Byjus: బైజూస్‌లో వాటా పెంచుకునే యోచనలో రవీంద్రన్‌?

బైజూస్‌ గత ఏడాది ఐపీఓకి రావాలని ప్రయత్నించింది. కానీ, టెక్‌ స్టాక్స్‌ పతనం నేపథ్యంలో వెనకడుగు వేసింది. తాజాగా ఈ కంపెనీలో వాటాలు పెంచుకోవాలని వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

Published : 04 Jan 2023 16:52 IST

బెంగళూరు: ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ (Byjus) వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌ కంపెనీలో తన వాటా పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకోసం కావాల్సిన నిధులను ఆయన ప్రస్తుతం సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు వివిధ సంస్థలతో రవీంద్రన్‌ (Byju Raveendran) చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు కంపెనీ ఉద్యోగులు తెలిపారు. 

కంపెనీలో అదనంగా మరో 15 శాతం వాటాను కొనుగోలు చేయాలని రవీంద్రన్‌ యోచిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 25 శాతం వాటాలున్నాయి. దీన్ని 40 శాతానికి పెంచుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న తన వాటాలను తనఖా పెట్టి నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి. చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. ఇవి విఫలమయ్యే అవకాశం కూడా లేకపోలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చివరిసారి బైజూస్‌ నిధులు సమీకరించినప్పుడు కంపెనీ విలువను 22 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.

థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట బైజూస్‌ను 2015లో రవీంద్రన్‌ స్థాపించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో చాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనీషియెటివ్‌, సెఖోయా క్యాపిటల్‌ ఇండియా, బ్లాక్‌రాక్‌, సిల్వర్‌ లేక్‌ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థలకు వాటాలున్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీ 5 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. నిజానికి బైజూస్‌ను ఐపీఓకి తీసుకురావాలని కంపెనీ ప్రణాళికలు రచించింది. కానీ, 2022లో టెక్‌, ఐటీ కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో వెనకడుగు వేసింది. మరోవైపు తమ ట్యూటరింగ్‌ బిజినెస్‌ ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ను సైతం పబ్లిక్‌ ఇష్యూకి తీసుకెళ్లాలని బైజూస్‌ యోచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని