Fuel sales: పెట్రో వాడకం తగ్గింది.. రేట్లు పెరిగినందుకేనా..?

దేశంలో ఏప్రిల్‌ నెల తొలి అర్ధభాగంలో చమురు వాడకం (Fuel sales) తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్‌ విక్రయాలు దాదాపు 10 శాతం తగ్గగా.. డీజిల్‌ వినియోగం 15.6 శాతం మేర కోసుకుపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.

Updated : 17 Apr 2022 00:45 IST

దిల్లీ: దేశంలో ఏప్రిల్‌ నెల తొలి అర్ధభాగంలో చమురు వాడకం (Fuel sales) తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్‌ విక్రయాలు దాదాపు 10 శాతం తగ్గగా.. డీజిల్‌ వినియోగం 15.6 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అటు వంటకు ఉపయోగించే ఎల్పీజీ వినియోగం సైతం గత నెలతో పోలిస్తే 1.7 శాతం మేర తగ్గగా.. జెట్‌ ఫ్యూయల్‌ వినియోగం సైతం 20.5 శాతం మేర తగ్గడం గమనార్హం. ఎప్పుడూ లేని స్థాయిలో ధరలు పెరగడమే ఇందుకు కారణం అనుకోవాలా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలో 137 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్‌ ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మార్చి 22న ఒక్కసారిగా వాటి ధరలను పెంచేశాయి. దీంతో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 మధ్య ఎన్నడూ లేని స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.10 మేర పెరిగింది. వంట గ్యాస్‌ ధర సైతం రూ.50 చొప్పున పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ పెట్రో ధరలు పెరుగతాయన్న అంచనాలు ముందు నుంచీ ఉన్నాయి. ఎన్నికల కారణంగానే వీటి ధరలను పెంచలేదన్న నిజం జనానికీ అర్థమైంది. దీంతో మార్చి మొదటి వారంలో అటు డీలర్లు, ఇటు సామాన్య ప్రజలు సైతం తమ ట్యాంకులను నింపేసుకున్నారు. దీంతో మార్చిలో పెట్రో వినియోగం మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. తద్వారా మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌ నెల తొలి అర్ధభాగంలో వినియోగం తగ్గినట్లుగా అనిపిస్తోంది.

ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య 1.12 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే తేదీలతో పోలిస్తే 12.1 శాతం అధికంగా కాగా.. 2019 మార్చితో (కొవిడ్‌కు ముందుతేడాది) పోలిస్తే 19.6 శాతం ఎక్కువ. అదే మార్చి నెల తొలి అర్ధభాగంతో చూసినప్పుడు 9.7శాతం తగ్గడం గమనార్హం.

⛽ ఇదే సమయంలో 3 మిలియన్‌ టన్నుల మేర డీజిల్‌ విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చినప్పుడు ఇది 7.4 శాతం అధికం కాగా.. 2019 మార్చితో పోలిస్తే 15.6 శాతం ఎక్కువ. మార్చితో పోల్చినప్పుడు మాత్రం 15.6 శాతం తగ్గడం గమనార్హం.

⛽ ఇదే తరహాలో ఎల్పీజీ, జెట్‌ ఫ్యూయల్‌ వినియోగం తగ్గడం గమనార్హం. అంటే, చమురు ధరలు పెరగడం వల్ల వినియోగం తగ్గలేదన్న విషయం దీనిబట్టి అర్థమవుతోంది. కేవలం ధరలు పెరుగుతాయన్న ముందస్తు అంచనాలతో మార్చిలో పెద్ద ఎత్తున కొనుగోలు జరపడం వల్లే ఏప్రిల్‌లో వినియోగం తగ్గినట్లు కనిపిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే మార్చి నెలలో పెద్దగీత కంటే ఏప్రిల్‌ నెలలో గీసిన పెద్ద గీత కాస్త చిన్నగా ఉందే తప్ప.. వాస్తవంలో అయితే ఈ గీత కూడా పెద్దదే అన్నమాట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు