Chitra Ramkrishna: చిత్రా రామకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ.. వీఐపీ ట్రీట్మెంట్‌కు కోర్టు నో!

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఎన్‌ఎస్‌ఈ కో- లొకేషన్‌ కుంభకోణం కేసులో ఆమెను ఇటీవల సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.

Published : 14 Mar 2022 15:41 IST

దిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఎన్‌ఎస్‌ఈ కో- లొకేషన్‌ కుంభకోణం కేసులో ఆమెను ఇటీవల సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

2018లో కొంతమంది స్టాక్‌ బ్రోకర్లకు చిత్రా రామకృష్ణ ఆయాచిత లబ్ధి చేకూర్చారని ఇటీవల సెబీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వరుసగా నాలుగు రోజుల పాటు విచారణ జరిపింది. ఆమె నివాసాల్లోనూ సోదాలూ నిర్వహించింది. ఈ కేసులో పూర్తి విచారణ జరగాల్సి ఉందని ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం సీబీఐ వాదించింది. ఆమె విదేశీ పర్యటనలు, ఇతర అంశాలను నిగ్గు తేలాల్సి ఉన్న నేపథ్యంలో ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించాలని కోరింది. దీనికి కోర్టు అనుమతించింది. అంతకుముందు ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా జైలులో చిత్రా రామకృష్ణకు వీఐపీ సదుపాయాలు కల్పించాలన్న ఆమె తరఫు న్యాయవాది వాదనలనూ కోర్టు తోసిపుచ్చింది. అలాగే ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు నిరాకరించింది. తన వెంట హనుమాన్‌ చాలీసాను మాత్రం తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతించింది. మరోవైపు ఈ కేసులో ఫిబ్రవరి 25న ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసిన సంగతి విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని