StockMarket: భారీ నష్టాలుండవు కానీ..

రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనాలకు మించి పెంచిన నేపథ్యంలో, ఇక మదుపర్ల దృష్టి అంతా దేశీయ, అమెరికా ఆర్థిక గణాంకాలపై ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Updated : 08 Aug 2022 04:14 IST

స్థిరీకరణకు అవకాశం
17150 పైన నిఫ్టీకి సానుకూలతలు
వాహన షేర్లు రాణించొచ్చు
విశ్లేషకుల అంచనాలు
రేపు మొహర్రం సెలవు కనుక 4 రోజులే ట్రేడింగ్‌


స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనాలకు మించి పెంచిన నేపథ్యంలో, ఇక మదుపర్ల దృష్టి అంతా దేశీయ, అమెరికా ఆర్థిక గణాంకాలపై ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ-50 స్థిరీకరణ కావచ్చని, అయితే భారీ దిద్దుబాటు జరగక పోవచ్చంటున్నారు. అమెరికా ఉద్యోగ గణాంకాల నుంచి ఫెడరల్‌ రిజర్వ్‌, అమెరికా మార్కెట్లు ఎటువంటి సంకేతాలు తీసుకుంటాయన్నది కీలకం. బుధవారం వెలువడే అమెరికా రిటైల్‌ ద్రవ్యోల్బణంపైనా దృష్టి పెట్టొచ్చు. దేశీయంగా చూస్తే జులై నెలకు సంబంధించి సియామ్‌ విడుదల చేసే వాహన గణాంకాలు, శుక్రవారం వెలువడే రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలను పరిశీలించొచ్చు. ఈ వారం విడుదలయ్యే అదానీ పోర్ట్స్‌, ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ ఫలితాలూ మార్కెట్‌ను ప్రభావితం చేయొచ్చు. నిఫ్టీ 17,150 పాయింట్లకు పైన చలించినంత వరకు సానుకూలతలే కనిపిస్తాయని అభిప్రాయపడుతున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* సిమెంటు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చు. విక్రయాల వృద్ధి ధోరణిని గమనించాలి.
* చైనా ఉక్కు అవసరాలు మన లోహ కంపెనీలకూ కీలకమే. అక్కడి స్థిరాస్తి రంగం పుంజుకుంటే దేశీయ ఉక్కు తయారీదార్ల అమ్మకాలు పెరగొచ్చు. ఐరోపా ఉక్కు గిరాకీనీ గమనించాలి.
* ఆయిల్‌ ఇండియా(బుధ), ఓఎన్‌జీసీ(శుక్ర) ఫలితాలు చమురు షేర్లపై ప్రభావం చూపుతాయి.  
* మదుపర్ల వేచి చూసే ధోరణితో ఔషధ షేర్లలో ట్రేడింగ్‌ స్తబ్దుగా జరగొచ్చు. ఈ వారం విడుదలయ్యే అరబిందో, అబాట్‌, దివీస్‌, జైడస్‌, నాట్కో, ఇప్కా, గ్లెన్‌మార్క్‌ ఫలితాలు, గిరాకీ, నూతన ఉత్పత్తులనూ గమనించొచ్చు.
* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో అధిక కొనుగోళ్లు జరగడం వల్ల.. తాజా పొజిషన్లు జతచేసుకోకపోవచ్చు. అయితే తక్షణం విక్రయాల ఒత్తిడి ఎదురుకాకపోవచ్చు.
* బ్యాంకు షేర్లపై ఎస్‌బీఐ ఫలితాల ప్రభావం ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు, తగ్గుతున్న చమురు ధరలు, అధిక ద్రవ్యోల్బణం వల్ల బ్యాంకు షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత, రుణ వృద్ధి మెరుగుపడుతుండడం కలిసొచ్చే అంశం.
* నేడు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించే ఫలితాలను బట్టి టెలికాం షేర్లు కదలాడొచ్చు. త్రైమాసికం వారీగా కంపెనీ ఆదాయం, లాభం వరుసగా 3.7%, 21.7% మేర వృద్ధి చెందొచ్చన్న అంచనాలున్నాయి.
* అమెరికా ద్రవ్యోల్బణం, ఉద్యోగ గణాంకాల ఆధారంగా ఐటీ షేర్లు ట్రేడవవచ్చు.  
* కమిన్స్‌ ఇండియా, ఏబీబీ, ఏఐఏ ఇంజినీరింగ్‌ సంస్థల ఫలితాల ఆధారంగా యంత్ర పరికరాల షేర్లు కదలాడొచ్చు. అంచనాల కంటే బలహీనంగా నమోదైన థెర్మాక్స్‌ ఫలితాలు; మాంద్యం భయాలు ప్రభావం చూపుతాయి. మధ్య నుంచి దీర్ఘకాలానికి ఈ రంగ వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయి.
* పండుగల సీజనులో గిరాకీ బాగుంటుందనే అంచనాలతో వాహన కంపెనీల షేర్లు రాణించొచ్చు. హీరో మోటోకార్ప్‌, ఐషర్‌ మోటార్స్‌ ఫలితాలను గమనించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని