Published : 11 Aug 2022 05:15 IST

31 నుంచి దేశీయ విమాన ఛార్జీలపై పరిమితుల తొలగింపు

దిల్లీ: దేశీయ విమాన ఛార్జీలపై విధించిన పరిమితులను ఆగస్టు 31 నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ బుధవారం ప్రకటించింది. కొవిడ్‌ తొలిదశ లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు 2 నెలలు పూర్తిగా నిలిచిపోయిన విమానాలు, 2020 మే 25న పునఃప్రారంభమైన సమయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి విమాన ఛార్జీలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు విధించారు. తక్కువ ఛార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, గిరాకీకి అనుగుణంగా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచకుండా చూడటం ద్వారా ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఈ పరిమితులు నిర్ణయించినట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 40 నిమిషాల లోపు ప్రయాణాలకు కనీసధర రూ.2900 (జీఎస్‌టీ మినహాయించి) నిర్ణయించారు. ఇందువల్ల చిన్న విమానయాన సంస్థలు మనుగడ సాగించగలుగుతాయి. అదేవిధంగా గరిష్ఠంగా రూ.8800 మించి వసూలు చేయరాదని ఆంక్షలు విధించినందున, ప్రయాణికులకు మేలు కలుగుతుంది.
ఈ నెలాఖరు వరకు అంటే.. దాదాపు 27 నెలల పాటు ఈ పరిమితులు అమల్లో ఉన్నట్లు అవుతుంది. ‘ప్రయాణికుల నుంచి రోజువారీ గిరాకీ, విమాన ఇంధన  (ఏటీఎఫ్‌) ధరలను జాగ్రత్తగా విశ్లేషించాకే, ఛార్జీలపై పరిమితులు తొలగించాలని నిర్ణయించాం. సమీప భవిష్యత్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందనుంది’ అని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక, రికార్డు గరిష్ఠాలకు చేరిన ఏటీఎఫ్‌ ధరలు, కొన్ని వారాలుగా వెనక్కి వస్తున్నాయి. ఆగస్టు 1న దిల్లీలో కిలో లీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.1.21 లక్షలుగా ఉంది. జులై ధరతో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం తక్కువ. ఇది సంస్థలకు ఉపకరించే అంశమే. ప్రయాణికుల గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, కొవిడ్‌ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన శాఖ సూచించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని