Atal pension yojana: ఆన్‌లైన్‌లోనూ అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ఖాతా తెరుచుకునే వీలు

అటల్‌ పెన్షన్‌ యోజన (APY) ఖాతాను తెరవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. రూ.1,000 నుంచి రూ.5వేలు వ‌ర‌కు నెల‌వారీ పెన్ష‌న్ పొందే ఈ పథకం ఖాతాను తెరిచేందుకు ఇకపై ఎటువంటి 

Published : 30 Jun 2022 16:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అటల్‌ పెన్షన్‌ యోజన (APY) ఖాతాను తెరవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. రూ.1,000 నుంచి రూ.5వేలు వ‌ర‌కు నెల‌వారీ పెన్ష‌న్ పొందే ఈ పథకం ఖాతాను తెరిచేందుకు ఇకపై ఎటువంటి బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ ఇ-కేవైసీతో ఆన్‌లైన్‌లోనే తెర‌వొచ్చు.

ఖాతా తెర‌వాల‌నుకునే వారు త‌మ ఆధార్ నంబ‌ర్‌ని ఉప‌యోగించి అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ఖాతాను బ్యాంక్ ఖాతా స‌హ‌కారంతో ఆన్‌లైన్‌లో సుల‌భంగా ప్రారంభిచొచ్చు. ఏపీవై ఫార‌ంను ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయ‌వ‌చ్చు. ఆధార్‌ని ఉప‌యోగించి ఆన్‌లైన్ ఏపీవై ఖాతాను తెరిచేట‌ప్పుడు.. మీ బ్యాంక్ ఖాతా నంబ‌ర్‌, ఆధార్‌తో అనుసంధానం అయిన ఫోన్‌ నంబర్‌, ఆధార్ నంబ‌ర్‌ను త‌ప్ప‌నిస‌రిగా అందించాలి. నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (NPS) నిర్వ‌హించే ప్ర‌భుత్వ సంస్థ అయిన పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) కూడా అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌కి రెగ్యులేట‌ర్‌.

ఇ-ఏపీవై బ్యాంక్ శాఖ‌ను సంద‌ర్శించాల్సిన అవ‌స‌రం లేకుండానే ఇబ్బందులు లేని డిజిట‌ల్ న‌మోదును అనుమ‌తిస్తుంది. శాఖ‌కు వెళ్ల‌కుండానే ఏపీవై ఖాతాను ఆన్‌లైన్‌లో తెర‌వ‌డానికి ఇ-ఏపీవై లింక్‌ను అన్ని ఏపీవై సేవా బ్యాంకుల వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయ‌వ‌చ్చు. అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న కోసం లింక్ NSDL NPS వెబ్‌సైట్‌ను కూడా సంద‌ర్శించొచ్చు.

ఇదీ అటల్‌ పెన్షన్‌ యోజన

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న 2015 మే 9న ప్రారంభమైంది. భార‌తీయులంద‌రికీ ముఖ్యంగా పేద‌లు, నిరుపేద‌లు, అసంఘ‌టిత రంగంలోని కార్మికుల కోసం సామాజిక భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను రూపొందించ‌డానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న కింద రూ.1000 - రూ.5000 వ‌ర‌కు పెన్షన్‌ పొందొచ్చు. ఎటువంటి చ‌ట్ట‌బ‌ద్ధమైన సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల ప‌రిధిలోకి రాని, ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపుదారు కానీ వారికి ప్ర‌భుత్వ కాంట్రిబ్యూషన్‌ ఉంటుంది.

అర్హ‌త:  18-40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న అర్హ‌త గ‌ల (అసంఘ‌టిత రంగంలో ప‌నిచేసే) భార‌త‌దేశ పౌరులంద‌రికీ అటల్ పెన్ష‌న్ యోజ‌నలో చందాదారులుగా న‌మోదు కావ‌చ్చు. ఈ చందాకు బ్యాంక్ ఖాతా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. చందాదారులు నెల‌వారీ, త్రైమాసిక‌, అర్ధ, వార్షిక ప్రాతిప‌దిక‌న ఈ పెన్ష‌న్ స్కీమ్‌కి చందా ఇవ్వ‌వ‌చ్చు. చందాదారులు కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి స్వ‌చ్ఛందంగా ఈ స్కీమ్ నుంచి కూడా నిష్క్ర‌మించ‌వ‌చ్చు. 60 ఏళ్ల అనంత‌రం నెల‌వారీ పెన్ష‌న్ చందాదారునికి అందుబాటులో ఉంటుంది. పెన్ష‌న్ తీసుకునే వ్య‌క్తి మ‌ర‌ణానంత‌రం అత‌డి జీవిత భాగ‌స్వామికి చందాదారుని 60 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కు సేక‌రించిన పెన్ష‌న్ నిధి, చందాదారుని నామినీకి తిరిగి ఇస్తారు. ఏపీవైలో దాదాపు 8 శాతం వడ్డీ రాబడి హామీ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని