HPCL: హెచ్‌పీసీఎల్‌ నష్టం రూ.10,197 కోట్లు

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఎన్నడూ లేని రీతిలో రూ.10,196.94 కోట్ల అత్యధిక త్రైమాసిక నష్టాన్ని చవి చూసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.1,795 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Updated : 07 Aug 2022 06:53 IST

దిల్లీ: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఎన్నడూ లేని రీతిలో రూ.10,196.94 కోట్ల అత్యధిక త్రైమాసిక నష్టాన్ని చవి చూసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.1,795 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెరుగుతున్న ముడి చమురుకు అనుగుణంగా సవరించలేదు. ద్రవ్యోల్బణం అధికమవుతుండటంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరింత పెంచితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వానికి మద్దతుగా ఆయా సంస్థలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. ముడి చమురు బ్యారెల్‌కు సరాసరిన 109 డాలర్ల వ్యయంతో దిగుమతి చేసుకోగా, పంపుల వద్ద 85-86 డాలర్లకే అందించడంతో భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఐఓసీ కూడా రూ.1992.53 కోట్ల త్రైమాసిక నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
* జూన్‌ త్రైమాసికంలో హెచ్‌పీసీఎల్‌ ఆదాయం రూ.1.21 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ.77,308.53 కోట్లుగా నమోదైంది.
* హెచ్‌పీసీఎల్‌ ప్రతి బ్యారెల్‌ ముడి చమురును శుద్ధి చేసినందుకు 16.69 డాలర్ల రిఫైనింగ్‌ మార్జిన్‌ అందుకుంది. 2020-21లో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎం) 3.31 డాలర్లుగా ఉంది. విదేశీ మారకపు రేటు ఒడుదొడుకుల వల్ల హెచ్‌పీసీఎల్‌ రూ.945.40 కోట్ల నికర నష్టాన్ని చవి చూసింది.
* సమీక్షా త్రైమాసికంలో హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ/మార్కెటింగ్‌ మౌలిక వసతుల నవీకరణ కోసం రూ.2,809 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వైజాగ్‌ రిఫైనరీని 8.3 మిలియన్‌ టన్నుల నుంచి   15  మి.టన్నుల సామర్థ్యానికి చేరుస్తోంది.
* 52 పెట్రోల్‌ పంపుల వద్ద సీఎన్‌జీ రీఫ్యూయలింగ్‌ సదుపాయాల్ని కొత్తగా తీసుకొచ్చింది. దీంతో సీఎన్‌జీ సదుపాయం ఉన్న రిటైల్‌ అవుట్‌లెట్ల సంఖ్య 1,139కి చేరింది. 34 పెట్రోల్‌ పంపుల వద్ద విద్యుత్‌ వాహన (ఈవీ) ఛార్జింగ్‌ సదుపాయాల్ని కల్పించడం ద్వారా వీటి సంఖ్యను 1,045కు చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని