ఫేస్‌బుక్‌ ‘మెటా’ ఆదాయంలో క్షీణత

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ఆదాయం చరిత్రలో తొలిసారిగా తగ్గింది.

Published : 29 Jul 2022 03:28 IST

కంపెనీ చరిత్రలోనే మొదటిసారి
ప్రకటనల ఆదాయాలు తగ్గడం వల్లే


వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ఆదాయం చరిత్రలో తొలిసారిగా తగ్గింది. ఏప్రిల్‌-జూన్‌లో సంస్థ ఆదాయం 28.82 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే త్రైమాసిక ఆదాయం 29.08 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది 1 శాతం తక్కువ. లాభం కూడా 10.39 బిలియన్‌ డాలర్ల నుంచి (ఒక్కో షేరుకు 3.61 డాలర్లు) 36 శాతం తగ్గి 6.69 బిలియన్‌ డాలర్లకు (ఒక్కో షేరుకు 2.46 డాలర్లు) పరిమితమైంది. టిక్‌టాక్‌ నుంచి తీవ్ర పోటీ నేపథ్యంలో, ప్రకటనల ఆదాయాలు తగ్గడం ఇందుకు కారణం. ఏప్రిల్‌- జూన్‌లో మెటా 28.91 బిలియన్‌ డాలర్ల ఆదాయంపై షేరుకు 2.54 డాలర్ల లాభాన్ని ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.  

పోటీ సంస్థల బాటలోనే..
డిజిటల్‌ ప్రకటనల మార్కెట్‌ నెమ్మదించడంతో మెటాకు పోటీ సంస్థలైన గూగుల్‌, ట్విటర్‌, స్నాప్‌ కూడా లాభాల్లో క్షీణతను నమోదు చేశాయి. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ రెండేళ్లలోనే అత్యంత తక్కువ త్రైమాసిక వృద్ధిని ప్రకటించింది. ‘మెటా పెట్టుబడులను తగ్గించుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారీ నియామకాలను చేపట్టినందున.. ఉద్యోగుల సంఖ్య పెంచుకోవడాన్ని కూడా  క్రమంగా తగ్గించుకునే యోచనలో ఉంద’ని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఆర్థిక మందగమనంతో పాటు మరికొన్ని సమస్యలు కూడా మెటా ఎదుర్కొంటోంది. కంపెనీ ప్రకటనల వ్యాపారంలో కీలక పాత్ర పోషించిన చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి శెరైల్‌ శాండ్‌బర్గ్‌ వైదొలగడం ఇందులో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మెటా ప్రకటనల ఆదాయం 12.4 శాతం పెరగొచ్చని అంచనా వేశామని, కానీ ఈ అంచనాను సంస్థ అందుకోకపోవచ్చని ఇన్‌సైడర్‌ ఇంటెలిజెన్స్‌కు చెందిన విశ్లేషకుడు డెబ్రా ఆహో విలియమ్‌సన్‌ అభిప్రాయపడుతున్నారు. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఆదాయం 26- 28.5 బిలియన్‌ డాలర్లుగా నమోదుకావచ్చని మెటా అంచనా వేసింది. వాల్‌స్ట్రీట్‌ అంచనా కంటే ఇది తక్కువే కావడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts