సంక్షిప్త వార్తలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో టైటన్‌ రూ.790 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.18 కోట్లతో పోలిస్తే ఇది పలు రెట్లు అధికం. పండగల సీజన్‌ రాకతో గిరాకీ పెరగడం కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది.

Updated : 06 Aug 2022 06:35 IST

టైటన్‌ లాభం రూ.790 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో టైటన్‌ రూ.790 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.18 కోట్లతో పోలిస్తే ఇది పలు రెట్లు అధికం. పండగల సీజన్‌ రాకతో గిరాకీ పెరగడం కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,519 కోట్ల నుంచి రూ.9,487 కోట్లకు చేరింది. ఆభరణాల విభాగాల ఆదాయం రూ.3050 కోట్ల నుంచి రూ.8,351 కోట్లకు, వాచీలు, వేరబుల్‌ పరికరాల విభాగ ఆదాయం రూ.293 కోట్ల నుంచి రూ.786 కోట్లకు వృద్ధి చెందింది. కంటి సంరక్షణ విభాగ ఆదాయం రూ.67 కోట్ల నుంచి రూ.183 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.3,480 కోట్ల నుంచి రూ.8,415 కోట్లకు పెరిగాయి.


‘సత్రాల్లో’ గదుల అద్దెపై జీఎస్‌టీ వర్తించదు

దిల్లీ: మతపరమైన, ఛారిటబుల్‌ సంస్థలు నిర్వహించే సత్రాల్లోని గదుల అద్దెపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తించదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ సమీపంలో నిర్మించిన ‘సరాయిస్‌’(సత్రా)ల్లోని గదుల అద్దెపై 12 శాతం జీఎస్‌టీ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆప్‌ ఎంపీ చంద్ర లేఖ అందజేశారు. రోజుకు రూ.1000 లోపు అద్దె ఉండే హోటల్‌ గదులపైనా 12 శాతం జీఎస్‌టీ వర్తింప జేస్తున్నట్లు జూన్‌లో జీఎస్‌టీ మండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జులై 18, 2022 నుంచి అమృత్‌సర్‌లోని మూడు సరాయిస్‌లు జీఎస్‌టీ చెల్లించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే, ఛారిటబుల్‌ లేదా మతపరమైన ట్రస్టులు నిర్వహించే హోటళ్లు/సత్రాల్లోని రూ.1,000 లోపు అద్దె గదులకు జీఎస్‌టీకి మినహాయింపు కొనసాగుతుందని ఆర్థికశాఖ పేర్కొంది.


సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ కొత్త యూనిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ సంస్థ సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. ఇందులో భాగంగా రూ.320 కోట్ల పెట్టుబడితో కొత్తగా స్ప్రే- డ్రైడ్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ యూనిట్‌ను దాదాపు 16,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో తిరుపతి జిల్లా వరదరాజపాలెం మండలంలో స్థాపించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.  
రూ.52.74 కోట్ల లాభం: జూన్‌ త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.509.50 కోట్ల ఆదాయాన్ని, రూ.52.74 కోట్ల నికరలాభాన్ని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ ఆర్జించింది. క్రితం ఆర్ధిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.326.23 కోట్లు, నికరలాభం రూ.43.84 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో షేరుకు రూ.2 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించనున్నారు.


హెచ్‌డీఎఫ్‌సీ రూ.8700 కోట్ల సమీకరణ

అందుబాటు గృహ రుణాల కోసమే

దిల్లీ: అందుబాటు గృహ విభాగంలో రుణాలివ్వడం కోసం హెచ్‌డీఎఫ్‌సీ 1.1 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.8700 కోట్ల) మేర నిధులను సమీకరించింది. భారత్‌ తీసుకున్న అతిపెద్ద సామాజిక రుణం ఇదేనని, అంతర్జాతీయంగానూ ఎక్కువ మొత్తమని, భారత్‌ వెలుపల తీసుకున్న తొలి సామాజిక వాణిజ్య రుణమూ ఇదేనని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. ‘సిండికేటెడ్‌ సోషియల్‌ లోన్‌ ఫెసిలిటీ’ కింద పలువురు పెట్టుబడుదార్ల నుంచి ఈ నిధులను, విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీ) రూపంలో పొందినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ‘భారత్‌లో దిగ్గజ గృహ రుణ కంపెనీగా ముందుండాలన్న సంస్థ దీర్ఘకాలిక లక్ష్యానికి ఇది ప్రోత్సాహమిస్తుంద’ని కంపెనీ తెలిపింది. ఎమ్‌యూఎఫ్‌జీ బ్యాంక్‌ ఈ లావాదేవీకి లీడ్‌ సోషియల్‌ లోన్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుండగా.. సంయుక్త సామాజిక రుణ సమన్వయకర్తలుగా సీటీబీసీ బ్యాంక్‌, మిజుహో బ్యాంక్‌, ఎస్‌బీఐ, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి. ‘నాణ్యమైన మౌలిక వసతులకు అందుబాటు గృహాలు కీలకంగా మారాయి. స్థిరాస్తి పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థకూ వృద్ధి చోదకాలుగా ఇవి పనిచేస్తాయ’ని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు.


తగ్గిన ఎన్‌ఎండీసీ ఆదాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ, ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.4,913 కోట్ల ఆదాయాన్ని, రూ.1,467 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.6,656 కోట్లు, నికరలాభం రూ.3,191 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం, నికరలాభం గణీయంగా తగ్గాయి. ఇనుప ఖనిజం ధరలు తగ్గిపోవడంతో కంపెనీ ఆదాయాలు, లాభాలపై ప్రభావం చూపింది. అదే సమయంలో వ్యయాలు దాదాపు 24 శాతం పెరిగాయి. రాయల్టీలు, లెవీ అధికంగా చెల్లించాల్సి రావటం దీనికి ప్రధాన కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని