SBI: స్వల్పంగా తగ్గిన ఎస్‌బీఐ లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నికర లాభం 6.7 శాతం మేర తగ్గడంతో రూ.6,068 కోట్లకు పరిమితమైంది.

Updated : 07 Aug 2022 03:37 IST

రూ.6,068 కోట్లకు పరిమితం ః ఎమ్‌టీఎమ్‌ నష్టాలే కారణం

పెరిగిన ఆస్తుల నాణ్యత

 2022-23లో 15% రుణ వృద్ధి అంచనా

‘‘జూన్‌ త్రైమాసికంలో వ్యాపారం, లాభదాయకత, ఆస్తుల నాణ్యత విషయాల్లో బ్యాంకు సహేతుక రీతిలోనే రాణించింది. నికర లాభం, ఆపరేటింగ్‌ లాభాలపై మార్క్‌ టు మార్కెట్‌ (ఎమ్‌టీఎమ్‌) నష్టాల ప్రభావం  కనిపించింది. అయినప్పటికీ మా ప్రధాన ఆదాయ విభాగాల్లో మంచి వృద్ధి కొనసాగింది.’’- ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నికర లాభం 6.7 శాతం మేర తగ్గడంతో రూ.6,068 కోట్లకు పరిమితమైంది. మార్క్‌-టు-మార్కెట్‌ (ఎమ్‌టీఎమ్‌) నష్టాల కారణంగా లాభంలో క్షీణత చోటు చేసుకుంది. కిందటేడాది ఇదే మూడు నెలల కాలంలో లాభం రూ.6,504 కోట్లుగా నమోదైంది. ఏకీకృత ఖాతాల ప్రకారం.. నికర లాభం కాస్త తగ్గి రూ.7,379.91 కోట్ల నుంచి రూ.7,325.11 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ.77,347.17 కోట్ల నుంచి రూ.74,998.57 కోట్లకు తగ్గింది.

‘ఎమ్‌టీఎమ్‌ నష్టాలను పూడ్చుకుంటాం’
బ్యాంకు పెట్టుబడుల పుస్తకంలో ఎమ్‌టీఎమ్‌ నష్టాలు రూ.6,549 కోట్లకు చేరుకోవడంతో ఆస్తులపై ప్రతిఫలాలు (ఆర్‌ఓఏ), ఈక్విటీపై ప్రతిఫలాల (ఆర్‌ఓఈ)పై తీవ్ర ప్రభావం కనిపించింది. ఇవి వరుసగా 9 బేసిస్‌ పాయింట్లు; 203 బేసిస్‌ పాయింట్ల చొప్పున తగ్గాయి. ఏదైనా కంపెనీ ఆర్థిక ఆస్తులు కొనుగోలు చేసిన ధర కంటే ప్రస్తుత మార్కెట్‌ విలువ తక్కువగా ఉంటే ఎమ్‌టీఎమ్‌ నష్టాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఎమ్‌టీఎమ్‌ నష్టాలను పూడ్చుకోగలమని బ్యాంకు ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా పేర్కొన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వ సెక్యూరిటీలకు 7.3 శాతం మేర (శుక్రవారం నాటి ముగింపు) ప్రతిఫలాలు లభిస్తే ఎమ్‌టీఎమ్‌ కేటాయింపుల్లో రూ.1,900 కోట్లను తిరిగి రాబట్టుకోవచ్చ’ని ఆయన అంచనా వేశారు.

పెరిగిన నికర వడ్డీ ఆదాయం
నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 12.87 శాతం వృద్ధితో రూ.27,638 కోట్ల నుంచి రూ.31,196 కోట్లకు పెరిగాయి. దేశీయ నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎమ్‌) 8 బేసిస్‌ పాయింట్ల మెరుగుపడి 3.15 శాతం నుంచి 3.23 శాతానికి చేరాయి. మరోవైపు, ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) కిందటేడాది జూన్‌ త్రైమాసికంలో 5.32 శాతంగా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌లో 3.91 శాతానికే పరిమితమయ్యాయి. ఇక నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) సైతం 1.77 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. ఆస్తుల నాణ్యత విషయంలో భవిష్యత్‌లో బ్యాంకుకు ఎటువంటి సవాళ్లు కనిపించడం లేదని ఖరా అన్నారు. రుణ నష్ట కేటాయింపులు సైతం రూ.5,030 కోట్ల నుంచి రూ.4,268 కోట్లకు పరిమితమయ్యాయి.

సరిపడా మూలధనం ఉంది..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వృద్ధికి సరిపడా మూలధనం ఉందని ఖరా స్పష్టం చేశారు. అడ్వాన్సులు 14.93 శాతం; డిపాజిట్లు 8.73 శాతం మేర పెరిగాయి. ‘ఈ ఏడాదిలో రుణ వృద్ధి 15 శాతంగా నమోదవవచ్చు. నిధుల సమీకరణ కోసం స్టాక్‌ మార్కెట్‌ కంటే మా వైపు చాలా వరకు కంపెనీలు చూస్తాయని మేం అంచనా వేస్తున్నామ’ని అన్నారు. యెస్‌ బ్యాంకులో వాటాపై మాట్లాడుతూ ‘మార్చి 2023 వరకు 26 శాతం వాటాను కొనసాగించాల్సి ఉంది. ఇప్పటిదాకా బోర్డు స్థాయిలో ఈ విషయంపై చర్చ జరగలేద’ని ఖరా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని