LIC: ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 కంపెనీల్లో ఎల్‌ఐసీ

ఇటీవల స్టాక్‌ మార్కెట్లో నమోదైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 సంస్థల్లో స్థానం సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్త జాబితాలో 98వ ర్యాంక్‌ సాధించిన ఎల్‌ఐసీ, దేశీయంగా తొలి స్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 51 స్థానాలు మెరుగుపర్చుకుని 104వ స్థానంలో నిలిచింది.

Updated : 04 Aug 2022 10:25 IST

దేశీయంగా తొలి స్థానం.. ప్రపంచంలో 98వ ర్యాంక్‌

51 స్థానాలు మెరుగుపర్చుకున్న ఆర్‌ఐఎల్‌
జాబితాలో యూఎస్‌ రిటైలర్‌ వాల్‌మార్ట్‌దే అగ్రస్థానం

భారత్‌ నుంచి 9 సంస్థలు  

దిల్లీ: ఇటీవల స్టాక్‌ మార్కెట్లో నమోదైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 సంస్థల్లో స్థానం సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్త జాబితాలో 98వ ర్యాంక్‌ సాధించిన ఎల్‌ఐసీ, దేశీయంగా తొలి స్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 51 స్థానాలు మెరుగుపర్చుకుని 104వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి మొత్తం 9 సంస్థలు ఈ జాబితాలో చోటు సాధించాయి. ఇందులో 5 ప్రభుత్వ రంగ సంస్థలు కాగా, 4 ప్రైవేటు సంస్థలు. 2022 మార్చి ఆఖరుకు నమోదిత సంస్థల విక్రయ పరిమాణం ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ జాబితాలోని మొత్తం కంపెనీల విక్రయాలు 19 శాతం పెరిగి 37.8 లక్షల కోట్ల డాలర్లకు చేరాయి.
* ఎల్‌ఐసీ 97.26 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.58 లక్షల కోట్లు) ఆదాయంపై, 553.8 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,300 కోట్లు) లాభం ఆర్జిస్తోంది.
* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 93.98 బి.డాలర్ల ఆదాయం, 8.15 బి.డాలర్ల నికర లాభంతో ఉంది. గత 19 ఏళ్లుగా ఆర్‌ఐఎల్‌ ఈ జాబితాలో స్థానం దక్కించుకుంటోంది.
* ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) 28 స్థానాలు మెరుగుపర్చుకుని 142వ స్థానం, ఓఎన్‌జీసీ 16 స్థానాలు పెరిగి 190వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి.
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 17 స్థానాలు పైకి వచ్చి 236వ ర్యాంకు, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) 19 స్థానాలు మెరుగుపర్చుకుని 295వ ర్యాంకు పొందాయి.
* టాటా గ్రూప్‌ సంస్థల నుంచి టాటా మోటార్స్‌ (370వ ర్యాంకు), టాటా స్టీల్‌ (435వ ర్యాంకు)  ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 437వ ర్యాంకు పొందింది.
* అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచింది. అమెజాన్‌, స్టేట్‌ గ్రిడ్‌, చైనా నేషనల్‌ పెట్రోలియం, సినోపెక్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
* ఈ జాబితాలోని అమెరికా కంపెనీల కంటే చైనా (తైవాన్‌తో కలిపి) సంస్థలు తొలిసారిగా అధిక ఆదాయాలు నమోదు చేశాయి. మొత్తం ఆదాయాల్లో 31 శాతం వాటా ఈ కంపెనీలదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని