Apple AirPods: ఫాక్స్‌కాన్‌కు యాపిల్‌ ఎయిర్‌పాడ్ల కాంట్రాక్ట్‌.. తెలంగాణలోనే తయారీ?

అనుబంధ సంస్థ ‘ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ’ ద్వారా ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో ప్లాంట్‌ నెలకొల్పే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి నుంచే యాపిల్‌ ఎయిర్‌పాడ్లను తయారు చేయొచ్చని సమాచారం.

Published : 16 Mar 2023 12:11 IST

దిల్లీ: యాపిల్‌ ఎయిర్‌పాడ్ల (Apple Airpods) తయారీ కాంట్రాక్టును ఫాక్స్‌కాన్‌ (Foxconn) దక్కించుకున్నట్లు సమాచారం. ఐఫోన్లు సహా మరికొన్ని సెమీకండ్టర్లను మాత్రమే ఇప్పటి వరకు అందిస్తున్న ఈ సంస్థ ఇకపై ఎయిర్‌పాడ్లు (Apple Airpods) కూడా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రముఖ వార్తాసంస్థ రాయిటార్స్ పేర్కొంది.

ప్రస్తుతం ఎయిర్‌పాడ్లను చైనాకు చెందిన కంపెనీలు యాపిల్‌కు సరఫరా చేస్తున్నాయి. అయితే, చైనా నుంచి తయారీని ఇతర దేశాలకూ విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే తాజాగా ఫాక్స్‌కాన్‌కు ఈ ఒప్పందాన్ని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. 

మరోవైపు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఫాక్స్‌కాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ సీఈఓ యాంగ్‌ లియూ ఇటీవల భారత్‌లో పర్యటించి ఆ విషయాన్ని ధ్రువీకరించారు. పర్యటనలో భాగంగా తెలంగాణనూ సందర్శించిన ఆయన ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజా ఎయిర్‌పాడ్ల తయారీ కేంద్రాన్ని తెలంగాణలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకోసం 200 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటార్స్‌ పేర్కొంది. దీనిపై ఫాక్స్‌కాన్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అనుబంధ సంస్థ ‘ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ’ ద్వారా ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో ప్లాంట్‌ నెలకొల్పే అవకాశం ఉందని కంపెనీలోని ఓ ఉన్నతాధికారి తెలిపినట్లు రాయిటార్స్‌ పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. 2024 ఆఖరు కల్లా తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. యాపిల్‌ సూచన మేరకే ఫాక్స్‌కాన్‌ భారత్‌లో ఎయిర్‌పాడ్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు కంపెనీ నుంచి రావాల్సి ఉంది.

తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నెల రెండో తేదీన సమావేశంలో చెప్పినట్లుగా.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీకేంద్రం ఏర్పాటుకు ఫాక్స్ కాన్ కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేశారు. కొంగరకలాన్ పార్కులో కార్యకలాపాలు త్వరగా ప్రారంభించేలా తమ బృందానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని