Gail: గెయిల్‌ బోనస్‌ షేర్లపై 26న నిర్ణయం

ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా, షేర్‌ క్యాపిటల్‌ను రెట్టింపు చేయాలని భావిస్తోంది. గ్యాస్‌ సరఫరా, పంపిణీకి పరిమితం కాకుండా స్పెషాలిటీ రసాయనాలు, శుద్ధ ఇంధన వ్యాపారాల్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.

Updated : 10 Aug 2022 02:31 IST

షేర్‌ క్యాపిటల్‌ రూ.10,000 కోట్లకు
స్పెషాలిటీ రసాయనాలు, శుద్ధ ఇంధన వ్యాపారాల్లోకి ప్రవేశం

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా, షేర్‌ క్యాపిటల్‌ను రెట్టింపు చేయాలని భావిస్తోంది. గ్యాస్‌ సరఫరా, పంపిణీకి పరిమితం కాకుండా స్పెషాలిటీ రసాయనాలు, శుద్ధ ఇంధన వ్యాపారాల్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రూ.5000 కోట్లుగా ఉన్న అధీకృత షేర్‌ క్యాపిటల్‌ను రూ.10000 కోట్లకు పెంచేందుకు గెయిల్‌ వాటాదార్ల అనుమతిని సంస్థ కోరింది. వచ్చే 3-4 ఏళ్లలో విస్తరణ ప్రణాళికలకు ఈ నిధులను కంపెనీ వినియోగించనుంది. 2030 నాటికి ప్రాథమిక ఇంధన వినియోగంలో గ్యాస్‌ వాటాను రెట్టింపునకు పైగా పెంచి, 15 శాతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా గెయిల్‌ జాతీయ గ్యాస్‌ గ్రిడ్‌ నిర్మాణానికి సహజగ్యాస్‌ ట్రక్‌ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేయడంతో సిటీ గ్యాస్‌ సరఫరా వ్యవస్థలను విస్తరిస్తోంది. ‘వచ్చే 3-4 ఏళ్లలో గెయిల్‌కు దాదాపు రూ.30,000 కోట్ల మూలధన ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో కొంతమేర అంతర్గతంగా సమీకరించడంతో పాటు మరికొంత రుణంగా సమీకరించనుంది. ఇందులో ఈక్విటీ మార్గాలు కూడా ఉన్నాయి.

ప్రతి 2 షేర్లకు 1 బోనస్‌ షేరు: వాటాదార్లకు బోనస్‌ ఈక్విటీ షేర్లను జారీ చేయడానికి చూస్తున్నట్లు’ గెయిల్‌ వాటాదార్లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి 2 షేర్లకు 1 బోనస్‌ షేరు ఇవ్వాలన్నది సంస్థ ప్రణాళిక. ఈనెల 26న నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై వాటాదార్ల అనుమతిని సంస్థ కోరనుంది.

ఇథనాల్‌ ప్లాంట్ల ఏర్పాటుకు: పెట్రోల్‌లో కలిపేందుకు వీలుగా బయోమాస్‌ నుంచి ఉత్పత్తి చేసే శుద్ధ ఇంధనం కోసం ఇథనాల్‌ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. శుద్ధ హైడ్రోజన్‌ వ్యాపారంపై కూడా ఆసక్తిగా ఉన్నట్లు గెయిల్‌ వెల్లడించింది. ఎనర్జీ ఎక్స్ఛేంజీలో ఈక్విటీ వాటా తీసుకోవాలని, సోలార్‌ గ్లాస్‌, మాడ్యూల్‌ తయారీ సంస్థలను స్వాధీనం చేసుకోవడంపైనా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. రోజంతా విద్యుదుత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పే ప్రణాళికలోనూ సంస్థ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని