్ధరించుకునేందుకు అనేక మార్గాల్లో సమాచారం ఇస్తున్నాయి. ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ ద్వారా, ఫోన్లు, ఉత్తరాల ద్వారా పాలసీదారులను సంప్రదిస్తుంటాయి.

  • ప్రీమియం చెల్లించడం కూడా ఎంతో సులువుగా ఉండేలా చూస్తున్నాయి. ఏటీఎంలు, ఆన్‌లైన్‌లోనూ, యాప్‌ల ద్వారా కూడా ప్రీమియాలు చెల్లించవచ్చు. నేరుగా బీమా సంస్థల కార్యాలయాలను సంప్రదించి కూడా ప్రీమియం కట్టేందుకు వీలుంది.

  • కొంతమంది నెలనెలా ప్రీమియం చెల్లించేలా ఏర్పాటు చేసుకుంటారు… మరికొంతమంది ఏడాదికోసారి చెల్లిస్తుంటారు. ముఖ్యంగా నెలనెలా ప్రీమియం చెల్లించేవారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా బీమా ప్రీమియం వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి.

  • పూర్తిగా రద్దయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు బీమా కంపెనీని సంప్రదించండి. ఇలాంటప్పుడు వైద్య పరీక్షల కోసం అడగవచ్చు. మీ పాలసీ రద్దు కాకముందు, ఇప్పుడు మీ ఆరోగ్యంలో ఏమైనా మార్పులు వస్తే… కొంత ప్రీమియం అధికంగా చెల్లించాల్సిందిగా కోరేందుకు అవకాశం ఉంది. ఇలాంటివి నివారించాలంటే… క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడమే మేలు. దీనివల్ల బీమా రక్షణ దూరం కాకుండా చూసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని