Gautam Adani: బఫెట్‌ను దాటేసిన గౌతమ్‌ అదానీ..ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానానికి!

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు....

Published : 25 Apr 2022 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ మదుపరి వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టి 123.7 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ కుబేరుల ఐదో స్థానంలో నిలిచారు. శుక్రవారం మార్కెట్‌ ముగింపు అనంతరం ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు.

పోర్టులు, విమానాశ్రయాల నిర్వహణ వంటి వ్యాపారాలతో పాటు ఎఫ్‌ఎంసీజీ రంగంలోనూ అదానీ రాణిస్తున్నారు. ఓ వైపు కొవిడ్‌ మహమ్మారి కారణంగా అన్ని దేశాలు, ఆర్థిక వ్యవస్థలూ అతలాకుతలం అవ్వగా.. అదానీ వ్యాపారాలు మాత్రం దూసుకెళ్లడం గమనార్హం. దీంతో ఒక్క 2022లోనే ఆయన సంపద 43 బిలియన్‌ డాలర్లు పెరిగింది. మొత్తంగా ఆయన సంపద ఈ ఏడాదిలో 56 శాతం పెరిగింది.

ముకేశ్‌ను వెనక్కి..

భారత్‌తో పాటు ఆసియాలోనే కుబేరుడిగా మొదటి స్థానంలో కొనసాగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి తొలిసారి ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్‌ అదానీ టాప్‌-5లోకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో ప్రస్తుతం ఎలాన్‌ మస్క్‌ 269.7 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. జెఫ్‌ బెజోస్‌ (170.2 బిలియన్‌ డాలర్లు), బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (167.9 బిలియన్‌ డాలర్లు), బిల్‌గేట్స్‌ (130.2 బిలియన్‌ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని