NPS నిధులు ఇచ్చేదే లేదు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం ఝలక్
ఎన్‌పీఎస్ (NPS) నిధుల్లో తమ వాటాను తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. చట్ట ప్రకారం ఆ నిధులను వెనక్కి ఇచ్చేదే లేదని స్పష్టం చేసింది.
జైపుర్: జాతీయ పింఛను విధానం (National Pension Scheme) విషయంలో కొన్ని రాష్ట్రాలతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎన్‌పీఎస్ కింద జమ అయిన చందాల సొమ్మును తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్ (NPS) నిధులను తిరిగిస్తారని రాష్ట్రాలు అంచనా పెట్టుకోవద్దని, అది అసాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు.
రాజస్థాన్ వేదికగా పలు రంగాల వాటాదారులతో జరిగిన బడ్జెట్ అనంతర చర్చల్లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జాతీయ పింఛను విధానం కింద ఉద్యోగుల ఈపీఎఫ్‌వో (EPFO) నుంచి జమ అయిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగివ్వాలని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇలాంటి అంచనాలేమైనా రాష్ట్రాలకు ఉంటే.. అది సాధ్యపడదని చెబుతున్నా. ఆ డబ్బుపై అధికారం ఉద్యోగులదే. ఆ డబ్బులకు వడ్డీ వస్తుంది. పదవీ విరమణ తర్వాతే ఆ డబ్బు ఉద్యోగుల చేతికి వస్తుంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాల చేతికి ఇవ్వడం అనేది కుదరని పని’’ అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అనంతరం దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి వివేక్ జోషీ స్పందిస్తూ.. ‘‘కొన్ని రాష్ట్రాలు పాత పింఛను విధానాన్ని (Ols Pension Scheme) అమలు చేయడం, కేంద్రం కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడం మంచి పద్ధతి కాదు. ఎన్‌పీఎస్ నిధుల్లో తమ వాటా సొమ్మును వెనక్కి ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం కుదరదు’’ అని తేల్చిచెప్పారు.
జాతీయ పింఛను విధానాన్ని (NPS) కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు.. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాయి. పంజాబ్ కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. అయితే, ఇటీవల అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ.. ఎన్‌పీఎస్ నిధులను కేంద్రం షేర్ మార్కెట్లలో పెట్టి.. ఉద్యోగులను తమ కర్మకు వదిలేయడం సరికాదని మండిపడ్డారు. ఎన్‌పీఎస్ నిధులను తిరిగిఇవ్వాలని, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి దీనిపై స్పష్టతనిచ్చారు. కాగా.. జాతీయ పింఛను విధానం(NPS) లేదా పాత పింఛను విధానంలో దేన్ని ఎంచుకోవాలనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్రం ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించింది.
NPS విధానమిది..
2004 జనవరి 1 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఎన్‌పీఎస్ (NPS) వర్తిస్తుంది. ఈ విధానంలో పింఛను నిధి కింద ప్రతినెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తం తీసుకుని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తూ నేషనల్ పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తుంది. ఉద్యోగి పదవీవిరమణ చేసే నాటికి జమ అయిన మొత్తంలో సగం పదవీవిరమణ సందర్భంగా అందజేస్తారు. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టి ఆ మొత్తంపై వచ్చే లాభాలను నెలనెలా పింఛను రూపంలో అందజేస్తారు. అంటే పెట్టుబడులపై లాభాల ఆధారంగా పింఛను మొత్తం ఎంతనేది ఆధారపడి ఉంటుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల సర్కారు జమ చేసే వాటాను 14 శాతానికి పెంచింది.
పాత పింఛను విధానంలో ఇలా..
పాత విధానం (OPS)లో పింఛను కోసం ఉద్యోగి జీతం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోదు. ఉద్యోగి పదవీవిరమణ చేసే నాటికి ఉన్న మూల వేతనం, డీఏ కలిపిన మొత్తంలో 50% పింఛను రూపంలో ప్రతినెలా అందుతుంది. ఫిట్‌మెంట్‌తో పాటు ద్రవ్యోల్బణం మేరకు డీఏ పెరిగి.. ఆ మేరకు పింఛను కూడా పెరుగుతుంది. ఇలా అందే పింఛను సీపీఎస్ పింఛను కంటే చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా తమ పదవీవిరమణ అనంతరం జీవితానికి భరోసా ఉంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగి మరణిస్తే ఆయన భార్యకు, లేదా దివ్యాంగులైన పెళ్లికాని పిల్లలకు సగం పింఛను అందుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
china: తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Crime News
Suicide: నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!