Stock Market: అయిదో రోజూ సెన్సెక్స్‌కు లాభాలే

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో అయిదో రోజూ సెన్సెక్స్‌ లాభపడింది. అయితే నిఫ్టీ నష్టాల్లో ముగిసింది.

Published : 20 Jun 2024 03:01 IST

సమీక్ష
గరిష్ఠాల నుంచి నిఫ్టీ వెనక్కి

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో అయిదో రోజూ సెన్సెక్స్‌ లాభపడింది. అయితే నిఫ్టీ నష్టాల్లో ముగిసింది. ఇంట్రాడేలో రెండు సూచీలు కొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. బ్యాంకింగ్‌ షేర్లు దుమ్మురేపగా, యంత్ర పరికరాలు, ఇంధన షేర్లు నిరాశపరిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 1 పైసా తగ్గి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు ధర   0.22% తగ్గి 85.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

 • సెన్సెక్స్‌ ఉదయం 77,543.22 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. 76,954.87 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. మళ్లీ పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, 77,851.63 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 36.45 పాయింట్ల లాభంతో 77,337.59 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 41.90 పాయింట్లు కోల్పోయి 23,516 దగ్గర స్థిరపడింది.
 • కంపెనీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) రోహిత్‌ కుమార్‌ గుప్తా రాజీనామా చేయడంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 4.04% నష్టపోయి రూ.154.35 వద్ద ముగిసింది.
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 నష్టపోయాయి. టైటన్‌ 3.47%, ఎల్‌ అండ్‌ టీ 2.66%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.49%, మారుతీ 2.43%, ఎన్‌టీపీసీ 1.99%, రిలయన్స్‌ 1.46%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.29%, పవర్‌గ్రిడ్‌ 1.25%, అల్ట్రాటెక్‌   1.24%, ఐటీసీ 1.19%, హెచ్‌యూఎల్‌ 1.10% నీరస పడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.06%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.94%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.93%, కోటక్‌ బ్యాంక్‌ 1.67%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.48%, ఎస్‌బీఐ 0.95% రాణించాయి. 
 • జాగరణ్‌ ప్రకాశన్‌కు ఇచ్చిన రూ.202.8 కోట్ల పన్ను నోటీసులను జీఎస్‌టీ అధికారులు వెనక్కి తీసుకున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. 
 • ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ 18% వాటా విక్రయం: ఇండస్‌ టవర్స్‌లో 18% వాటాను 1.7 బిలియన్‌ యూరోల (రూ.15,300 కోట్ల)కు విక్రయించినట్లు వొడాఫోన్‌ వెల్లడించింది. ఇందులో మెజారిటీ నిధులను భారత్‌లో వొడాఫోన్‌ ఆస్తులపై తీసుకున్న బ్యాంక్‌ రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ వాటా 3.1 శాతానికి పరిమితమైంది. ఇదే సమయంలో ఇండస్‌టవర్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ మరో 1% వాటాను రూ.862 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఎయిర్‌టెల్‌ వాటా 48.95 శాతానికి పెరిగింది.                                 
 • రేమండ్స్‌ బోర్డులో ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గౌతమ్‌ సింఘానియా పునర్నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఐఐఏఐ సిఫారసు చేసింది. గౌతమ్‌పై వచ్చిన గృహ హింస, అక్రమంగా నిధులు సమీకరణ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. భార్య నవాజ్‌ మోదీతో విడాకుల సమస్యలు ముగిసేవరకు గౌతమ్‌ సింఘానియా బోర్డు నుంచి వైదొలగాలని సూచించింది.
 • మూసివేసిన, నిలిపివేసిన 23 బొగ్గు గనులను ఆదాయ పంపిణీ విధానంలో ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించినట్లు కోల్‌ ఇండియా తెలిపింది. వీటి నుంచి కనీస ఆదాయ వాటా 4% లభిస్తుందని, కాంట్రాక్టు కాలవ్యవధి గరిష్ఠంగా 25 ఏళ్లని కంపెనీ పేర్కొంది.
 • భారత్‌లో ప్రజా రంగ విభాగాన్ని ప్రారంభించినట్లు సేల్స్‌ఫోర్స్‌ వెల్లడించింది. భారత అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ రుణ సొల్యూషన్‌లను తీసుకొచ్చినట్లు వివరించింది.
 • రాబోయే 50 సంవత్సరాల్లో భారతదేశ సంపద విలువ 1,000% పెరుగుతుందనే అంచనాను ఎన్‌ఎస్‌ఈ సీఈఓ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి, యువజనాభా ఇందుకు కారణమవుతాయని అన్నారు.

ఐపీఓల వివరాలు

 • ఉక్కు ఉత్పత్తుల తయారీ సంస్థ వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓ ఈనెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ.171 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది. 
 • ఆక్మే ఫిన్‌ట్రేడ్‌ (ఇండియా) ఐపీఓ మొదటి రోజు 3 రెట్ల స్పందన లభించింది.
 • డీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ మొదటి రోజు 2.51 రెట్ల స్పందన నమోదైంది.
 • ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీ తయారీ సంస్థ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ ఐపీఓ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీఓలో భాగంగా రూ.1000 కోట్ల విలువైన తాజా షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.500 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని