Foxconn: ఒప్పందాలు ఇంకా ఖరారు కాలేదు.. భారత్‌లో పెట్టుబడులపై ఫాక్స్‌కాన్‌

Foxconn on India investments: భారత్‌లో పెట్టుబడులపై ఫాక్స్‌కాన్‌ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఒప్పందాలు ఇంకా ఖరారు కాలేదని, ఇంకా అంతర్గత సమీక్షలు జరుగుతున్నాయని తెలిపింది.

Published : 04 Mar 2023 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ (Foxconn) భారత్‌లో తయారీ పరిశ్రమ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ ఛైర్మన్‌ భారత్‌లో పర్యటించినప్పటికీ.. ఎలాంటి ఒప్పందాలూ ఇంకా చేసుకోలేదని తెలిపింది. భారత్‌లోపెట్టుబడులు పెడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. ఈ మేరకు శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

హోన్‌ హాయ్‌ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూ నేతృత్వంలోని బృందం భారత్‌లో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4 వరకు పర్యటించింది. అయితే, ఈ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలూ ఖరారు కాలేదని ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి చర్చలు, అంతర్గత సమీక్షలు జరుగుతున్నాయని పేర్కొంది. మీడియాలో వస్తున్నట్లుగా పెట్టుబడి మొత్తం ఫాక్స్‌కాన్‌ పేర్కొనలేదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తయారీ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. యాపిల్‌ ఫోన్లను తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ తమ ఐఫోన్‌ల తయారీ యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా యాపిల్‌ ఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ కర్ణాటకలో రాబోతోందని, లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శుక్రవారం ట్వీట్‌ చేశారు. కర్ణాటకలో 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోందంటూ బ్లూమ్‌బెర్గ్‌ వెలువరించిన కథనాన్ని ఉటంకిస్తూ బొమ్మై ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్ స్పష్టతనిచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు