జులై జీఎస్‌టీ వసూళ్లు రూ.1,48,995 కోట్లు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. జులైలో రూ.1,48,995 కోట్లమేర వసూలయ్యాయి. ఏప్రిల్‌లో వచ్చిన రూ.1,67,540 కోట్లతో పోలిస్తే ఇప్పటివరకు వసూలైన రెండో అత్యధికమొత్తం ఇదేనని కేంద్ర ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated : 02 Aug 2022 05:32 IST

ఈనాడు, దిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. జులైలో రూ.1,48,995 కోట్లమేర వసూలయ్యాయి. ఏప్రిల్‌లో వచ్చిన రూ.1,67,540 కోట్లతో పోలిస్తే ఇప్పటివరకు వసూలైన రెండో అత్యధికమొత్తం ఇదేనని కేంద్ర ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 5నెలల్లో ఒక్కసారి కూడా వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లకు తగ్గలేదు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి 28% వృద్ధి నమోదైంది. మొత్తం వసూళ్లలో సీజీఎస్‌టీ వాటా రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ వాటా రూ.32,807 కోట్లు, ఐజీఎస్‌టీవాటా రూ.79,518కోట్లు కాగా సెస్సు రూ.10,920 కోట్లుగా ఉంది. ఐజీఎస్‌టీలో కేంద్రం సీజీఎస్‌టీ కింద రూ.32,365 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ.26,774 కోట్లు సర్దుబాటు చేసింది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి జులైలో సీజీఎస్‌టీ కింద రూ.58,116 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ.59,581 కోట్లు జమ అయింది. గత ఏడాది జులైలో రూ.1,16,393 కోట్ల పన్ను వసూలుకాగా ఈసారి అందులో 28% వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దిగుమతి చేసుకున్న వస్తువులపై 48%, దేశీయ లావాదేవీలపై 22% అధిక ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం జులైవరకున్న వసూళ్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు 35%పెరిగాయి. జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న చర్యలు ఇందుకు దోహదం చేసినట్లుఆర్థికశాఖ పేర్కొంది.

ఏపీలో 25%, తెలంగాణలో 26% వృద్ధి

గత ఏడాది జులైతో పోలిస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో 25%, తెలంగాణలో 26% మొత్తం ఎక్కువ వసూలైంది. ఏపీలో గత ఏడాది ఇదే నెలలో రూ.2,730 కోట్లు రాగా, ఈసారి అది రూ.3,409 కోట్లకు చేరింది. తెలంగాణ వసూళ్లు రూ.3,610 కోట్ల నుంచి రూ.4,547 కోట్లకు పెరిగాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో సగటున 22% వృద్ధి నమోదుకాగా, తెలుగురాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువే వచ్చింది. అయితే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలుగురాష్ట్రాల్లోనే కనిష్ఠ వృద్ధి నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని