Most Valuable Brands: భారత కంపెనీల ‘బ్రాండ్‌’ బాజా.. టాప్‌ 100లో ఈ నాలుగింటికి చోటు

Most Valuable Brands: ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో టీసీఎస్‌ అగ్ర స్థానంలో ఉంది.

Published : 13 Jun 2024 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అమెరికా సంస్థ ‘యాపిల్‌ (Apple)’ వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కంపెనీల బ్రాండ్‌ విలువను అంచనా వేసే మార్కెటింగ్‌ డేటా, అనలిటిక్స్‌ సంస్థ ‘కంటార్‌ బ్రాండ్జ్‌ (Kantar BrandZ)’ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన గ్లోబల్‌ బ్రాండ్ల (Most Valuable Brands) జాబితాలో భారత్ నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. టాప్‌-100లో దేశీయ టెక్‌ దిగ్గజం టీఎస్‌ఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ ఉన్నాయి.

బ్రాండ్‌ విలువ పరంగా 44.8 బిలియన్‌ డాలర్లతో టీసీఎస్‌ (TCS) ఈ జాబితాలో 46వ స్థానంలో ఉంది. గతేడాది ఈ కంపెనీ 42వ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలవగా.. ఈసారి విలువ కాస్త తగ్గడం గమనార్హం. ఇక, 43.3 బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bamk) తాజా జాబితాలో 47వ ర్యాంక్‌ దక్కించుకుంది. 2023లో 56వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ విలువ ఈ ఏడాది మెరుగైంది.

‘తాజ్‌’.. ప్రపంచంలో బలమైన హోటల్‌ బ్రాండ్‌

ఈ జాబితాలో ఎయిర్‌టెల్‌ (Airtel) 73వ స్థానంలో (బ్రాండ్‌ విలువ 25.3 బిలియన్‌ డాలర్లు) ఉండగా.. మరో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) 74వ స్థానం (బ్రాండ్‌ విలువ 24.7 బిలియన్‌ డాలర్లు) దక్కించుకుంది. టాప్‌ 100 లిస్ట్‌లో ఉన్న భారత కంపెనీల మొత్తం బ్రాండ్‌ విలువ 130 బిలియన్‌ డాలర్లకు పైనే ఉందని నివేదిక వెల్లడించింది.

ఇక ఈ జాబితాతో వరుసగా మూడోసారి యాపిల్‌ అగ్రస్థానంలో ఉంది. అంతేగాక, బ్రాండ్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లు దాటిన తొలి కంపెనీగా అవతరించింది.

ప్రపంచంలోనే టాప్‌-10 బ్రాండ్‌లు ఇవే..

  • యాపిల్‌ (ఒక ట్రిలియన్‌ డాలర్లు)
  • గూగుల్‌ (753.5 బిలియన్‌ డాలర్లు)
  • మైక్రోసాఫ్ట్‌ (712.9 బిలియన్‌ డాలర్లు)
  • అమెజాన్‌ (576.6 బిలియన్‌ డాలర్లు)
  • మెక్‌డొనాల్డ్స్‌ (221.9 బిలియన్‌ డాలర్లు)
  • ఎన్విడియా (201.8 బిలియన్‌ డాలర్లు)
  • వీసా (188.9 బిలియన్‌ డాలర్లు)
  • ఫేస్‌బుక్‌ (166.8 బిలియన్‌ డాలర్లు)
  • ఒరాకిల్‌ (145.5 బిలియన్‌ డాలర్లు)
  • టెన్సెంట్‌ (135.2 బిలియన్‌ డాలర్లు)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని