బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీ

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవల మెరుగు కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపినట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Published : 28 Jul 2022 06:10 IST

కేంద్ర మంత్రి మండలి ఆమోదం

దిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవల మెరుగు కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపినట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. సేవలను మెరుగు పరచేందుకు తాజా మూలధనం, 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు, బ్యాలెన్స్‌ షీట్‌పై ఒత్తిడి తగ్గించడం, ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌)ను బీఎస్‌ఎన్‌ఎల్‌తో విలీనం చేసే చర్యలు ఈ ప్యాకేజీ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.43,694 కోట్లు నగదు రూపేణ, రూ.1.2 లక్షల కోట్లు నగదేతర రూపంలో నాలుగేళ్ల కాల వ్యవధిలో అందించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని వెల్లడించారు.

* బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు ప్రారంభించేందుకు 900/1800 మెగాహెర్ట్జ్‌్స బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపునకు అవసరమైన రూ.44,993 కోట్లను ఈక్విటీ ద్వారా చొప్పించనున్నట్లు తెలిపారు. వచ్చే 4 ఏళ్ల పాటు ఈ వ్యవస్థ అభివృద్ధికి రూ.22,471 కోట్ల మూలధన వ్యయాలు అవసరమవుతాయన్నది  అంచనాగా పేర్కొన్నారు.

* వాణిజ్యపరంగా అనుకూలం కాని గ్రామీణ వైర్‌లైన్‌ కార్యకలాపాల కోసం వయబిలిటీ-గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.13,789 కోట్లు, బ్యాలెన్స్‌ షీట్‌లో ఒత్తిడి తగ్గించేందుకు మరో రూ.33,404 కోట్ల బకాయిల్ని ఈక్విటీగా మార్చాలని నిర్ణయించారు.

* ప్రస్తుత రుణాల చెల్లింపునకు వీలుగా, నిధుల్ని  బీఎస్‌ఎన్‌ఎల్‌ సమీకరించేందుకు సార్వభౌమ గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్‌నెట్‌, బీబీఎన్‌ఎల్‌ మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు వాటిని బీఎస్‌ఎన్‌ఎల్‌తో విలీనం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కవరేజీ లేని గ్రామీణ ప్రాంతాల్లోనూ 4జీ మొబైల్‌ సేవల కోసం రూ.26,316 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.  

రెండేళ్లలో 5జీ సేవలు కూడా: 2019లో ప్రకటించిన రూ.74,000 కోట్ల ప్యాకేజీ అనంతరం, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1,000 కోట్ల వార్షిక నిర్వహణ లాభాన్ని ఆర్జిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆర్థికంగా పునర్నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. 3-4 ఏళ్లలో సంస్థ నికర లాభాన్ని ఆర్జిస్తుందన్నారు. రెండేళ్లలో 5జీ సేవలు కూడా ప్రారంభం కావొచ్చన్నారు. ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ విలీన ప్రణాళికకు మరింత సమయం పట్టొచ్చని, దీనికి సంక్లిష్ట ఆర్థిక పునర్నిర్మాణ ప్రక్రియ అవసరమవుతుందని తెలిపారు.

బ్రెజిల్‌లో బీపీసీఎల్‌ పెట్టుబడులకు అనుమతి: బీపీసీఎల్‌ బ్రెజిల్‌లోని భారత్‌ పెట్రో రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (బీఆర్‌పీఎల్‌) చమురు క్షేత్రంలో అదనంగా 1.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,800 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు