Updated : 06 Aug 2022 06:29 IST

EMI: ఈఎంఐ మరింత భారం

రెపో రేటు 0.50 పెరిగి 5.40 శాతానికి చేరడం వల్లే
ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు యథాతథంగా
ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష

‘అంతర్జాతీయ పరిణామాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణ సమస్యనూ ఎదుర్కొంటోంది. పటిష్ఠ మూలాల కారణంగా 2022-23లోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం కొనసాగుతుంది. ఆర్థిక రంగం వద్ద తగినంత మూలధనం ఉంది. మనకు సరిపడా విదేశీ మారకపు నిల్వలూ ఉన్నందున, పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. మన వ్యాపారంలో తైవాన్‌ వాటా 0.7 శాతమే కావడంతో, తాజా ఉద్రిక్తతల ప్రభావం పెద్దగా ఉండదు.’ - శక్తికాంత దాస్‌,ఆర్‌బీఐ గవర్నరు 

ఈనాడు బిజినెస్‌బ్యూరో- వాణిజ్య విభాగం

రెపో రేటును 0.50 శాతం పెంచి, 5.40 శాతానికి పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. ఈనెల 3-5 మధ్య జరిగిన ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. మేలో 0.40 శాతం, జూన్‌లో 0.50 శాతం, తాజాగా 0.50 శాతం పెంచడంతో, 3 నెలల వ్యవధిలోనే రెపోరేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 1.40 శాతం పెరిగింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్కుగా రెపోరేటును తీసుకుంటున్నాయి. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు ఏమాత్రం ఆలస్యం చేయవు. అంటే ఏప్రిల్‌లో 6.5-7 శాతం వడ్డీరేటుకు లభించిన రుణం, ఇప్పుడు 8 శాతానికి మించే అవకాశాలున్నాయి. దీనివల్ల ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం/రుణం చెల్లింపు కాలం పెరుగుతుంది. బ్యాంకు రుణం తీసుకుని, కొత్తగా ఇల్లు కొనాలని అనుకునే వారికి ఇబ్బందే. ఆదాయానికి తగ్గట్లు ఇచ్చే రుణం మొత్తం తగ్గుతుంది. దీంతో చేతి నుంచి అధికంగా మార్జిన్‌ మనీ చెల్లించాల్సి వస్తుంది. ఇంటి కోసం రూ.30 లక్షల రుణం తీసుకున్న వారి ఈఎంఐ ఏప్రిల్‌తో పోలిస్తే, ఇప్పుడు రూ. 2,500కు మించడంతో నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడుతుంది. వాహన, వ్యక్తిగత రుణాలదీ ఇదే పరిస్థితి.
మరిన్ని రేట్ల పెంపునకు సంకేతాలు
రెపోరేటు ప్రతిపాదనకు ఎంపీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ‘సర్దుబాటు’ విధాన వైఖరిని క్రమంగా ఉపసంహరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక్కడితో రేట్ల పెంపును ఆపేస్తామని అనుకోకూడదని, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేవరకు మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని ఆర్‌బీఐ గవర్నరు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.2 శాతం, ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందన్న గత అంచనాలనే ఆర్‌బీఐ కొనసాగించింది.

డిపాజిటర్లకు ఊరట
గత రెండేళ్లుగా తక్కువ వడ్డీ రేట్లతో ఇబ్బంది పడుతున్న డిపాజిటర్లకు మాత్రం ఇది కలిసొచ్చే అంశం. వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 7 శాతానికి చేరితే.. అయిదేళ్ల వ్యవధికి రూ.లక్ష డిపాజిట్‌పై దాదాపు రూ.3,436 అధికంగా లభిస్తుంది. సాధారణంగా డిపాజిట్‌ వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి 8 శాతం మధ్యలో ఉంటే మంచి రేటుగానే భావిస్తారు. రాబోయే 6 నెలల్లో వడ్డీ రేటు మరో 1 శాతం  పెరుగుతుందనే అంచనాలున్నాయి. పెరుగుతున్న రెపో ధోరణిని గమనిస్తే, ఆర్థిక సంవత్సరం చివరికి డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటు లభిస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికే పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు 7.475 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. సీనియర్‌ సిటిజన్లకు ఇది లాభదాయకమే. కొత్తతరం బ్యాంకులు ఇప్పటికే ఎఫ్‌డీలపై 7.5శాతానికి మించి వడ్డీ అందిస్తున్నాయి.

బ్యాంకులు రుణ రేట్లు పెంచేస్తున్నాయ్‌
* ఇండియన్‌ బ్యాంక్‌ రెపో ఆధారిత రుణరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి, 8.20శాతానికి చేర్చింది. ఈనెల 6 నుంచి ఇది అమల్లోకి రానుంది.
* ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌టెర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును ఈనెల 5 నుంచి 9.10 శాతానికి పెంచినట్లు తెలిపింది.
* పీఎన్‌బీ తమ రెపో రేటు అనుసంధానిత రుణ రేటును 7.40 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త రేట్లు ఆగస్టు 8 నుంచి అమల్లోకి వస్తాయి.

ప్రవాసులూ మన బిల్లులు, ఫీజులు కట్టొచ్చు
భారత్‌లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యుల తరపున వివిధ బిల్లులు, విద్యా రుసుములను భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌) ద్వారా విదేశాల్లో నివశిస్తున్న ప్రవాస భారతీయులు కూడా చెల్లించే సదుపాయాన్ని త్వరలోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అందుబాటులోకి తేనుంది. దీని వల్ల వయోవృద్ధులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 20,000కి పైగా సంస్థలు బీబీపీఎస్‌ ప్లాట్‌ఫామ్‌పై బిల్లులు వసూలు చేసుకుంటున్నాయి. ప్రతినెలా 8 కోట్లకు పైగా లావాదేవీలు దీని ద్వారా జరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గిన నేపథ్యంలో, విదేశీ మారకపు ద్రవ్యాన్ని ఆకర్షించాలన్నదే ఈ నిర్ణయం వెనక ఆర్‌బీఐ ఉద్దేశంగా తెలుస్తోంది.

రూపాయి స్థిరత్వంపై దృష్టి
అమెరికా డాలరు బలపడటం వల్లే రూపాయి మారకపు విలువ క్షీణించినట్లు కన్పిస్తోందని  శక్తికాంత్‌ దాస్‌ చెప్పారు. అంతేకానీ భారత స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల కాదని స్పష్టం చేశారు.  రూపాయి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, విలువ స్థిరత్వంపై దృష్టి పెట్టామని చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌ వద్ద సరిపడా విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయని, అత్యధిక విదేశీ మారకపు నిల్వలున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.

బ్యాంకులు పూర్తిగా ఆర్‌బీఐపై ఆధారపడొద్దు
రుణాల జారీకి అవసరమైన నిధుల కోసం బ్యాంకులు పూర్తిగా ఆర్‌బీఐపైనే ఆధారపడకూడదని దాస్‌ అన్నారు. మరిన్ని డిపాజిట్లను అవి సమీకరించాలని, సొంతంగా నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టాలని చెప్పారు.

తదుపరి పరపతి విధాన సమీక్ష సెప్టెంబరు 28- 30 తేదీల్లో

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts