Published : 11 Aug 2022 05:52 IST

ఇష్టారీతిన రికవరీ అంటే చర్యలే

అధిక వడ్డీల వసూలు చెల్లదిక
‘డిజిటల్‌’ రుణాలు నేరుగా స్వీకర్త ఖాతాలోనే
థర్డ్‌పార్టీ ద్వారా ఇవ్వొద్దు: ఆర్‌బీఐ

ముంబయి: డిజిటల్‌ రుణాల రంగంలో పెరుగుతున్న మోసాలను అదుపులో ఉంచేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ముందడుగు వేసింది. రుణాల వసూలు నిమిత్తం ఇష్టమొచ్చినట్లు, అనైతిక పద్ధతులను అవలంబించడాన్ని నిరోధించే చర్యలకు దిగింది. అధిక వడ్డీ రేట్ల వసూలుకూ పగ్గాలు వేసేలా సవివర మార్గదర్శకాలను బుధవారం ఆర్‌బీఐ జారీ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నియంత్రణలోని సంస్థలు లేదా ఇతర చట్టాల ద్వారా రుణాలివ్వడానికి అనుమతులు ఉన్న కంపెనీలు మాత్రమే రుణవ్యాపారంలో ఉండాలంటూ తాజా నియంత్రణలను జారీ చేసింది.

థర్డ్‌పార్టీల జోక్యానికి కళ్లెం: థర్డ్‌ పార్టీల జోక్యం భారీగా పెరగడం, డేటా గోప్యతకు భంగం కలిగించడం, సహేతుకం కాని వ్యాపార ధోరణులను అవలంబించడం తదితరాలకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. 2021 జనవరి 13న ‘ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా ఇచ్చే రుణాల’పై ఒక ‘కార్యచరణ బృందాన్ని’ ఆర్‌బీఐ నియమించింది. ఆ బృందం చేసిన కొన్ని సిఫారసులకు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపింది.
ముఖ్యాంశాలివీ: అన్ని రుణ పంపిణీలు, తిరిగి చెల్లింపులు కేవలం ఆర్‌బీఐ నియంత్రిత సంస్థ(ఆర్‌ఈ), రుణస్వీకర్త మధ్యే జరగాలి. ఏ ఇతర రుణ సేవల సంస్థ(ఎల్‌ఎస్‌పీ) లేదా థర్డ్‌ పార్టీ ద్వారా జరగరాదు.
* రుణ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎటువంటి ఫీజులు, ఛార్జీలు ఉన్నా.. అవి ఆర్‌ఈలే చెల్లించాలి. రుణ స్వీకర్తల నుంచి వసూలు చేయకూడదు.
* కూలింగ్‌ ఆఫ్‌/లుక్‌ అప్‌ పీరియడ్‌లో అసలు మొత్తం, అందుకు తగ్గ వార్షిక రేటును చెల్లించి డిజిటల్‌ రుణాల నుంచి బయటపడొచ్చు. అందుకు ఎటువంటి అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని రుణ ఒప్పందంలో భాగంగా ఉండాలి.
* ఏదైనా రుణ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి ముందే వినియోగదార్లకు ‘కీ ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌’ (కేఎఫ్‌ఎస్‌)ను కచ్చితంగా అందజేయాలి. ఆర్‌ఈలు, వాటి ఎల్‌ఎస్‌పీలు, ఆర్‌ఈలకు చెందిన యాప్‌లు వీటిని తప్పనిసరిగా అనుసరించాలి.
ఫిర్యాదుల పరిష్కారానికి: రుణస్వీకర్తలు దాఖలు చేసే ఏ ఫిర్యాదును అయినా నిర్దేశిత కాల వ్యవధి (ప్రస్తుతం 30 రోజుల)లో ఆర్‌ఈ పరిష్కరించాలి. లేకపోతే రిజర్వ్‌ బ్యాంక్‌-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌(ఆర్‌బీ-ఐఓఎస్‌) కింద రుణస్వీకర్త ఫిర్యాదు చేయొచ్చు.
* అవసరమైన సమాచారాన్నే రుణ యాప్‌లు సేకరించాలి. ఇందుకు రుణస్వీకర్త నుంచి ముందస్తు అనుమతి ఉండాలి. నిర్దేశిత డేటాను వినియోగించుకోవచ్చా, వద్దా అన్నది రుణ స్వీకర్తే తేల్చాలి. అంతకు ముందు ఇచ్చిన అనుమతినీ రుణస్వీకర్త రద్దు చేసుకోవచ్చు. సేకరించిన సమాచారాన్ని తొలగించమనీ (డిలీట్‌) అడగొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని