Airtel: ఎయిర్‌టెల్‌ లాభంలో 467% వృద్ధి

భారతీ ఎయిర్‌టెల్‌ అదరగొట్టింది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి రూ.1,607 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.283.50 కోట్లతో పోలిస్తే ఈసారి ఐదు రెట్లు (467%) పెరగడం గమనార్హం. చందాదార్ల సంఖ్యతో పాటు ఒక్కో వినియోగదారుపై సగటు ఆర్జన (ఆర్పు)

Updated : 09 Aug 2022 03:21 IST

ఏప్రిల్‌- జూన్‌లో రూ.1,607 కోట్లు

చందాదార్ల సంఖ్య, సగటు ఆదాయం పెరగడం వల్లే

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ అదరగొట్టింది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి రూ.1,607 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.283.50 కోట్లతో పోలిస్తే ఈసారి ఐదు రెట్లు (467%) పెరగడం గమనార్హం. చందాదార్ల సంఖ్యతో పాటు ఒక్కో వినియోగదారుపై సగటు ఆర్జన (ఆర్పు) పెరగడం ఇందుకు తోడ్పడింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.26,854 కోట్ల నుంచి 22 శాతం అధికమై రూ.32,805 కోట్లకు చేరింది. అయితే జనవరి- మార్చితో పోలిస్తే నికర లాభం 20 శాతం తగ్గితే, ఆదాయం 4 శాతమే పెరిగింది. ‘మరో బలమైన త్రైమాసికాన్ని నమోదుచేశాం. ఈ తరహా ప్రదర్శనను మున్ముందూ కొనసాగిస్తామని, త్రైమాసిక ప్రాతిపదికన 4.5 శాతం వృద్ధి నమోదు చేయాలన్నది లక్ష్యమ’ని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు.  

* ఏడాది వ్యవధిలో దేశీయ చందాదార్ల సంఖ్య 41.9 శాతం పెరిగి 36.2 కోట్లకు చేరింది. ఆర్పు రూ.146 నుంచి రూ.183కు పెరిగింది. వినియోగదారుల మొబైల్‌ డేటా వినియోగం 17.7 శాతం పెరిగి నెలకు సగటున 19.5 జీబీకి చేరింది. వాయిస్‌ కాల్స్‌ నెలకు 1,104 నిమిషాలకు చేరాయి.

* 4జీ చందాదార్ల సంఖ్య ఏడాది క్రితంతో పోలిస్తే 2.08 కోట్లు, త్రైమాసిక ప్రాతిపదికన 45 లక్షల చొప్పున పెరిగారు. నిర్వహణ మార్జిన్‌ 19.6 శాతం నుంచి 23.6 శాతానికి పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే 23.7 శాతం నుంచి తగ్గింది.

* భారత్‌లో వ్యాపార ఆదాయం 23.8 శాతం వృద్ధితో రూ.23,319 కోట్లుగా నమోదైంది. మొబైల్‌ సేవల ఆదాయం రూ.14,305.60 కోట్ల నుంచి 27 శాతం పెరిగి రూ.18,220 కోట్లకు చేరింది.

* ఆఫ్రికా వ్యాపారాదాయం స్థిర కరెన్సీ రూపేణా 15.3 శాతం పెరగ్గా చందాదార్ల సంఖ్య 13.16 కోట్లుగా ఉంది.

* ఎయిర్‌టెల్‌ హోమ్‌ వ్యాపార విభాగ ఆదాయంలో 41.9 శాతం పెరిగింది. చందాదార్ల సంఖ్య 14 లక్షలు పెరిగి 47.90 లక్షలకు చేరింది. డిజిటల్‌ టీవీ వినియోగదార్ల సంఖ్య 1.74 కోట్లుగా ఉంది.  

* ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లావాదేవీలు 65 శాతం పెరిగాయి.

* సమీక్షా త్రైమాసికంలో మూలధన వ్యయం కింద రూ.6,398 కోట్లు వెచ్చించింది. ఇందులో భారత్‌లోని వ్యాపారాల కోసం రూ.5,288 కోట్లు, ఆఫ్రికాలో కార్యకలాపాలకు రూ.1,088 కోట్లు ఖర్చు పెట్టింది.

* ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో 19,867.80 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ కోసం రూ.43,040 కోట్ల విలువైన బిడ్‌లను ఎయిర్‌టెల్‌ దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని