ప్రభుత్వ చర్యలు.. కోలుకుంటున్న పరిశ్రమలు

పరిశ్రమలన్నీ కోలుకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక చర్యలతో కొవిడ్‌-19 ప్రభావం తగ్గిందని

Published : 08 Jan 2021 22:37 IST

దిల్లీ: పరిశ్రమలన్నీ కోలుకుంటున్న సంకేతాలు ఇస్తున్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక చర్యలతో కొవిడ్‌-19 ప్రభావం తగ్గిందని తెలిపారు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన జాతీయాదాయం అంచనాలపై ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.7% కుంచించుకుపోతుందని ఎన్‌ఎస్‌వో అంచనా వేసిన సంగతి తెలిసిందే.

‘ముందస్తుగా వేసిన అంచనాల నివేదిక జీడీపీ 7.7% క్షీణిస్తుందని నివేదించింది. కానీ ఇప్పుడు పరిశ్రమలన్నీ కోలుకుంటున్న చిహ్నాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక చర్యలతో కొవిడ్‌-19 ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. 2020-21కి వాస్తవ జీడీపీ రూ.134.40 లక్షల కోట్లు సాధించగలం’ అని రాజీవ్‌కుమార్‌ అన్నారు.

జీడీపీ అంచనాల ప్రకారం వ్యవసాయ రంగం మినహా దేశవ్యాప్తంగా అన్ని రంగాల వృద్ధిరేటులో తగ్గదుల నమోదైంది. ‘వాస్తవ జీడీపీ లేదా స్థిర ధరల వద్ద జీడీపీ 2020-21కి గాను రూ.134.40 లక్షల కోట్లుగా ఉండొచ్చు. 2019-20లో జీడీపీ అంచనా రూ.145.66 లక్షల కోట్లుగా ఉండేది. అంతకుముందు ఏడాది వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతంగా ఉండగా 2020-21కి -7.7%గా ఉంది’ అని అని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుత ఏడాది తయారీ రంగం వృద్ధిరేటు 9.4 శాతం సంకోచించే అవకాశం ఉంది. అదే గతేడాది 0.03 శాతంగా ఉండేది.

గనులు, క్వారీలు, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సహా అనేక సేవా రంగాల్లో అభివృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోతుందని గణాంక కార్యాలయం అంచనా వేసింది. అయితే 2020-21లో వ్యవసాయరంగం మాత్రం 3.4% వృద్ధిరేటు నమోదు చేసింది. అంతకుముందు ఇది 4 శాతంగా ఉండేది. కొవిడ్‌-19 వల్ల ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 23.9 శాతం తగ్గిపోగా రెండో త్రైమాసికంలో 7.5 శాతం తగ్గింది.

ఇవీ చదవండి
గృహ రుణాలపై SBI గుడ్‌న్యూస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని