Gautam Adani: ఫోర్బ్స్‌ ఆసియా దాతృత్వ జాబితా.. భారత్‌ నుంచి అదానీ సహా ముగ్గురు

Forbes Philanthropy list: ఆసియాలో పెద్ద మొత్తంలో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌(Forbes) ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి గౌతమ్‌ అదానీ (Gautam Adani) సహా ముగ్గురు చోటు దక్కించుకున్నారు.

Published : 06 Dec 2022 14:05 IST

సింగపూర్‌: అటు వేల కోట్ల వ్యాపారం చేస్తూనే.. ఇటు దాతృత్వ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేసే వ్యాపారవేత్తలు చాలా మందే ఉన్నారు. అలా ఆసియాలో దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసే వారి జాబితాను తాజాగా ఫోర్బ్స్‌ (Forbes) విడుదల చేసింది. ‘దాతృత్వంలో ఆసియా హీరోలు’ పేరిట 16వ ఎడిషన్‌ జాబితాను ప్రచురించింది. అందులో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకోగా.. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) ముందు వరుసలో నిలిచారు.

ఈ ఏడాది జూన్‌లో 60వ పుట్టినరోజు నిర్వహించుకున్న గౌతమ్‌ అదానీ (Gautam Adani).. దాతృత్వ కార్యక్రమాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. చదువు, వైద్యం, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాల కోసం రూ.60 వేల కోట్లు అదానీ గ్రూప్‌ ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా పరోపకారిగా అదానీ అగ్రస్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏటా 37 లక్షల మందికి తమ ఫౌండేషన్‌ ద్వారా అదానీ గ్రూప్‌ సాయం అందిస్తుందని ప్రకటించింది.

కొన్ని దశాబ్దాలుగా దాతృత్వ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న శివ్‌ నాడార్‌ (Shiv Nadar) మరోసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. శివ్‌నాడార్‌ ఫౌండేషన్‌ ద్వారా కొన్నేళ్లుగా ఆయన ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఏడాది ఆ ఫౌండేషన్‌ రూ.11,600 కోట్లు ఖర్చు చేయనుంది.

తాను నెలకొల్పిన మెడికల్‌ రీసెర్చి ట్రస్ట్‌కు రూ.600 కోట్ల నిధులు సమకూరుస్తానన్న ప్రకటన ద్వారా టెక్‌ దిగ్గజం అశోక్‌ సూతా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వృద్ధాప్యం, నరాల సంబంధిత అనారోగ్యాలకు సంబంధించిన పరిశోధనలకు గానూ 2021 ఏప్రిల్‌లో ఆయన స్కాన్‌ (SKAN) పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. రాబోయే పదేళ్లలో పరిశోధనలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాల ద్వారా ఆయనకు సంపద సమకూరుతోంది.

ఈ ముగ్గురితో పాటు మలేసియన్‌-ఇండియన్‌ బ్రహ్మల్‌ వాసుదేవన్‌, ఆయన భార్య శాంతి సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాము నెలకొల్పిన క్రియేడర్‌ ఫౌండేషన్‌ ద్వారా మలేసియా, భారత్‌లో స్థానికులకు సాయం చేస్తున్నారు. మలేసియాలోని పెరక్‌ రాష్ట్రంలోని టీచింగ్‌ హాస్పిటల్‌ ఏర్పాటుకు వీరిద్దరూ 50 మిలియన్‌ మలేసియన్‌ రింగిట్‌ (11 మిలియన్‌ డాలర్లు) విరాళం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని