IPO: సగానికి తగ్గిన ఐపీఓలు.. ఎల్‌ఐసీ తీసేస్తే అంతంత మాత్రమే

IPO: 2021-22లో వివిధ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1,11,547 కోట్లు సమకూర్చుకున్నాయి. 2022-23 (FY23)లో ఆ విలువ రూ.52,116 కోట్లకు పడిపోయింది.

Published : 30 Mar 2023 20:29 IST

ముంబయి: రేపటితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ (IPO)ల జోరు నెమ్మదించింది. 2021-22 (FY22)తో పోలిస్తే ఈ ఏడాది విలువపరంగా పబ్లిక్ ఇష్యూలు దాదాపు సగానికి పడిపోయాయి. క్రితం ఏడాది 53 కంపెనీల షేర్లు మార్కెట్‌లో కొత్తగా నమోదు కాగా.. ఈసారి ఆ సంఖ్య 37కు పరిమితమైనట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాంలు వెల్లడించాయి.

ఎల్‌ఐసీ తీసేస్తే..

ఎఫ్‌వై22లో వివిధ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1,11,547 కోట్లు సమకూర్చుకున్నాయి. 2022-23 (FY23)లో ఆ విలువ రూ.52,116 కోట్లకు పడిపోయింది. పైగా దీంట్లో ఒక్క ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారానే రూ.20,557 కోట్లు సమకూరాయి. ఏడాది మొత్తంలో ఐపీఓ ద్వారా వచ్చిన నిధుల్లో ఇది 39 శాతానికి సమానం. ఎల్‌ఐసీని మినహాయిస్తే ఈసారి ఐపీఓల ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న మొత్తం రూ.31,559 కోట్లకు పరిమితమై ఉండేది.

రీట్స్‌/ఇన్విట్‌ల ద్వారా రూ.1,166 కోట్లు..

మొత్తంగా ఎఫ్‌వై23లో పబ్లిక్‌ ఈక్విటీ నిధుల సమీకరణ ద్వారా రూ.76,076 కోట్లు సమకూరాయి. క్రితం ఏడాది వచ్చిన రూ.1,73,728 కోట్లతో పోలిస్తే ఈసారి 56 శాతం క్షీణత నమోదైంది. ఎస్‌ఎంఈ ఇష్యూలు కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా రూ.54,344 కోట్లు సమకూరాయి. దీంట్లో క్యాపిటల్‌ మార్కెట్ల మార్గాన రూ.85,021 కోట్లు వచ్చాయి. దీంట్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.11,231 కోట్లు, క్యూఐపీల ద్వారా రూ.8,169 కోట్లు, రీట్స్‌/ఇన్విట్ల మార్గాన రూ.1,166 కోట్లు సమకూరాయి. మరోవైపు పబ్లిక్‌ బాండ్ల ద్వారా కంపెనీలు మరో రూ.8,944 కోట్లు రాబట్టుకున్నాయి. ఇలా ఐపీఓ, బాండ్లు కలిపి మొత్తంగా ఈ ఏడాదిలో వివిధ సంస్థలు రూ.85,021 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఈ మొత్తం రూ.1,85,438 కోట్లుగా నమోదైంది.

కొత్తతరం సాంకేతిక కంపెనీలు వెనక్కి..

ఈ ఆర్థిక సంవత్సరం అతిపెద్ద ఐపీఓల జాబితాలో ఎల్‌ఐసీ (రూ.రూ.20,557 కోట్లు), డెలివరీ (రూ.5,235 కోట్లు), గ్లోబల్‌ హెల్త్‌ (రూ.2,206 కోట్లు) ఉన్నాయి. ఈ ఏడాదిలో వచ్చిన మొత్తం 37 పబ్లిక్ ఇష్యూల్లో 25 మే, నవంబర్‌, డిసెంబరు నెలల్లోనే రావడం గమనార్హం. నాలుగో త్రైమాసికంలో ఐపీఓల సంఖ్య తొమ్మిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మొత్తం 37 ఐపీఓల్లో కేవలం రెండు మాత్రమే కొత్తతరం సాంకేతిక కంపెనీలు. క్రితం ఏడాది ఈ రంగంలో ఐదు కంపెనీలు రూ.41,733 కోట్లు సమకూర్చుకున్నాయి.

ప్రజల స్పందన అంతంతే..

ఐపీఓలపై ఈ ఏడాది ప్రజల ఆసక్తి సైతం తగ్గింది. 11 ఇష్యూలకు మాత్రమే 10 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం సైతం గణనీయంగా పడిపోయింది. క్రితం ఏడాది రిటైల్‌ మదుపర్ల నుంచి సగటున 13.32 లక్షల దరఖాస్తులు రాగా.. ఈసారి అది 5.64 లక్షలకు తగ్గింది.

సిద్ధంగా 54 ఐపీఓలు..

వచ్చే ఆర్థిక సంవత్సరంలో చాలా కంపెనీలు ఐపీఓకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 54 కంపెనీలు సెబీ అనుమతి పొంది సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి రూ.76,189 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరో రూ.32,940 కోట్ల సమీకరణకు 19 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని