Adani Salary: అదానీ వేతనం రూ.9.26 కోట్లు.. సొంత ఉద్యోగుల కంటే తక్కువట!

అదానీ వార్షిక వేతనం తనతోటి పారిశ్రామికవేత్తలతోపాటు సొంత కంపెనీల్లో పనిచేసే కీలక సిబ్బంది కంటే తక్కువట.

Updated : 23 Jun 2024 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ (Gowtam Adani) వార్షిక వేతనం ఎంత ఉంటుందనే విషయంపై అందరికీ ఆసక్తే. అయితే, ఆయన జీతం.. తన సహచర పారిశ్రామికవేత్తలతోపాటు సొంత కంపెనీల్లో పనిచేసే కీలక సిబ్బంది కంటే తక్కువట. ఏడాదికి రూ.9.26కోట్లు మాత్రమే జీతంగా (Adani Salary) తీసుకుంటారని వెల్లడైంది. ఆ గ్రూపునకు చెందిన పది లిస్టెడ్‌ కంపెనీలు వార్షిక నివేదికలు ఇవ్వగా.. అందులో రెండింటి నుంచే అదానీ వేతనం తీసుకున్నట్లు వెల్లడైంది.

అదానీ గ్రూపు సంస్థల్లో ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL) వార్షిక నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్‌ అదానీ వేతనంగా రూ.2.19 కోట్లు తీసుకున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో రూ.27లక్షలు పొందారు. మొత్తంగా ఏడాదిలో రూ.2.46కోట్లు తీసుకోగా.. అంతకుముందు వేతనంతో పోలిస్తే 3శాతం ఎక్కువ అని తాజా నివేదిక వెల్లడించింది. మరో కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ నుంచి రూ.6.8 కోట్లు జీతంగా పొందుతున్నట్లు తెలిసింది. కుటుంబ యాజమాన్యంలో పనిచేసే అన్ని పెద్ద సంస్థల అధినేతలతో పోలిస్తే అదానీ వార్షిక వేతనం తక్కువ కావడం గమనార్హం.

సహచర పారిశ్రామికవేత్తల కంటే..

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ వార్షిక వేతనం రూ.15కోట్లుగా ఉండేది. అయితే, కొవిడ్‌ తర్వాత తన వేతనాన్ని తీసుకోవడం లేదు. ఇక భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ మిత్తల్‌ (2022-23లో రూ.16.7కోట్లు), రాజీవ్‌ బజాజ్‌ (రూ.53.7కోట్లు), పవన్‌ ముంజాల్ (రూ.80 కోట్లు), ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌, ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ల కంటే అదానీ వార్షిక వేతనం తక్కువ కావడం గమనార్హం. ఏఈఎల్‌ నుంచి అదానీ సోదరుడు రాజేశ్‌ మొత్తంగా రూ.8.37 కోట్లు పొందగా (రూ.4.71కోట్లు కమీషన్‌తో కలిపి).. ఆయన మేనల్లుడు ప్రణవ్‌ అదానీ రూ.6.46కోట్లు అందుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ జాబితా ప్రకారం.. అదానీ సంపద విలువ 106 బిలియన్‌ డాలర్లు. ఈ విషయంలో అంబానీతో పోటీపడుతున్న ఆయన ఒకానొక సమయంలో (2022లో) ఆసియాలోనే సంపన్న వ్యక్తిగానూ నిలిచారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో ఆయన సంపద కొంతమేరకు తరిగిపోయింది. సుమారు 111 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో అంబానీ కొనసాగుతుండగా.. అదానీ మాత్రం 14వ స్థానంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని