Adani Group: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై.. న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తున్నాం

అదానీ (Adani) గ్రూపుపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఒక్కరోజే అదానీ సంపద రూ.48వేల కోట్లు ఆవిరైనట్లు బ్లూమ్‌బర్గ్‌ అంచనా వేసింది.

Published : 26 Jan 2023 23:41 IST

దిల్లీ: కంపెనీ షేర్లు, ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూపు మరోసారి స్పందించింది. అవన్నీ ఆధారాల్లేకుండా, ఏకపక్షంగా చేసిన ఆరోపణలేనని.. తమ గ్రూప్‌ కంపెనీల షేర్ల విక్రయాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చేసినవని అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అమెరికా, భారత చట్టాల్లో ఉన్న నిబంధనలను పరిశీలిస్తున్నామని పేర్కొంది. అయితే, హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌పై దావా వేస్తారా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఒక్కరోజే రూ.48వేల కోట్ల నష్టం

అదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల అనంతరం అదానీ గ్రూప్‌లోని షేర్లు పతనమయ్యాయి. మొత్తంగా 7 నమోదిత కంపెనీల షేర్లు 3శాతం నుంచి 7శాతం నష్టపోయాయి. ఈ నేపథ్యంలో గౌతమ్‌ అదానీ ఒక్క రోజే సుమారు 6బిలియన్‌ డాలర్లు (రూ.48వేల కోట్లు) నష్టపోయినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ నివేదిక అంచనా వేసింది.

అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వ్యక్తిగత నికర సంపద 120 బిలియన్‌ డాలర్లు అని అంచనా. తాజాగా ఆరు బిలియన్‌ డాలర్లు నష్టపోవడంతో జనవరి 26నాటికి ఇది 113 బి.డాలర్లకు పడిపోయిది. అయితే, అదానీ సంపదలో ఎక్కువ భాగం గత మూడేళ్లలోనే సమకూరిందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్లు మూడేళ్లలో భారీగా లాభపడడంతో ఆయన సంపద 100బి.డాలర్లు పెరిగినట్లు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని