Keshub Mahindra: మహీంద్రా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ కేశుబ్‌ మహీంద్రా కన్నుమూత

Keshub Mahindra: మహీంద్రా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ కేశుబ్‌ మహీంద్రా (99) ఇకలేరు. బుధవారం ఆయన కన్నుమూసినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.

Updated : 12 Apr 2023 14:48 IST

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ కేశుబ్‌ మహీంద్రా (Keshub Mahindra) (99) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంఅండ్‌ఎం మాజీ ఎండీ పవన్‌ గోయెంకా ధ్రువీకరించారు. కంపెనీ అధికార ప్రతినిధి సైతం ఓ ప్రకటనను విడుదల చేశారు.

కేశుబ్‌ మహీంద్రా (Keshub Mahindra) 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవలే వెలువడిన ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో 1.2 బిలియన్‌ డాలర్ల సంపదతో భారత్‌లో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా నిలిచారు. 1947లో కంపెనీలో చేరిన కేశుబ్‌.. సంస్థను అనేక రంగాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యాపారంలోకి ప్రవేశించిన నాటికి కంపెనీ ప్రధానంగా విల్లీస్‌ జీప్‌లను తయారు చేస్తుండేది. ఇప్పుడు మహీంద్రా గ్రూప్‌ వాహన, ఇంధనం, సాఫ్ట్‌వేర్‌ సేవలు, స్థిరాస్తి, ఆతిథ్యం, రక్షణ.. ఇలా పలు రంగాలకు విస్తరించింది.

1923 అక్టోంబరు 9న శిమ్లాలో జన్మించిన కేశుబ్‌ మహీంద్రా (Keshub Mahindra) అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1945లో ఆయన తండ్రి జగదీశ్‌ చంద్ర మహీంద్రా తన సోదరుడు కైలాశ్‌ చంద్ర మహీంద్రాతో కలిసి మాలిక్‌ గులామ్‌ మహ్మద్‌ భాగస్వామ్యంలో ‘మహీంద్రా అండ్‌ మహ్మద్‌’ కంపెనీని స్థాపించారు. 1947లో కేశుబ్‌ కంపెనీలో చేరారు. తదనంతర పరిణామాల్లో కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’గా పేరుమార్చుకుంది. ప్రస్తుతం మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆనంద్‌ మహీంద్రా జగదీశ్‌ చంద్ర మహీంద్రా మనవడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని