Amit shah: ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్‌పై 300కి పైగా సహకార సంఘాలు

ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) ప్లాట్‌ఫామ్‌పై 300కి పైగా సహకార సంఘాలు కొనుగోలుదార్లుగా నమోదయ్యాయని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఇందులో అమూల్‌, ఇఫ్కో లాంటివి ఉన్నాయని పేర్కొన్నారు.

Updated : 10 Aug 2022 02:40 IST

విక్రయదార్లుగానూ నమోదవ్వండి
కేంద్ర మంత్రి అమిత్‌ షా సూచన

దిల్లీ: ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) ప్లాట్‌ఫామ్‌పై 300కి పైగా సహకార సంఘాలు కొనుగోలుదార్లుగా నమోదయ్యాయని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఇందులో అమూల్‌, ఇఫ్కో లాంటివి ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఈ సంస్థలన్నీ సరఫరాదార్లుగా కూడా నమోదుకావాలని ఆయన సూచించారు. జీఈఎం పోర్టల్‌లో నమోదు ప్రక్రియను దృశ్యమాధ్యమ పద్ధతిలో మంగళవారం మంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. సహకార సంఘాలు కూడా తమకు కావాలిస వస్తువులు, సేవలను జీఈఎం ప్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేసేందుకు జూన్‌లో కేంద్ర మంత్రివర్గం అనుమతినిచ్చింది. ప్రస్తుతం దేశంలోని 8.5 లక్షలకు పైగా సహకార సంఘాల్లో సుమారు 29 కోట్ల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు.

తొలి రోజు రూ.25 కోట్ల ఆర్డర్లు: తొలివిడతలో రూ.100 కోట్ల వరకు టర్నోవరు/ డిపాజిట్లు ఉన్న సహకార సంఘాలకు పోర్టల్‌లో నమోదయ్యేందుకు అనుమతినిచ్చారు. ఇందుకు అర్హత ఉన్న సంస్థల సంఖ్య 589గా గుర్తించగా.. 300కి పైగా సంస్థలు మంగళవారమే నమోదయ్యాయి. తద్వారా కొనుగోలు ఆర్డరు పెట్టే వీలును పొందాయి. వీటిల్లో ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్‌, అమూల్‌, సరస్వత్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లాంటి ప్రముఖమైనవి ఉన్నాయి. మొదటి రోజే రూ.25 కోట్ల విలువైన కొనుగోలు ఆర్డర్లను ఈ సహకార సంఘాలు పెట్టే అవకాశం ఉంది. తొలి రోజు నమోదైన వాటిల్లో బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు 45  ఉన్నాయని మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ పోర్టల్‌పై నమోదయ్యేందుకు అర్హత పరిమితిని మున్ముందు సడలిస్తామని చెప్పారు. ‘సహకార సంఘాల మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరం ఉంది. జీఈఎం పోర్టల్‌ ద్వారా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి. అందువల్ల ఈ పోర్టల్‌పై విక్రయదార్లుగా నమోదుకావాలని సహకార సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నామ’ని ఆయన అన్నారు.

* జీఈఎం పోర్టల్‌పై 61,851 ప్రభుత్వ కొనుగోలుదార్లు, 48.75 లక్షల విక్రయదార్లు, సేవా సంస్థలు నమోదయ్యాయి. 10,000 ఉత్పత్తులు, 288 సేవల విభాగంలో 45 లక్షలకు పైగా ఉత్పత్తులను జాబితాలో చేర్చాయి. ఇప్పటివరకు రూ.2,78,504 కోట్ల విలువైన 1.08 కోట్ల ఆర్డర్లు ఈ ప్లాట్‌ఫాం ద్వారా పూర్తయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని