సంక్షిప్త వార్తలు

అవంతీ ఫీడ్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.1581.62 కోట్ల ఆదాయాన్ని, రూ.72.79 కోట్ల నికరలాభాన్ని, రూ.4.86 ఈపీఎస్‌ను ఆర్జించింది.

Published : 11 Aug 2022 05:29 IST

అవంతీ ఫీడ్స్‌ లాభం రూ.73 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: అవంతీ ఫీడ్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.1581.62 కోట్ల ఆదాయాన్ని, రూ.72.79 కోట్ల నికరలాభాన్ని, రూ.4.86 ఈపీఎస్‌ను ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1430 కోట్లు, నికరలాభం రూ.76.34 కోట్లు ఉన్నాయి. రొయ్యల ఫీడ్‌, రొయ్యల ప్రాసెసింగ్‌ కార్యకలాపాలపై అధిక ఆదాయాన్ని కంపెనీ నమోదు చేసింది. కానీ వ్యయాలు పెరిగినందున లాభాల్లో వృద్ధి కనిపించలేదు. ముఖ్యంగా ముడిపదార్థాల ఖర్చు బాగా పెరిగిందని సంస్థ పేర్కొంది.


రాజస్థాన్‌లో 10,000 మెగావాట్ల స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులు: ఎస్‌జీవీఎన్‌

దిల్లీ: రాజస్థాన్‌లో 10,000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్లు ఎస్‌జీవీఎన్‌ లిమిటెడ్‌ బుధవారం వెల్లడించింది. ఇందుకు రూ.50,000 కోట్ల పెట్టుబడులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు వెల్లడించింది. రాజస్థాన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ కేటాయించిన స్థలాల్లో ఈ ప్రాజెక్టులను వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఏర్పాటు చేస్తామని ఎస్‌జీవీఎన్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు నంద్‌లాల్‌ శర్మ తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల వల్ల జతచేరే 10,000 మెగావాట్ల సామర్థ్యంతో తమ మొత్తం సామర్థ్యం 32000 మెగావాట్ల నుంచి 42,000 మెగావాట్లకు చేరుతుందని పేర్కొన్నారు.


కాస్త తగ్గిన అమెరికా ద్రవ్యోల్బణం

వాషింగ్టన్‌: చమురుతో పాటు విమాన టికెట్ల నుంచి దుస్తుల వరకు ధరలు కాస్త తగ్గడంతో అమెరికా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జూన్‌లో 40 ఏళ్ల గరిష్ఠమైన 9.1 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం,  జులైలో 8.5 శాతానికి దిగి వచ్చింది. జూన్‌తో పోలిస్తే జులైలో హోటళ్ల గదులు 2.7%; విమాన టికెట్లు 8%, అద్దె కార్లు 9.5% మేర చౌకయ్యాయి. కరోనా అనంతరం ప్రయాణ ఆంక్షలు సడలించడంతో గత ఏడాది కాలంగా ఈ ధరలన్నీ బాగా పెరిగాయి. ఇప్పటికీ విమాన ఛార్జీలు ఏడాది కిందటితో పోలిస్తే 30 శాతం ఎక్కువగానే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు 1.1 శాతం మేర పెరిగాయి. ఏడాది కిందట అయితే 13 శాతం అధికంగా ఉన్నాయి. సగటు వేతనాలు దశాబ్దాల కిందటితో పోలిస్తే వేగంగానే పెరుగుతున్నా.. వ్యయాల స్థాయిలో ఈ వేగం లేదు. దీంతో పదవీ విరమణ చేసిన వారూ మళ్లీ పనులు వెతుక్కోవాల్సి వస్తోంది.  


ఐషర్‌ మోటార్స్‌ లాభం రూ.611 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఐషర్‌ మోటార్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.611 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.237 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే అధికం. అంతర్జాతీయ విపణుల్లో కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదం చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,974 కోట్ల నుంచి రూ.3,397 కోట్లకు పెరిగింది. ద్విచక్రవాహన విభాగం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 1,22,170 నుంచి 42 శాతం పెరిగి 1,86,032కు చేరాయి. ‘అంతర్జాతీయ విపణుల్లో మా అమ్మకాలు 60 శాతానికి పైగా పెరిగాయి. అందుకే మేం అత్యధిక త్రైమాసిక ఆదాయాలను, ఎబిటాను నమోదు చేశామ’ని ఐషర్‌ మోటార్స్‌ ఎండీ సిద్దార్ధ లాల్‌ అన్నారు. అంతర్జాతీయ విపణుల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 17,493 నుంచి 62 శాతం పెరిగి 28,390 కు చేరాయి.


జైడస్‌ లైఫ్‌ లాభంలో 13% క్షీణత

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ నికర లాభం రూ.518 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే మూడు నెలల లాభం రూ.597 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ. దేశీయ మార్కెట్లో తక్కువ అమ్మకాలు ఇందుకు కారణం. కార్యకలాపాల ఆదాయం  రూ.4,002 కోట్ల నుంచి రూ.4,073 కోట్లకు పెరిగింది. కొవిడ్‌ సంబంధిత ఉత్పత్తుల అమ్మకాలను మినహాయిస్తే, వ్యాపారం 12 శాతం వృద్ధి చెందింది. ‘2022-23 తొలి త్రైమాసికంలో స్థిరమైన పనితీరుతో మాకు మంచి ప్రోత్సాహం లభించింది. అమెరికా వ్యాపారం పుంజుకోవడం, వర్థమాన మార్కెట్లలోనూ వృద్ధి కొనసాగడం వల్ల ఇది సాధ్యమైంద’ని కంపెనీ ఎండీ శర్విల్‌ పటేల్‌ పేర్కొన్నారు. భారత బ్రాండెడ్‌ ఫార్ములేషన్‌ వ్యాపారంలో కొవిడ్‌ ప్రభావంతో వచ్చిన వృద్ధిని ఇపుడిపుడే సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు.


మస్క్‌ 7 బిలియన్‌ డాలర్ల టెస్లా షేర్ల విక్రయం

న్యూయార్క్‌: ట్విటర్‌తో కొనుగోలు ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల 7 బిలియన్‌ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. గత శుక్రవారం నుంచి మంగళవారం మధ్య ఆయన దాదాపు 7.9 మిలియన్ల షేర్లను విక్రయించినట్లు సమాచారం. 44 బి.డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదర్చుకున్న మస్క్‌.. ఆ సంస్థ వాస్తవ వినియోగదార్ల సంఖ్య, ఇతర కీలక సమాచారం విషయంలో తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ వెనక్కి తగ్గారు. ట్విటర్‌ కొనుగోలు నిమిత్తం ఏప్రిల్‌లో 8.5 బి.డాలర్ల విలువైన వాటాలను అమ్మారు. మరిన్ని షేర్లను విక్రయించబోనని ఆ సమయంలో మస్క్‌ చెప్పడం గమనార్హం. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్‌ వెనక్కి తగ్గడంపై, ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీనిపై అక్టోబరులో విచారణ జరగనుంది. ఒకవేళ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనని న్యాయస్థానం మస్క్‌ను ఆదేశిస్తే.. ఆయనకు 33 బి.డాలర్ల నిధులు అవసరమవుతాయి.


లిఖిత ఇన్‌ఫ్రా లాభం రూ.14 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.13.91 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.10.15 కోట్లతో పోలిస్తే ఈసారి 37 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ.56.05 కోట్ల నుంచి 45.5 శాతం అధికమై రూ.81.57 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు కూడా రూ.42.53 కోట్ల నుంచి రూ.63.15 కోట్లకు పెరిగాయి.


మెడ్‌ప్లస్‌ లాభం రూ.3.67 కోట్లు

హైదరాబాద్‌: ఔషధ దుకాణాల నిర్వహణతో పాటు, డయాగ్నొస్టిక్‌ సేవలందిస్తున్న మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఏప్రిల్‌-జూన్‌లో రూ.3.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.46.35 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.959.39 కోట్ల నుంచి రూ.1003.78 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 232 విక్రయశాలలను ప్రారంభించిందని మెడ్‌ప్లస్‌ ఎండీ, సీఈఓ గంగడి మధుకర్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెండు పూర్తి స్థాయి డయాగ్నొస్టిక్‌ కేంద్రాలు, 75 సేకరణ కేంద్రాలకు చేరామని అన్నారు.


పిట్టీ ఇంజినీరింగ్‌ లాభంలో 59% వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల సంస్థ పిట్టీ ఇంజినీరింగ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.311.06 కోట్ల ఆదాయాన్ని, రూ.11.71 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక ఆదాయం రూ.175.90 కోట్లతో పోలిస్తే ఈసారి 76.90 శాతం వృద్ధి కనిపించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.7.36 కోట్లతో పోలిస్తే 59.10 శాతం వృద్ధి నమోదయ్యింది.


హైదరాబాద్‌లో టైటన్‌ స్మార్ట్‌ ల్యాబ్స్‌

హైదరాబాద్‌ (రాయదుర్గం), న్యూస్‌టుడే: వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా స్మార్ట్‌ వాచ్‌ విభాగంలో సరికొత్త ఆవిష్కరణల కోసం, గడియారాల ఉత్పత్తి సంస్థ టైటన్‌ స్మార్ట్‌ ల్యాబ్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. వినూత్న సాంకేతికత, డిజైన్‌, అభివృద్ధి సేవలను ఈ కేంద్రం అందించనుంది. బుధవారం తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ దీన్ని ప్రారంభించారు. టైటన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీకే వెంకటరామన్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ వాచ్‌లలో సృజనాత్మక ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని