Amara raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌కు పెరిగిన ఆదాయాలు

అమరరాజా బ్యాటరీస్‌ ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి రూ.2,620 కోట్ల ఆదాయాన్ని, రూ.176.96 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది.  త్రైమాసిక    ఈపీఎస్‌  రూ.7.70 నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.1,885.86 కోట్లు, పన్నుకు ముందు లాభం  రూ.167.04 కోట్లు ఉన్నాయి.

Updated : 07 Aug 2022 03:40 IST

మొదటి త్రైమాసికంలో 39 శాతం వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: అమరరాజా బ్యాటరీస్‌ ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి రూ.2,620 కోట్ల ఆదాయాన్ని, రూ.176.96 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది.  త్రైమాసిక    ఈపీఎస్‌  రూ.7.70 నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.1,885.86 కోట్లు, పన్నుకు ముందు లాభం  రూ.167.04 కోట్లు ఉన్నాయి. నికరలాభం రూ.123.94 కోట్ల నుంచి రూ.131.45 కోట్లకు పెరిగింది.
క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత మొదటి త్రైమాసికంలో ఆదాయంలో 39 శాతం వృద్ధి కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల బ్యాటరీలకు అటు రిప్లేస్‌మెంట్‌ మార్కెట్లో, ఇటు ఓఈఎం విభాగంలో అధిక గిరాకీ నమోదైనట్లు అమరరాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. అదేవిధంగా ఇండస్ట్రియల్‌ బ్యాటరీల విభాగంలోనూ ఆకర్షణీయమైన వృద్ధి ఉన్నట్లు, ముఖ్యంగా యూపీఎస్‌, టెలికాం విభాగాలు అధిక అమ్మకాలు సాధించినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తాము మెరుగైన వ్యాపారాన్ని, ఆదాయాలను సాధించినట్లు అమరరాజా బ్యాటరీస్‌ సీఎండీ జయదేవ్‌ గల్లా వివరించారు. ఇంధనం, మొబిలిటీ విభాగాల్లో ఇంకా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్తు ఖర్చులు, ఇతర వ్యయాలు పెరిగినందున లాభాలపై ఒత్తిడి కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో వ్యయాలు తగ్గించుకొని లాభాలు పెంచుకోవటానికి కృషి చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆటోమోటివ్‌, ఇండస్ట్రియల్‌ బ్యాటరీస్‌) హర్షవర్ధన గౌరినేని వివరించారు.  నూతన ఇంధన వ్యాపార విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విక్రమాదిత్య గౌరినేని స్పందిస్తూ, బ్యాటరీ ప్యాక్‌, ఛార్జర్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు వెల్లడించారు. ‘లిథియమ్‌ సెల్‌ టెక్నాలజీ’కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు.
అమరరాజా బ్యాటరీస్‌, అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ సంస్థలైన అశోక్‌ లేల్యాండ్‌, హోండా, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ తదితర సంస్థలతో ఓఈఎం ఒప్పందాలు కుదుర్చుకొని బ్యాటరీలు సరఫరా చేస్తోంది. ఇంకా టెలికాం సంస్థలు, భారతీయ రైల్వే, విద్యుత్తు, చమురు- సహజవాయువు సంస్థలు అమరరాజా బ్యాటరీస్‌ వినియోగదార్లుగా ఉన్నాయి.


హెచ్‌బీఎల్‌ పవర్‌ ఆదాయం రూ.318 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాటరీల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.317.94 కోట్ల ఆదాయాన్ని, రూ.19.18 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.225.21 కోట్లు, నికరలాభం రూ.17.14 కోట్లు ఉన్నాయి. ఆదాయం ఆకర్షణీయంగా పెరిగినప్పటికీ, అధిక వ్యయాల కారణంగా అంతేస్థాయిలో లాభాలు పెరగలేదు. ముడిపదార్థాల వ్యయం రూ.143 కోట్ల నుంచి రూ.177 కోట్లకు పెరిగింది. వ్యాపార విభాగాల వారీగా చూస్తే, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో ఆదాయాలు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని