సంక్షిప్త వార్తలు

వచ్చే రెండేళ్లలో దేశీయ విమానయాన రంగంలో ప్రత్యక్షంగా మరో లక్ష ఉద్యోగాలు రావొచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పైలట్లు, కేబిన్‌ సిబ్బంది, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, విమానాశ్రయ సిబ్బంది, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, కార్గో, రిటైల్‌, భద్రత, పాలన, విక్రయ సిబ్బంది.. ఇలా అందరూ కలిసి ఈ

Published : 09 Aug 2022 02:24 IST

విమానయాన రంగంలో లక్ష ఉద్యోగాలు

వచ్చే రెండేళ్లపై కేంద్రం అంచనా

దిల్లీ: వచ్చే రెండేళ్లలో దేశీయ విమానయాన రంగంలో ప్రత్యక్షంగా మరో లక్ష ఉద్యోగాలు రావొచ్చని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పైలట్లు, కేబిన్‌ సిబ్బంది, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, విమానాశ్రయ సిబ్బంది, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, కార్గో, రిటైల్‌, భద్రత, పాలన, విక్రయ సిబ్బంది.. ఇలా అందరూ కలిసి ఈ రంగంలో 2,50,000 మంది పనిచేస్తున్నారని ఆ శాఖ తెలిపింది. ‘ప్రస్తుతం విమానయాన, ఏరోనాటికల్‌ తయారీ రంగాల్లో 2,50,000 మంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 2024 కల్లా 3,50,00కు పెరగవచ్చ’ని ఆ శాఖ తెలిపింది. ఈ రంగంలో పరోక్ష, ప్రత్యక్ష ఉద్యోగాల నిష్పత్తి 4:8గా ఉందని పేర్కొంది. ‘పెరగబోయే ప్రయాణికుల రద్దీ, భారత విమానాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుందే వచ్చే అయిదేళ్లలో మరో 10,000 మంది పైలట్లు అవసరమవుతార’ని అంచనా వేసింది.  2027 కల్లా విమాన ప్రయాణికుల సంఖ్య 40 కోట్లకు చేరొచ్చని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అంచనా వేశారు.


వడ్డీ రేటు పెంచిన ఐఓబీ

ముంబయి: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రుణ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ ఇటీవల రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచడంతో, దానికి అనుబంధంగా ఉన్న రెపో ఆధారిత వడ్డీ రేటు ( ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను ప్రస్తుత 7.75% నుంచి 8.25 శాతానికి పెంచినట్లు ఐఓబీ తెలిపింది. దీంతోపాటు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (ఎంసీఎల్‌ఆర్‌)ను 10-15 బేసిస్‌ పాయింట్ల మేరకు పెôచుతున్నట్లు వెల్లడించింది. కొత్త రేట్లు 6.95 శాతం నుంచి 7.70 శాతం మధ్యలో ఉండనున్నాయి. ఈ పెంపు ఈనెల 10 నుంచి అమల్లోకి రానుంది. ప్రామాణిక ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 200 బేసిస్‌ పాయింట్లు తగ్గించి, 13.50శాతానికి చేర్చినట్లు పేర్కొంది.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ను 5-10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. దీంతో వివిధ కాల వ్యవధి రుణాలపై వడ్డీ రేట్లు 7.80ø ‹తం నుంచి 8.30 శాతం మధ్యలో ఉంటాయని పేర్కొంది. జులైలోనూ ఈ బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను 20 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఏడాది కాల వ్యవధి రుణాలపై 8.10 శాతం వడ్డీ విధిస్తుండగా, మూడేళ్ల వ్యవధి రుణాలపై ఇక నుంచి 8.30శాతం వడ్డీ వర్తిస్తుంది.

* హెచ్‌డీఎఫ్‌సీ తమ ప్రామాణిక రుణ రేటును 25 బేసిస్‌ పాయింట్లు (0.25%) పెంచుతున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈనెల 9 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రస్తుత రుణ గ్రహీతలతో పాటు కొత్తగా రుణాలు తీసుకునే వారికి నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు భారం కానున్నాయి. ఆగస్టు 1న కూడా 0.25% రుణ రేటును హెచ్‌డీఎఫ్‌సీ పెంచిన సంగతి తెలిసిందే. గత 3 నెలల్లో మొత్తం 6 దఫాలుగా హెచ్‌డీఎఫ్‌సీ 140 బేసిస్‌ పాయింట్ల (1.4%) మేర రుణ రేట్లు పెంచింది.  


అందుబాటు ధర ఇళ్లకు

రూ.12 లక్షల వరకు రుణం: పీఎన్‌బీ

దిల్లీ: అందుబాటు ధర గృహాలకు ‘ఉన్నతి’ పేరిట ఇస్తున్న రుణాల కనీస పరిధిని తగ్గిస్తున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వెల్లడించింది. ఇప్పటివరకు ఈ మొత్తం రూ.18-19 లక్షలుగా ఉండగా.. ఇకపై రూ.9- 12లక్షల రుణాలనూ ఈ పథకం కింద ఇస్తామని బ్యాంకు ఎండీ, సీఈఓ హర్దయాల్‌ ప్రసాద్‌ తెలిపారు. కొన్ని గృహరుణ సంస్థలు, తక్కువ ఆదాయం ఉన్న వారికి కనీస గృహరుణాన్ని అందిస్తున్నాయి. తాము కూడా ఈ విభాగంలో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నట్లు ప్రసాద్‌ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దాదాపు 10-12 రాష్ట్రాల్లో ఈ రుణాలను ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.


నెలలోపే 5జీ సేవలు

టెలికాం సహాయ మంత్రి

దిల్లీ: దేశంలో 5జీ సేవలు నెల రోజుల్లోగా అందుబాటులోకి రావొచ్చని కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ అంచనా వేశారు. సోమవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘నెలరోజుల్లో దేశంలో 5జీ మొబైల్‌ సేవలు ప్రారంభమవుతాయి. అన్ని రంగాల్లోనూ బహుముఖాభివృద్ధికి ఇవి ఊతమిస్తాయి. దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసిన 5జీ టెలికాం గేర్లను ఈ ఏడాది చివర్లోగా 5జీ సేవల కోసం వినియోగించనున్నాం. దేశీయంగా 6జీ పరికరాల అభివృద్ధిపై పనిచేసేందుకు ‘6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌ గ్రూప్‌’ను ఏర్పాటు చేసిన’ట్లు మంత్రి తెలిపారు.  ఆగస్టు 1న ముగిసిన 5జీ టెలికాం వేలానికి రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలైన సంగతి విదితమే.


పోకర్ణకు రూ.240 కోట్ల ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రానైట్‌ ప్రాసెసింగ్‌, క్వార్ట్జ్‌ స్టోన్‌ ఉత్పత్తి చేసే సంస్థ పోకర్ణ లిమిటెడ్‌ జూన్‌ త్రైమాసికానికి రూ.240.38 కోట్ల ఏకీకృత ఆదాయంపై  రూ.28.49 కోట్ల నికరలాభం, రూ.9.15 ఈపీఎస్‌ నమోదు చేసింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.106.08 కోట్లు, నికరలాభం రూ.4.04 కోట్లు, ఈపీఎస్‌ రూ.1.30 మాత్రమే. ఏడాది క్రితంతో పోలిస్తే ఆదాయం 126 శాతం పెరిగింది. క్వార్ట్జ్‌ స్టోన్‌ విభాగంలో ఆదాయం దాదాపు 3 రెట్లు పెరగడం వల్లే ఆకర్షణీయ లాభాలు నమోదు చేసింది.  


ఈటీఎఫ్‌లలో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు రూ.1.59 లక్షల కోట్లు

దిల్లీ: 2022 మార్చి ఆఖరుకు ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లలోకి (ఈటీఎఫ్‌లు) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రూ.1,59,299.46 కోట్ల పెట్టుబడులు చొప్పించిందని కేంద్ర కార్మిక మంత్రి రామేశ్వర్‌ తేలి సోమవారం పార్లమెంట్‌కు తెలియజేశారు. ప్రస్తుతం వీటి విలువ రూ.2,26,919.18 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. 2015 ఆగస్టు నుంచి ఈపీఎఫ్‌ఓ, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి కొంత భాగాన్ని ఈటీఎఫ్‌లలో పెట్టుబడులుగా పెడుతోంది. తొలుత 5 శాతంతో మొదలుపెట్టి తర్వాత 2016-17లో 10 శాతం, 2017-18 నుంచి 15 శాతం నిధుల్ని ఈటీఎఫ్‌లకు తరలిస్తోంది. మిగతా 85 శాతం నిధుల్ని రుణ సాధనాల్లో పెట్టుబడిగా పెడుతోంది.

* భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) వ్యూహాత్మక విక్రయ ప్రక్రియను పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ లోక్‌సభలో వెల్లడించారు. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాను పూర్తిగా విక్రయించాలని 2020 మార్చిలో బిడ్‌లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది నవంబరుకు 3 బిడ్‌లు వచ్చినా తర్వాత కొన్ని సమస్యలతో ఇద్దరు బిడ్డర్లు వైదొలగడంతో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా మళ్లీ వ్యూహాత్మక విక్రయ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

* విద్యుత్‌, రహదారులు, రైల్వేల వంటి మౌలిక వసతుల ఆస్తులకు విలువ జోడించేందుకు వీలుగా, వాటిని నగదీకరించి రూ.6 లక్షల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గతేడాది జాతీయ నగదీకరణ కార్యక్రమాన్ని (ఎన్‌ఎంపీ) ప్రకటించింది. 2025 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1.62 లక్షల కోట్ల ఆస్తుల్ని నగదీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు.

* 2022 జూన్‌ ఆఖరుకు కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ కింద 1,999 కేసులు నడుస్తున్నాయని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలియజేశారు.


జీఎస్‌టీ విధానానికి క్రెడిట్‌ బదిలీ 

క్లెయిమ్‌ల పరిశీలనను పూర్తి చేయండి

సీబీఐసీకి కాగ్‌ సూచన

దిల్లీ: జీఎస్‌టీ విధానానికి క్రెడిట్‌ బదిలీ క్లెయిమ్‌లపై పరిశీలనను పూర్తి చేయాల్సిందిగా పరోక్ష పన్నుల విభాగానికి కంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సిఫారసు చేసింది. 2017 జులై 1 నుంచి జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందున్న పన్నుల విధానాల కింద పన్ను చెల్లింపుదార్లు చివరి సారి దాఖలు చేసిన రిటర్న్‌లలో ప్రకటించిన క్రెడిట్‌ను జీఎస్‌టీ విధానానికి బదిలీ చేసుకునే నిమిత్తం ట్రాన్‌-1 ఫారాన్ని దాఖలు చేసుకునేందుకు అనుమమతినిచ్చారు. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీపై ఆడిట్‌ నివేదికను సోమవారం పార్లమెంటుకు కాగ్‌ సమర్పించింది. జీఎస్‌టీ విధానానికి క్రెడిట్‌ బదిలీ క్లెయిమ్‌లలో కొన్ని అవకతవకలు ఉన్నట్లు ఆడిట్‌లో వెల్లడైందని కాగ్‌ తెలిపింది. అయితే అత్యధికంగా క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకున్న మొదటి 50,000 కేసులను పరిశీలించేందుకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) గుర్తించిందని, అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొంది. ఇంకా పరిశీలించాల్సినవి 8,849 కేసుల వరకు ఉన్నాయని కాగ్‌ చెప్పింది. గుర్తించిన అవకతవకల నుంచి రికవరీ కూడా నెమ్మదిగా ఉందని పేర్కొంది. జ్యూరిడిక్షన్‌ (పన్ను అధికార) పరిధి సమస్య, ఒక జోన్‌లో కేంద్ర పన్నుల అధికారుల నుంచి సహకారం లేకవపోడం లాంటివి పరిశీలన, రికవరీ ప్రక్రియ నెమ్మదిగా సాగేందుకు కారణమని తెలిపింది.


43 శాతం తగ్గిన ఈక్విటీ ఫండ్ల పెట్టుబడులు: యాంఫీ

దిల్లీ: స్టాక్‌ మార్కెట్లో అనిశ్చితి నేపథ్యంలో జులైలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి వచ్చిన నికర పెట్టుబడుల్లో 43 శాతం క్షీణత కనిపించింది. జూన్‌లో ఈక్విటీ ఫండ్లలోకి నికరంగా రూ.15,495 కోట్లు, మేలో రూ. 15,890 కోట్లు, ఏప్రిల్‌లో రూ.15,890 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జులైలో రూ.8,898 కోట్ల నిధులే వచ్చాయని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) సోమవారం వెల్లడించింది. గత ఏడాది మార్చి నుంచి ఈక్విటీ ఫండ్లలోకి నికర పెట్టుబడులు సానుకూలంగానే వస్తున్నాయి. గత నెలలో స్మాల్‌ క్యాప్‌ పండ్లలోకి రూ.1,780 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్‌లోకి రూ.1,381 కోట్ల నికర నిధులు వచ్చాయి. మిగతావి లార్జ్‌ క్యాప్‌, లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్లలోకి పెట్టుబడులు వచ్చాయి. డెట్‌ ఫండ్లలోకి నికరంగా రూ.4,930 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో ఈ విభాగం నుంచి రూ.92,247 కోట్లు బయటకు వెళ్లాయి. గత నెలలో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల నుంచి నికరంగా రూ.457 కోట్లు ఉపసంహరించుకున్నారు. మొత్తంగా చూస్తే మ్యూచువల్‌ ఫండ్లలోకి రూ.23,605 కోట్ల పెట్టుబడుల వచ్చినట్లు యాంఫీ వెల్లడిచింది. జులై నాటికి మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలో రూ.37.75 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపింది.

*  2020 జులై -2021 ఫిబ్రవరి మధ్య ఉపసంహరణలే అధికంగా కనిపించాయి. ఈ వ్యవధిలో దాదాపు రూ.46,791 కోట్లు మార్కెట్‌ నుంచి బయటకు వెళ్లాయి.


7 లక్షల చ.అ.లలో స్మార్ట్‌వర్క్స్‌ కో వర్కింగ్‌ కేంద్రం

దిల్లీ: కో-వర్కింగ్‌ కార్యాలయాలను నిర్వహించే స్మార్ట్‌వర్క్స్‌, బెంగళూరులో దాదాపు 7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని వైష్ణవి టెక్‌ పార్క్‌ నుంచి అద్దెకు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకూ దేశంలో ఆఫీసు కార్యాలయాల అద్దె పరంగా ఇది అతిపెద్ద లావాదేవీ అని స్మార్ట్‌వర్క్స్‌ పేర్కొంది. ఈ సంస్థ హైదరాబాద్‌ సహా దేశంలోని 11 నగరాల్లో 38 చోట్ల కో-వర్కింగ్‌ కార్యాలయాలను నిర్వహిస్తోంది. 70 లక్షలకు పైగా చ.అ.ల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఆఫీసు స్థలానికి గిరాకీ సాధారణ స్థితికి చేరుకుందని, పెద్ద కార్పొరేట్‌ సంస్థలూ కార్యాలయాల స్థలం కోసం అడుగుతున్నాయని స్మార్ట్‌వర్క్స్‌ వ్యవస్థాపకులు నీతిశ్‌ సర్దా తెలిపారు. కొత్త కేంద్రంలో 9,000 పైగా సీట్లు ఉంటాయని, ఇందులో ఇప్పటికే సగానికి పైగా బుక్‌ అయినట్లు వెల్లడించారు.


సాఫ్ట్‌ బ్యాంక్‌ త్రైమాసిక నష్టం

రూ.1.84 లక్షల కోట్లు  

టోక్యో: జపాన్‌ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో 23.4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.84 లక్షల కోట్లు) నష్టాన్ని చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం,  వడ్డీ రేట్లు పెరిగినందున ఏర్పడిన పరిణామాలతో సంస్థ పెట్టుబడుల విలువ గణనీయంగా తగ్గడం ఇందుకు కారణం. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ 762 బిలియన్‌ యెన్‌ల లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక విక్రయాలు 6 శాతం పెరిగి 1.57 లక్షల కోట్ల యెన్‌ల (11.6 బి.డాలర్లు)కు చేరాయి. జూన్‌ త్రైమాసిక ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయని, కంపెనీ ప్రారంభించిన తర్వాత అత్యధిక త్రైమాసిక నష్టం ఇదేనని సాఫ్ట్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మసయోషి సన్‌ పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో నష్టాలు దాదాపు 5 లక్షల కోట్ల యెన్‌లు (37 బి.డాలర్ల)కు చేరాయన్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌ బ్యాంక్‌ నష్టం 1.7 లక్షల కోట్ల యెన్‌లు (13 బి.డాలర్లు)గా నమోదయ్యాయి. వార్షిక విక్రయాలు 10.5 శాతం వృద్ధితో 6.2 లక్షల కోట్ల యెన్‌ (46 బి.డాలర్ల)కు చేరాయి. కంపెనీ పెట్టుబడులు అధికంగా ఉన్న చైనా ఇ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా షేరు క్షీణత, సాఫ్ట్‌ బ్యాంక్‌ నష్టాలకు ప్రధాన కారణంగా మారింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని